అంతర్జాతీయ తోడ్పాటుతో డ్రాగన్‌కు అడ్డుకట్ట

భారత్‌లోకి ఉగ్రమూకలను ఎగదోస్తున్న లష్కరే తొయిబా ఉప సారథి అబ్దుల్‌ రెహమాన్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది.

Published : 09 Feb 2023 00:06 IST

భారత్‌లోకి ఉగ్రమూకలను ఎగదోస్తున్న లష్కరే తొయిబా ఉప సారథి అబ్దుల్‌ రెహమాన్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది. సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ కొద్దిరోజులుగా ఐరాస తీర్మానానికి చైనా మోకాలడ్డింది. చివరకు అది మనసు మార్చుకొంది.

గ్ర సంస్థ లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) రాజకీయ వేదిక జమాత్‌ ఉద్‌ దవాకు అబ్దుల్‌ రెహమాన్‌ మక్కీ నేతృత్వం వహిస్తున్నాడు. ఎల్‌ఈటీ అధినేత హఫీజ్‌ సయీద్‌కు అతడు సమీప బంధువు. భారత్‌లో ఉగ్ర దాడులకు కుట్రలు పన్నడం, నిధుల సేకరణ, యువతను ఉగ్రవాదం వైపు మళ్ళించడం వంటి కార్యకలాపాలకు మక్కీ పాల్పడుతున్నాడు. భారత్‌లో జరిగిన పలు హింసాత్మక ఘటనల వెనక ప్రధాన వ్యూహకర్త అతడేనన్నది నిఘావర్గాల సమాచారం. ఎర్రకోట, రాంపుర్‌, ముంబయి దాడుల్లో అతడి పాత్రే కీలకం. కశ్మీరీ ఉగ్రవాదులకు మద్దతుగా ఇస్లామాబాద్‌లో నిర్వహించే ర్యాలీల్లో మక్కీ పాల్గొని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. కశ్మీర్‌ను పాక్‌కు అప్పగించకుంటే ఉగ్ర దాడులు తప్పవని హెచ్చరించాడు. భారత్‌కు వ్యతిరేకంగా ఇంతలా చెలరేగిపోతున్నా పాక్‌ ప్రభుత్వం మక్కీని నియంత్రించలేదు. ఇటీవల అతణ్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంతో ఇతర దేశాల్లో ఆస్తులు స్తంభింపజేయడం, అంతర్జాతీయ ప్రయాణాలు, ఆయుధాల కొనుగోళ్లపై నిషేధం వంటివి అమలులోకి వస్తాయి.

ఉగ్ర సంస్థల కార్యకలాపాలను నిలువరించేందుకు 1999లో ఐరాస భద్రతా మండలి 1267 కమిటీని ఏర్పాటు చేసింది. 2001లో అమెరికాపై ఉగ్ర దాడుల అనంతరం దాన్ని పటిష్ఠంగా రూపొందించారు. ప్రస్తుతం దాన్ని అల్‌ఖైదా, ఐసిస్‌లపై ఆంక్షల కమిటీగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భద్రతా మండలిలోని అయిదు శాశ్వత, ఇతర సభ్యదేశాలు సభ్యులుగా ఉంటాయి. అంతర్జాతీయ ఉగ్రవాదిగా లేదా సంస్థగా ప్రకటించాలంటే భద్రతా మండలిలోని అన్ని దేశాలూ ఏకాభిప్రాయానికి రావాలి. పాక్‌ కేంద్రంగా ఇండియాపై ఉగ్ర చర్యలకు చేయూతనిస్తున్న మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు జారీ చేసిన తీర్మానానికి గతంలో చైనా గండి కొట్టింది. సుదీర్ఘ కాలం తరవాత డ్రాగన్‌ తీరు మారడంతో మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి మార్గం సుగమమైంది. గతంలోనూ జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చైనా పలుమార్లు మోకాలడ్డింది. ఇప్పటికీ ఉగ్రవాదులు అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌, షహీద్‌ మహమ్మద్‌లను కట్టడి చేసేందుకు ఐరాస తీర్మానాలను చైనా అడ్డుకొంటోంది.

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న బీజింగ్‌ దుర్నీతిని అంతర్జాతీయ సమాజం ఎదుట ఎండగట్టేందుకు భారత్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదానికి పాక్‌ ఎలా కేంద్రంగా నిలుస్తోందో ప్రపంచానికి వెల్లడించడంలో దిల్లీ విజయం సాధించింది. ఈ క్రమంలో మక్కీ విషయంలో డ్రాగన్‌ తన మంకుపట్టును సడలించక తప్పలేదు. మరోవైపు మక్కీపై భద్రతా మండలి ప్రవేశపెట్టిన తీర్మానానికి రష్యా సైతం మద్దతు పలకడం డ్రాగన్‌ను మింగుడు పడలేదు. ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్‌ యుద్ధం విషయంలో ఇండియా తటస్థ ధోరణిని అవలంబిస్తోంది. దాంతో మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మాస్కో మొగ్గు చూపింది. ఫలితంగా చివరకు చైనా సైతం దిగి వచ్చింది. మక్కీ విషయంలో చైనా వెనక్కి తగ్గినంత మాత్రాన దాన్ని ఎంతమాత్రం నమ్మడానికి లేదని, డ్రాగన్‌ దుష్టబుద్ధిపై ఇండియా ఎప్పుడూ ఒక కన్ను వేసిఉంచాలన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అంతర్జాతీయంగా బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించేందుకు బీజింగ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్య సాధనలో భాగంగానే మక్కీపై తీర్మానానికి ఆమోదం పలికింది. ప్రపంచం అభిప్రాయం మేరకే చైనా వైఖరిలో మార్పు వచ్చింది. మరోవైపు చైనాలో మైనారిటీలైన వీగర్లు తిరుగుబాటుకు దిగుతారన్న భయంతో లక్షల మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించి ఎలాంటి తీవ్రవాద భావాలు లేని విద్యను జిన్‌పింగ్‌ సర్కారు బోధిస్తోంది. పొరుగు దేశమైన భారత్‌లో ఎంతోమంది అమాయకుల ప్రాణ నష్టానికి కారణమైన పాక్‌ ఉగ్రవాదుల పట్ల మాత్రం డ్రాగన్‌ సానుభూతితో వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే భద్రతా మండలి ఉగ్ర వ్యతిరేక తీర్మానాలను ఏదో ఒక సాకుతో అడ్డుకొంటోంది. చైనా కుయుక్తులను అధిగమించేందుకు భారత్‌ అంతర్జాతీయంగా తోడ్పాటును కూడగట్టాల్సిన అవసరం ఉంది. వాస్తవాధీన రేఖ వెంట నిత్యం ఎక్కడో ఒకచోట చైనా బలగాలు సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతాల్లోనూ చైనా యుద్ధ నౌకల సంచారం పెరిగింది. ఇండియా సైనిక పరంగా సంసిద్ధమైతేనే డ్రాగన్‌ సవాళ్లను దీటుగా తిప్పికొట్టగలుగుతుంది.

 కె.శ్రీధర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.