ఐరోపాకు పరిశ్రమల వలస గుబులు
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరుడు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన ఐరోపా సమాఖ్య ఇప్పుడు ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరుడు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన ఐరోపా సమాఖ్య ఇప్పుడు ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. చర్యకు ప్రతిచర్య అన్నట్లు మాస్కో సహజవాయు సరఫరాను తెగ్గోయడంతో ఐరోపా పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. దానికి తోడు అమెరికా తెచ్చిన ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టంతో ఐరోపాలో ఉత్పత్తి కార్యకలాపాలు గిట్టుబాటు కావడంలేదు.
చైనా నుంచి ఇబ్బడిముబ్బడిగా వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. వాటి వల్ల ఎదురవుతున్న పోటీని ఐరోపా పరిశ్రమలు తట్టుకోలేకపోతున్నాయి. దానికి తోడు నిరుడు ఆగస్టులో అమెరికా ప్రభుత్వం తెచ్చిన ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం ఐరోపా దేశాలకు గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. అమెరికా చట్టం- హరిత ఇంధనాలు, ఎలెక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ, కృత్రిమ మేధ, రోబోలు, కంప్యూటర్లతో అధునాతన పారిశ్రామికోత్పత్తిని ప్రోత్సహించాలని కంకణం కట్టుకుంది. అందుకు వేల కోట్ల డాలర్లను రుణాలు, పెట్టుబడులు, పన్ను రాయితీలుగా అందిస్తోంది. ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలో ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ, సౌర విద్యుత్ క్షేత్రాల ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు సమకూరాయి. వచ్చే పదేళ్లలో కొత్తగా లక్షా 70వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు వస్తాయని, 2030కల్లా అమెరికా జీడీపీ అదనంగా ఒక శాతం పెరుగుతుందని, 90 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా!
అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీలు, పన్నురాయితీల వల్ల ఐరోపా నుంచి పరిశ్రమలు అక్కడికి తరలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఐరోపాలో రసాయనాలు, లోహాలు, గాజు, ఎరువులు, కాగితం, కాగితపు గుజ్జు, పింగాణి, సిమెంటు పరిశ్రమలు తీవ్ర ఇంధన కొరతతో సతమతం అవుతున్నాయి. ఈ పరిశ్రమలు 80 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిలో అత్యధికం తరలిపోతే తీవ్ర ఇక్కట్లు తప్పవన్న ఆందోళన ఈయూ నేతల్లో వ్యక్తమవుతోంది. జర్మనీకి చెందిన ప్రముఖ రసాయన సంస్థ బీఏఎస్‌ఎఫ్ ఇప్పటికే ఐరోపాలో తన ఉత్పత్తి కార్యకలాపాలను తగ్గించింది. మరో జర్మన్ కంపెనీ ఫోక్స్‌వ్యాగెన్ సైతం ఐరోపాలో కార్ల ఉత్పత్తి ఖరీదైన వ్యవహారంగా మారిందంటూ హెచ్చరించింది. ఐరోపా దేశాల్లో ఆటొమొబైల్ పరిశ్రమ కోటీ 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఐరోపాలోని పరిశ్రమలు అమెరికా, చైనాల వైపు చూస్తున్నాయని యూరప్ అంతర్గత విపణి కమిషనర్ థియెరీ బ్రెటన్ ఇప్పటికే హెచ్చరించారు. ఐరోపాలో సహజవాయు ధరలు పదేళ్ల సగటు ధరలకన్నా ఆరు రెట్లు అధికంగా, అమెరికాతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఐరోపాలోని భారీ పరిశ్రమలు అమెరికాకు తరలిపోతాయన్న ఆందోళన పెరుగుతోంది. ఇదే జరిగితే ఉద్యోగాలు గల్లంతై కార్మిక సంఘాలు బలంగా ఉన్న ఐరోపా దేశాలు రాజకీయంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. దీన్ని నివారించేందుకు ఇంధన కొరత, పోటీతత్వ సమస్యలను పరిష్కరించుకోవడంపై ఈయూ నేతలు దృష్టి సారించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా విజయం సాధించగల సమర్థ నూతన పారిశ్రామిక విధానాన్ని చేపట్టకపోతే తమ పరిశ్రమలు క్రమంగా అంతరించిపోతాయని ఐరోపా దౌత్యవేత్త ఒకరు ఘాటుగా హెచ్చరించారు.
ఇంధన సమస్యను ఎదుర్కొనేందుకు ఐరోపాలో హరిత ఇంధన రంగంలో కృషి జరుగుతోంది. 2022లో ఐరోపాలో తిరిగిన ఎలెక్ట్రిక్ వాహనాల్లో సగం అక్కడ తయారైన లిథియం బ్యాటరీలనే ఉపయోగించాయి. ఈ దశాబ్దం చివరి నాటికి ఐరోపా ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్యాటరీ తయారీదారుగా ఆవిర్భవిస్తుందన్న అంచనాలు వినిపించాయి. అంతలోనే అమెరికా ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం రావడంతో బ్యాటరీ రంగంలో పెట్టుబడులు ఐరోపా నుంచి అమెరికాకు తరలిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలెక్ట్రిక్ వాహన బ్యాటరీల్లో వినియోగించే లోహాల్లో 40శాతాన్ని, విడిభాగాల్లో 50శాతాన్ని 2024కల్లా అమెరికా నుంచి సేకరిస్తేనే పూర్తి పన్ను రాయితీలు లభిస్తాయని ఆ చట్టం నిర్దేశించడమే ఈ ఆందోళనకు కారణం. ఈ పన్ను రాయితీలు 2032 వరకు లభిస్తాయి. అమెరికా ఇలా స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ విదేశీ కంపెనీల ఎగుమతులకు ఆటంకాలు కలిగించడం ఐరోపాను ఇరకాటంలోకి నెడుతోంది. 2050 నాటికి కర్బన ఉద్గారాలను కట్టడి చేయడం ద్వారా వాతావరణ మార్పులను అరికట్టాలని ప్రధాన దేశాలు అంగీకరించాయి. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే హరిత ఇంధనాలవైపు మళ్ళక తప్పదు. ఆ దిశగా అమెరికా, ఐరోపా దేశాలు, చైనా, భారత్‌లు పరుగు పందెం ప్రారంభించాయి. ఇందులో ఏ దేశం ముందున్నా యావత్ భూగోళానికి అది శుభవార్తే అవుతుంది.
ప్రసాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: డ్రైవర్‌కు గుండెపోటు.. కారును ఢీకొట్టిన లారీ
-
India News
Manish Sisodia: ఆరోపణలు తీవ్రమైనవి.. బెయిల్ ఇవ్వలేం : సిసోదియాకు హైకోర్టు షాక్
-
Sports News
CSK vs GT: పరిస్థితి ఎలా ఉన్నా.. అతడి వద్ద ఓ ప్లాన్ పక్కా!
-
Crime News
Delhi: సాక్షి హంతకుడిని పట్టించిన ఫోన్‌కాల్..!
-
Movies News
Sonu sood: అనాథ పిల్లల కోసం.. సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్
-
India News
PM Modi: ‘నా ప్రతి నిర్ణయం.. మీ కోసమే’: మోదీ