ఆదివాసులకు అందని అభివృద్ధి ఫలాలు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా ఆదివాసులకు అసలైన సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించడంలో ప్రభుత్వ వ్యవస్థలు విఫలమవుతున్నాయి. ఈ తరుణంలో దేశీయంగా తీవ్ర దుర్భర స్థితిలో ఉన్న ఆదివాసీ సమూహాల (పీవీటీజీల) సామాజిక, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కేంద్రం తాజా బడ్జెట్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా ఆదివాసులకు అసలైన సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించడంలో ప్రభుత్వ వ్యవస్థలు విఫలమవుతున్నాయి. ఈ తరుణంలో దేశీయంగా తీవ్ర దుర్భర స్థితిలో ఉన్న ఆదివాసీ సమూహాల (పీవీటీజీల) సామాజిక, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కేంద్రం తాజా బడ్జెట్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. అయితే, ఆదివాసుల అసలు సమస్యలను గుర్తిస్తేనే వారి సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది.
భారత జనాభాలో ఆదివాసుల వాటా 8.6శాతం. గిరిజన తెగల్లో కొన్ని కాలక్రమంలో ప్రధాన జన స్రవంతిలో కలిశాయి. చాలా సమూహాలు నేటికీ అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి. 1961లో యూఎన్ ఢేబార్ నేతృత్వంలోని కమిషన్ మొదటగా ఇండియాలో అత్యంత దుర్భర స్థితిలో ఉన్న ఆదివాసీ తెగలపై ప్రత్యేక దృష్టి అవసరమని సూచించింది. పోడు వ్యవసాయం, వేట, అటవీ ఆధారిత జీవనోపాధులు, జనాభా క్షీణత, అక్షరాస్యత, భిన్నమైన కట్టుబాట్లు వంటి అంశాల ఆధారంగా 705 గిరిజన తెగల్లో 75 సమూహాలను అత్యంత వెనకబాటుకు గురవుతున్న ఆదివాసీ తెగలు (పీవీటీజీలు)గా కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 30 లక్షల పైచిలుకు జనాభా పీవీటీజీల కిందకు వస్తుంది. ఈ తెగలు భిన్నమైన సంప్రదాయాలు, భాషలు కలిగి ఉంటాయి. దాదాపు 19 తెగల జనాభా కేవలం వెయ్యిలోపే.
అన్యాక్రాంతం కాకుండా...
క్లిష్టమైన పర్వత, అటవీ ప్రాంతాల్లో నివసించే పీవీటీజీలకు రహదారులు, రవాణా, సురక్షిత తాగునీరు, ఆరోగ్యం, విద్యా వసతులు కరవయ్యాయి. పౌష్టికాహార లోపం, జనాభా క్షీణత వంటి సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. ఈ సమూహాల అభివృద్ధి కోసం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ 1998 నుంచి పీవీటీజీల సంరక్షణ, అభివృద్ధి ప్రణాళిక (సీసీడీపీ)ను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల ద్వారా పాతికేళ్లుగా అమలవుతున్న ఈ పథకం ద్వారా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా ఆశించిన ప్రయోజనం ఉండటంలేదు. పదేళ్ల క్రితం జాతీయ సలహా మండలి సీసీడీపీలో సమూల మార్పులు అవసరమని సూచించింది. తాజా బడ్జెట్లో ప్రకటించిన ‘పీఎం పీవీటీజీ అభివృద్ధి మిషన్’ ద్వారా వచ్చే మూడేళ్లలో ఆయా తెగల అభ్యున్నతికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం తలపెట్టింది. ఆయా తెగలకు ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం, వారి ఆవాస ప్రాంతాలకు రహదారులు, రవాణా, సమాచార, సాంకేతిక వసతులతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం దీని లక్ష్యం. అయితే, పీవీటీజీల అసలు సమస్యలు తెలుసుకోకుండా ఇలాంటివి ఎన్ని తెచ్చినా సరైన ప్రయోజనం ఉండదు.
పీవీటీజీలు నేడు తమ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తమను ఉద్ధరించకున్నా, తమ సమూహాల మనుగడను ప్రమాదంలోకి నెట్టకుండా ఉంటే చాలన్న భావన వారిలో నెలకొంది. దీన్ని తొలగించి వారి భద్రమైన జీవనానికి భరోసా కల్పించాలి. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం వారికి అటవీ వనరులపై వ్యక్తిగత, సాముదాయిక హక్కులను కల్పించాలి. ఒకవేళ ఆ వనరులపై హక్కులు కోల్పోయే సందర్భాల్లో పునరావాసం, నష్టపరిహారం అందించడం తప్పనిసరి. పీవీజీటీల వాస్తవ స్థితిగతులను గుర్తించేందుకు వీలుగా ఆ సమూహాల జనగణనలో సామాజిక, మానవ పరిశోధన, గిరిజన పరిశోధన సంస్థలు, నిపుణులకు భాగస్వామ్యం కల్పించాలి. ఆయా తెగల సంప్రదాయాలను గౌరవించేలా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో గ్రామసభలు, అటవీ హక్కుల గుర్తింపు కమిటీలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలి. పీవీటీజీల ఆవాసాలు, భూములను ఇతర ఆదివాసీ తెగలు, గిరిజనేతరులు లాక్కోకుండా సరైన చర్యలు తీసుకోవడం అత్యావశ్యకం.
అసలు సమస్యలు గుర్తించి...
అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం గ్రామసభల అనుమతి మేరకే బాక్సైట్ గనుల తవ్వకాలకు అనుమతించాలని ఒడిశాలోని దొంగ్రియా కొందు గిరిజనుల వ్యాజ్యంలో గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయి వ్యవస్థల్లో అవగాహన పెంపొందించాలి. పీవీటీజీల సంక్షేమం కోసం పనిచేసే సిబ్బందికి ఆ తెగలకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలి. గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి ప్రణాళికలు నిర్దేశిత అయిదో షెడ్యూల్ ప్రాంతాల్లోనే అమలవుతున్నాయి. చాలా చోట్ల పూర్తిస్థాయిలో గిరిజనులు ఉన్న ప్రాంతాలు అయిదో షెడ్యూల్‌లో లేవు. దానివల్ల ఎంతోమందికి అన్యాయం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా గిరిజన జనాభా ఉన్న అయిదు వందలకు పైగా గ్రామాలను అయిదో షెడ్యూలు ప్రాంతాల్లో చేర్చాలనే ప్రతిపాదన కాగితాల్లోనే ఉంది. ఈ క్రమంలో పీఎం పీవీటీజీ అభివృద్ధి మిషన్‌లో భాగంగా వెనకబడిన ఆదివాసీ తెగల అసలు సమస్యలను గుర్తించాలి. సంప్రదాయ ఆచార వ్యవహారాలకు భంగం వాటిల్లకుండా వారిని ప్రగతి బాట పట్టించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు