నగదురహిత లావాదేవీలకు ఊతం
భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గత డిసెంబరులో విడుదల చేసిన డిజిటల్ రూపాయి ఒకవిధంగా అధికారిక క్రిప్టోకరెన్సీ వంటిది. దాన్ని కేంద్ర బ్యాంకు జారీచేసిన డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు.
భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గత డిసెంబరులో విడుదల చేసిన డిజిటల్ రూపాయి ఒకవిధంగా అధికారిక క్రిప్టోకరెన్సీ వంటిది. దాన్ని కేంద్ర బ్యాంకు జారీచేసిన డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు. ఆర్‌బీఐ దశల వారీగా డిజిటల్ రూపాయిని తెస్తోంది. మొదట దాన్ని బెంగళూరు, భువనేశ్వర్, ముంబయి, దిల్లీలలో చిల్లర లావాదేవీలకు ఉపకరించేలా విడుదల చేశారు.
డిజిటల్ రూపాయి లేదా కేంద్ర బ్యాంకు జారీచేసిన డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అనేది మామూలు ద్రవ్యమే. అది నాణేలు, కరెన్సీ నోట్లలాగా కాకుండా ఎలెక్ట్రానిక్ రూపంలో ఉంటుంది. చెల్లింపుదారుడు, చెల్లింపులను అందుకొనే వ్యక్తి లేదా సంస్థ డిజిటల్ రూపాయి వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్‌ల ద్వారా జమలు, చెల్లింపులు జరిపే సౌలభ్యం ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల్లో యూపీఐ లావాదేవీలు చెల్లింపుదారు, చెల్లింపు గ్రహీత ఖాతాల్లో నమోదు అవుతాయి. డిజిటల్ రూపాయల్లో ఈ పద్ధతి ఉండదు. అవి వ్యాలెట్లలో ఉంటాయి కాబట్టి డిజిటల్ రూపాయి లావాదేవీలను ఆర్‌బీఐ కేంద్రీకృతంగా నమోదు చేస్తుంది. ప్రజలు ఆర్‌బీఐ ప్రకటించిన బ్యాంకుల నుంచి డిజిటల్ రూపాయలను కొనవచ్చు. వారికి ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉండాల్సిన అవసరం లేదు. అలా కొనుగోలు చేసిన వాటిని వారు ఇతరుల వ్యాలెట్లలోకి జమ చేయవచ్చు. మామూలు నగదులాగే వాటినీ తమ లావాదేవీల కోసం ఇతరులకు అధికారికంగా పంపవచ్చు, వారి నుంచి స్వీకరించవచ్చు.
డిజిటల్ రూపాయల వల్ల ప్రభుత్వానికి కరెన్సీ, నోట్ల ముద్రణ, రవాణా వ్యయాలు తగ్గుతాయి. యూపీఐ లావాదేవీల ఖర్చూ వాటికి ఉండదు. నగదు రహిత లావాదేవీలు పెరగడానికి డిజిటల్ రూపాయలు తోడ్పడతాయి. లావాదేవీలు వేగంగా, సునాయాసంగా జరగడానికి, చెల్లింపుల వ్యవస్థలో నవీకరణ సాధించి, సామర్థ్యం పెంచడానికి అవి దోహదం చేస్తాయి. ప్రైవేటు క్రిప్టో కరెన్సీలకున్న సౌలభ్యం డిజిటల్ రూపాయికీ ఉంటుంది. దేశాల మధ్యా డిజిటల్ లావాదేవీలు ఊపందుకొంటాయి. డిజిటల్ రూపాయలు మామూలు కరెన్సీ నోట్ల మాదిరిగా మాసిపోవు, నలిగిపోవు, చిరిగిపోవు. జేబులోని పర్సులా డిజిటల్ వ్యాలెట్ చోరీ కాదు. జమాఖర్చులను తేలిగ్గా నమోదు చేసుకోవచ్చు.
కొంతమందికి మాత్రం డిజిటల్ రూపాయలతో చిక్కులు ఏర్పడవచ్చు. రూపాయి రాకడ, పోకడపై ఆర్బీఐ కన్నువేసి ఉంచుతుంది. అందువల్ల నగదు లావాదేవీల్లో గోప్యతకు వారు వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది. చిల్లర లావాదేవీలు జరిపేవారు భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద మొత్తాలను బదిలీ చేసేవారు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి రావచ్చు. తమ లావాదేవీల గుట్టుమట్లను ప్రభుత్వం ఇతర విధాలుగా ఉపయోగించుకోవచ్చనే భయం వారిని వెన్నాడుతుంది. అక్రమ నగదు చలామణీ, ఉగ్రవాదులకు నిధుల పంపకం, పన్ను ఎగవేతలకు బిట్‌కాయిన్ వంటి ప్రైవేటు క్రిప్టోల మీద ఆధారపడేవారు, అధికార డిజిటల్ కరెన్సీకి దూరంగా ఉంటారనడంలో సందేహం లేదు.
దేశీయంగా ప్రస్తుతం చాలా గ్రామాల్లో పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సౌలభ్యం లేదు. అందువల్ల పల్లెపట్టుల్లో ఇప్పట్లో డిజిటల్ రూపాయల లావాదేవీలు పుంజుకోవడం కష్టం. మరోవైపు సైబర్ చౌర్యం వంటి భయాల నుంచి పూచీ ఇచ్చే బాధ్యత రిజర్వు బ్యాంకుది కాబట్టి చట్టబద్ధ లావాదేవీలకు ప్రైవేటు రంగం డిజిటల్ రూపాయలను ఎక్కువగా ఉపయోగించవచ్చు. వ్యక్తులు, చిల్లర వ్యాపారాలు సైతం వాటిని విరివిగా ఉపయోగించే అవకాశం ఉంది. డిజిటల్ రూపాయి ఆర్‌బీఐ విడుదల చేసిన అధికారిక నగదు కాబట్టి దాన్ని మామూలు రూపాయల్లోకి మార్చుకోవచ్చు. డిజిటల్ కరెన్సీని రూపాయి, 100, 500 రూపాయలుగా విడుదల చేయవచ్చు. బ్యాంకుల ద్వారా పంపిణీ అయ్యే డిజిటల్ రూపాయలను మొబైల్ ఫోన్లలో, ఇతర సాధనాల్లో భద్రపరచుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా వ్యాపారికి డిజిటల్ రూపాయలు చెల్లించే సౌలభ్యం ఉంది. డిజిటల్ రూపాయలు వడ్డీని ఆర్జించి పెట్టవు. అయితే, వాటిని బ్యాంకు డిపాజిట్లుగా మార్చుకొని వడ్డీ సంపాదించవచ్చు. ఆర్‌బీఐ డిజిటల్ రూపాయిని గత నవంబరు నుంచి టోకుగా, డిసెంబరు నుంచి చిల్లరగా చలామణీలోకి తెచ్చింది. వాటిని ఎంత మొత్తంలో విడుదల చేశారు, వాటి ఖాతాదారులెవరు అనే అంశాలను ఇంకా బహిర్గతం చేయలేదు.
శ్రీరామ్ చేకూరి (ఆర్థిక, విదేశీ వాణిజ్య నిపుణులు)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: మద్యం మత్తులో భార్య, కుమార్తె హత్య
-
Ap-top-news News
AP Govt: మార్చి నెల జీతాలు ఎప్పుడొస్తాయో?
-
Crime News
Duranto Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్..
-
Crime News
Couple Suicide: కరోనా దెబ్బకు నెమ్మదించిన వ్యాపారం.. అధిక వడ్డీలకు అప్పులతో..