గజరాజుకు కష్టకాలం

ఏనుగులు జీవ వైవిధ్యానికి తోడ్పడుతూ ఆవరణ వ్యవస్థ ఇంజినీర్లుగా గుర్తింపు పొందుతున్నాయి. దంతాల కోసం వేటాడటం, ఆవాసాలు దెబ్బతినడం గజరాజుల పాలిట శాపాలుగా మారాయి. వాటి సంరక్షణకు పాలకులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.

Updated : 06 Feb 2023 05:59 IST

ఏనుగులు జీవ వైవిధ్యానికి తోడ్పడుతూ ఆవరణ వ్యవస్థ ఇంజినీర్లుగా గుర్తింపు పొందుతున్నాయి. దంతాల కోసం వేటాడటం, ఆవాసాలు దెబ్బతినడం గజరాజుల పాలిట శాపాలుగా మారాయి. వాటి సంరక్షణకు పాలకులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.

ట్టమైన అరణ్యాల్లో ఏనుగులు ఏర్పరచిన దారులు మరెన్నో జంతువులకు మార్గాలుగా అక్కరకొస్తాయి. శక్తిమంతమైన ఏనుగులు నీటి కోసం నేలను తవ్వుతాయి. అప్పటికే ఉన్న నీటి స్థావరాలను విస్తృతపరుస్తాయి. ఇతర జీవరాసులకూ ఆ నీటి మడుగులు ఉపయోగపడతాయి. సుదూర ప్రాంతాలను చుట్టే గజరాజులు తమ పేడ ద్వారా ఎన్నోరకాల విత్తనాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తాయి. ఏనుగులు తినే ఆహారంలో దాదాపు సగం జీర్ణం కాకుండా విసర్జితం అవుతుంది. అది ఇతర కీటకాలకు ఆహారంగా మారుతుంది. మొక్కలకు సేంద్రియ ఎరువుగానూ ఉపయోగపడుతుంది. ఆవరణ వ్యవస్థలో ఇంత కీలకమైన ఏనుగుల మనుగడ నానాటికీ సంక్లిష్టంగా మారుతోంది. 

ఏనుగు దంతాలకు అంతర్జాతీయంగా గిరాకీ ఉంది. అదే గజరాజుల పాలిట శాపంగా మారింది. దంతాలు, మాంసం, ఇతర శరీర భాగాల కోసం రోజూ దాదాపు 100 ఆఫ్రికా ఏనుగులను అక్రమార్కులు వధిస్తున్నట్లు ఒక అంచనా. మొజాంబిక్‌లో 1977-92 మధ్యకాలంలో అంతర్యుద్ధ సమయంలో ఎన్నో ఏనుగులను దంతాలకోసం వధించారు. ఏనుగు దంతాల అక్రమ వ్యాపారానికి వ్యతిరేకంగా 2016లో కెన్యా ఏకంగా 105 టన్నుల ఏనుగు దంతాలను దహనం చేసింది. 1989లో మనుగడ ప్రమాదంలో ఉన్న జాతుల అంతర్జాతీయ ఒప్పందం (సీఐటీఈఎస్‌)- ఏనుగు దంత వ్యాపారాన్ని నిషేధించింది. అయినా, జపాన్‌తో పాటు మరికొన్ని ఐరోపా దేశాల్లో వాటి చట్టబద్ధ వ్యాపారం కొనసాగుతోంది. ఆసియా దేశాల్లో దంతాల అక్రమ వ్యాపారం ఏనుగుల వధకు దారితీస్తోంది. ఏనుగుల అక్రమ వధ నివారణ పర్యవేక్షణ కార్యక్రమం (మైక్‌) గజరాజుల మరణాలకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అందిస్తోంది. భారత్‌లో 10 ఎలిఫెంట్‌ రిజర్వుల్లో మైక్‌ కార్యక్రమం, ప్రధానంగా ఐరోపా సమాఖ్య ఆర్థిక సహకారంతో అమలవుతోంది.

వ్యవసాయం, మానవ నిర్మాణాలు, అభివృద్ధి పనుల వల్ల ఆవాసాలను కోల్పవడం లేదా అవి ముక్కలవడమూ ఏనుగులకు మరో తీవ్ర సమస్యగా పరిణమించింది. దానివల్ల మానవులు-ఏనుగుల ఘర్షణ ఇటీవలి కాలంలో అధికమైంది. ఏనుగులను, వాటి ఆవాసాలను కాపాడటానికి, మానవులు-ఏనుగుల మధ్య ఘర్షణËను నివారించడానికి, పెంపుడు ఏనుగుల సంక్షేమం వంటి వాటికోసం భారత్‌లో 1992లో ‘ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌’ కార్యక్రమం ప్రారంభమైంది. మానవులు-ఏనుగుల మధ్య తలెత్తుతున్న ఘర్షణ సమస్యను అధిగమించడానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ 2020 ఆగస్టులో సురక్ష్య పేరుతో జాతీయ పోర్టల్‌ను ప్రారంభించింది. 2010 నుంచి జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును పరిగణిస్తున్నాం. 

దేశీయంగా ప్రతి అయిదేళ్లకోసారి ఏనుగుల జనాభాను లెక్కిస్తారు. 2017 అంచనాల ప్రకారం ఇండియాలో ఇరవై ఏడు వేలకు పైగా ఏనుగుల జనాభా 23 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం భారత్‌లో 32 ఎలిఫెంట్‌ రిజర్వులు ఉన్నాయి. దేశీయంగా అత్యధిక సంఖ్యలో ఏనుగులు కర్ణాటక రాష్ట్రంలో కనిపిస్తాయి. వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఏనుగుల జనాభాను కలపడానికి వీలుగా 88 కారిడార్లను గుర్తించారు. అందులో కొన్ని ఆక్రమణకు గురయ్యాయి. కొన్నింటిలో రైల్వే మార్గాలు ఉన్నాయి. 1987-2017 మధ్య కాలంలో 267 ఏనుగులు రైల్వేమార్గాలు దాటుతూ మరణించాయని ఒక అంచనా. ఒక్క ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రాంతంలోనే 1990-2022 మధ్య కాలంలో 120 ఏనుగులు రైళ్లు ఢీకొని ప్రాణాలు కోల్పోయాయి. 

నానాటికీ తరిగిపోతున్న ఏనుగులను కాపాడుకోవాలంటే దెబ్బతిన్న వాటి ఆవాసాలను పునరుద్ధరించాలి. రోడ్లు, కాలువలు, రైలుమార్గాలు వంటివి ఉన్నచోట ఏనుగుల సంచారానికి, వలసలకు విఘాతం కలగకుండా వంతెనలు, అండర్‌ పాస్‌లను ఏర్పాటు చేయాలి. కృత్రిమ మేధ సాయంతో ఈశాన్య సరిహద్దురైల్వే పరిధిలో అస్సాములోని లుండింగ్‌, అలీపుర్‌ దువార్‌ డివిజన్లలో 70 కిలోమీటర్ల మేర ఏనుగు కారిడార్‌లో 2022 ఆగస్టు నుంచి గజరాజుల మరణాలను పూర్తిగా నిరోధించారు. ఏనుగులు సంచరించే అన్ని ప్రాంతాలకు ఈ తరహా విధానాన్ని విస్తరించాలి. గజరాజుల వేట నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమూ తప్పనిసరి. ఏనుగు దంతాల అక్రమ వ్యాపారంపై అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే గజరాజుల సంరక్షణ సాధ్యమవుతుంది.

ఎం.ఆర్‌.మోహన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.