భగ్గుమంటున్న పుడమి
భూతాపం ప్రపంచానికి పెను విపత్తుగా మారుతోంది. మానవ చర్యల వల్ల వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువు, ఉద్గారాలు భారీగా చేరుతున్నాయి. వీటికి తోడు సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత పుడమిపైనే నిలిచిపోతుండటం (గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్)తో ఉష్ణోగ్రతలు...
భూతాపం ప్రపంచానికి పెను విపత్తుగా మారుతోంది. మానవ చర్యల వల్ల వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువు, ఉద్గారాలు భారీగా చేరుతున్నాయి. వీటికి తోడు సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత పుడమిపైనే నిలిచిపోతుండటం (గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్)తో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి.
భూమి సగటు ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. కొన్నేళ్లుగా ఈ ఉష్ణోగ్రతలు మునుపటికన్నా వేగంగా పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో ‘గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ (హరితగృహ ప్రభావం)’ ఒకటని పరిశోధకులు ధ్రువీకరించారు. భూమిపైకి వచ్చే సౌరశక్తి పరావర్తనం చెంది తిరిగి అంతరిక్షంలోకి వెళ్ళడం పరిపాటి. అయితే, గ్రీన్‌హౌస్ వాయువులు ఈ శక్తిని గ్రహించి, తిరిగి దాన్ని భూమిపైకే చేరవేస్తున్నాయి. ఈ హరితగృహ ప్రభావానికి పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాల వల్ల వెలువడే ఉద్గారాలు తోడవుతున్నాయి. దాంతో భూతాపం పెరిగి, వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఇబ్బడిముబ్బడిగా ఉద్గారాలు
గ్రీన్‌హౌస్ వాయువుల్లో అత్యంత ప్రభావం చూపేది- నీటి ఆవిరి. ఇది వాతావరణంలో కొన్ని రోజులే ఉంటుంది. బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డైఆక్సైడ్) మాత్రం చాలాకాలం కొనసాగుతుంది. అడవులు, సముద్రాలు వంటి సహజ జలవనరులు ఈ వాయువును పీల్చుకుని వాతావరణాన్ని సమతౌల్యం చేస్తాయి. పారిశ్రామిక కార్యకలాపాలు, శిలాజ ఇంధనాలను మండించడం వంటి చర్యల వల్ల బొగ్గుపులుసు వాయువు ఇబ్బడిముబ్బడిగా వాతావరణంలోకి విడుదలవుతోంది. దీనికి తోడు అడవులను కాల్చివేస్తుండటంతో పచ్చదనం తగ్గి, భూతాపం అంతకంతకు పెరుగుతోంది. 1760లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు స్థాయులు ఇప్పుడు 30శాతం మేర పెరిగాయి. మానవ చర్యల వల్ల మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి ఇతర గ్రీన్‌హౌస్ ఉద్గారాలు వెలువడుతున్నా, కార్బన్ డైఆక్సైడ్ అంతటి పరిమాణంలో అవి ఉండటం లేదు. పారిశ్రామిక విప్లవం ముందునాళ్లతో పోలిస్తే- ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్ మేర పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ లెక్కగట్టింది. గత రెండు దశాబ్దాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆ సంస్థ విశ్లేషించింది. సగటు సముద్రమట్టం 2005-2015 మధ్య 3.6 మిల్లీమీటర్ల మేర పెరిగింది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో మంచు కరిగి, నీరు వ్యాకోచిస్తుండటమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనదాలు కనుమరుగవుతున్నాయి. ఆర్కిటిక్ సముద్రం, గ్రీన్‌ల్యాండ్స్, పశ్చిమ అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు కొన్నేళ్లుగా రికార్డు స్థాయుల్లో కరుగుతోంది. తూర్పు అంటార్కిటికాలోనూ త్వరలో ఈ పరిణామం మొదలుకానున్నట్లు తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. జంతువులు, పంటలపైనా వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. మొక్కల్లో పూలు పూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. జంతువులు ఆవాసం కోసం కొత్త ప్రాంతాలకు వలస వెళ్తున్నాయి.
పటిష్ఠ చర్యలు అవసరం
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) 1992లో ప్రతిపాదించిన అంతర్జాతీయ ఒప్పందానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. భూతాపానికి కారణమవుతున్న కార్యకలాపాలను నియంత్రించాల్సిన అవసరాన్ని గుర్తించాయి. ఆ దిశగా 2015లో రూపొందించిన పారిస్ వాతావరణ ఒప్పందంపై పలు దేశాలు సంతకాలు చేశాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 1.50 డిగ్రీల సెంటిగ్రేడుకు పరిమితం చేయాలని లక్షించాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్‌ప్రభుత్వ మండలి (ఐపీసీసీ)- వాతావరణంలో మార్పులు వేగంగా, తీవ్రస్థాయుల్లో చోటుచేసుకుంటున్నట్లు 2021 నాటి నివేదికలో హెచ్చరించింది. ఆ కారణంగానే వరదలు, తీవ్రస్థాయి వడగాల్పులు, కరవు పరిస్థితులు నెలకొంటున్నాయని, జాతులు అంతరించిపోవడం, మంచు ఫలకలు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషించింది. ఇప్పటికే వాతావరణంలో గ్రీన్‌హౌస్ ఉద్గారాలు ఆందోళనకర స్థాయుల్లో చేరాయని, ఇవి చాలాకాలం పాటు ఉంటాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో 2021లో నిర్వహించిన వాతావరణ సదస్సు (కాప్-26) సందర్భంగా భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఆ ప్రకారం ఇండియా శిలాజేతర ఇంధన వనరుల నుంచి 500 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనుంది. దేశంలో కర్బన ఉద్గారాలను 2030 నాటికి 45 శాతానికిపైగా తగ్గించేందుకు అంగీకరించింది. ఉద్గారాలను 2070 నాటికి సున్నాస్థాయికి తీసుకొచ్చేందుకూ సిద్ధపడింది. ఆ దిశగా భారత్ సమర్థంగా చర్యలు చేపట్టాలి. వాతావరణ మార్పుల కారణంగా వాటిల్లే పెను విపత్తుల నుంచి బయటపడే సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
వి.వి.హరిప్రసాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MS Dhoni : ధోనీ బటర్ చికెన్ ఎలా తింటాడంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఉతప్ప
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్‌కు దుబాయ్‌లో బ్రెయిన్‌వాష్.. జార్జియాలో శిక్షణ..!
-
Politics News
Mamata Banerjee: ఆయన విపక్షాలను నడిపిస్తే.. మోదీని ఎదుర్కోలేం..!
-
Movies News
Kangana Ranaut: ఎలాన్ మస్క్ ట్వీట్.. సినిమా మాఫియా తనని జైలుకు పంపాలనుకుందంటూ కంగన కామెంట్
-
General News
Delhi liquor case: ఈడీ ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ కోసం మూడో రోజు వేట.. మామ, డ్రైవర్ లొంగుబాటు