మందమతుల ఉచితసలహాలు!
వినేవాళ్లను వెర్రినాగన్నలను చేయడమెలాగన్న అంశం మీద పోటీపెడితే మొదటి బహుమతి ఎవరికొస్తుంది? సహజంగా రాజకీయ నాయకులకు ఆ కళలో తిరుగుండదు కాబట్టి పురస్కారాలన్నీ వాళ్లకే దక్కుతాయి.
వినేవాళ్లను వెర్రినాగన్నలను చేయడమెలాగన్న అంశం మీద పోటీపెడితే మొదటి బహుమతి ఎవరికొస్తుంది? సహజంగా రాజకీయ నాయకులకు ఆ కళలో తిరుగుండదు కాబట్టి పురస్కారాలన్నీ వాళ్లకే దక్కుతాయి. కానీ, గాలిమాటలతో జనాన్ని ఏమార్చడంలో నేతాశ్రీలతో యమగట్టిగా పోటీపడే వర్గమొకటి ఈమధ్యకాలంలో తయారైంది. అదే... స్వయంప్రకటిత సోషల్ మీడియా మేతావుల మంద! ఆ బాపతు జనంలో కొంతమందికి వైద్యంలో ఓనమాలూ తెలియవు... అంతెందుకు వైరస్‌కు, బ్యాక్టీరియాకూ తేడా ఏమిటో కూడా ఆ మరుగుజ్జు మెదళ్లకు అర్థంకాదు. కానీ, ఏ రోగాలు ఎందుకు వస్తున్నాయో, మరే జబ్బులకు ఎటువంటి మందులు మింగాలో వాళ్లే చెప్పేస్తుంటారు. ఇంకొందరుంటారు... ఇడ్లీరవ్వ, బొంబాయి రవ్వలను పక్కపక్కన పెడితే ఏది ఏదో గుర్తుపట్టలేని మహానుభావులు! అటువంటి తెలివిమంతులు కూడా ‘అది తింటే పోతారు... ఇది తింటే సన్నపడతారు’ అని ధాటిగా ఉపన్యాసాలిస్తుంటారు. అటువంటి మట్టిబుర్రల ప్రసంగాలు, ముఖాముఖీ కార్యక్రమాలతో సామాజిక మాధ్యమాలిప్పుడు వట్టి అజ్ఞానపు కంపు కొడుతున్నాయి. తెలిసీతెలియనితనంతో ఆ అర్ధజ్ఞానుల చచ్చుపుచ్చు సలహాలను పాటిస్తున్న సామాన్యుల ఆయురారోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
కరోనా రోజుల్లో సామాజిక మాధ్యమాలన్నీ నకిలీ వార్తలూ, ఊరూపేరూ లేని వ్యక్తులు పుట్టించిన వదంతులతో నిండిపోయాయి. అటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు విజ్ఞానవేత్తలు, వైద్యనిపుణులు కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ తాజాగా పిలుపిచ్చారు. ‘కొవిడ్ టీకాలపై జరిగిన దుష్ప్రచారం కొన్ని వేలమందిని బలితీసుకొంది...తప్పుడు సమాచారంతో వ్యాక్సిన్లను వేయించుకోకుండా ప్రాణాలపైకి తెచ్చుకున్నారు చాలామంది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. టీకాలు మనుషులను చంపేస్తాయని, లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని, వాటిని తీసుకున్న వారికి పిల్లలు పుట్టరని... ఇలా ఒకటా రెండా- అజ్ఞాత అరాచకవాదులు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో గుమ్మరించిన చెత్త వాదనలు అన్నీఇన్నీ కావు. ఏ పుట్టలో ఏ పాముందోనన్న భయంతో వాటిని గుడ్డిగా నమ్మేసిన అనేక మంది టీకాల స్వీకరణకు మొదట్లో ముందుకు రాలేదు. దానికితోడు వంటింటి చిట్కాలతోనే కరోనా భూతాన్ని తరిమేయవచ్చంటూ పనికిమాలిన మాటలు చెప్పినవాళ్లూ కోకొల్లలు. ముక్కులో నిమ్మరసాన్ని పిండుకుంటే కొవిడ్ రాదన్న వెర్రిమొర్రి సూచన అలా పుట్టుకొచ్చిందే. దాన్ని తు.చ.తప్పకుండా పాటించిన ఓ కర్ణాటక ఉపాధ్యాయుడు అప్పట్లో అన్యాయంగా చనిపోయాడు. మంచేదో చెడేదో పదిమందికీ చెప్పాల్సిన గురువులే తప్పుడు సమాచార ఉద్ధృతిలో కొట్టుకుపోతుంటే- ఇక వాట్సాప్‌లోనో ఫేస్‌బుక్‌లోనో వచ్చేవన్నీ నిజాలేననుకునే మామూలు వ్యక్తుల పరిస్థితేమిటి?
నీళ్లు తోడటానికి చేంతాడు సరిపోవడం లేదంటేే- ఆ బావి పూడ్చేసి ఇంకోటి తవ్వుకోమన్నాడట వెనకటికో పెద్దమనిషి. దాంపత్య సమస్యల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు అన్నింటి మీదా సోషల్ మీడియాలో స్వయంప్రకటిత నిపుణుల సూచనలూ అలాగే అఘోరిస్తుంటాయి. అడ్డూఅదుపూ లేని యూట్యూబ్ ఛానెళ్లు కొన్ని ఆ మందబుద్ధుల మాటల మురుగుకు వాహకాలవుతున్నాయి. లైకులు, వీక్షణలు, తద్వారా వచ్చిపడే చిల్లరడబ్బుల కోసం- ‘మీ ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఒక్క పనిచేయండి చాలు...’ అంటూ ఎవరెవరో వల్లెవేసే అసత్యాలను అవి విరివిగా ప్రచారంలోకి తెస్తున్నాయి. ఉత్త పుణ్యానికి జనాన్ని భయపెట్టి పైశాచిక ఆనందం పొందే గుంపులూ సామాజిక మాధ్యమాల్లో తిష్ఠవేశాయి. లేనిపోని వ్యాధులు, వైరస్‌ల పేరిట ప్రజలను అవి భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. ‘ఒమిక్రాన్‌లో ఎక్స్‌బీబీ అనే కొత్త వేరియంట్ ఒకటి వచ్చింది.. దాని బారినపడ్డ వారిలో కొవిడ్ లక్షణాలేమీ కనపడవు కానీ, అది చాలా ప్రాణాంతకమైనది’ అనే సందేశమొకటి ఇటీవల వాట్సాప్‌లో తెగ చక్కర్లు కొట్టింది. అదంతా తప్పుడు సమాచారమేనని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మొన్న డిసెంబరులో ట్వీట్ చేసింది. సర్కారు అక్కడితో చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? ఇటువంటి వదంతులు ప్రజలను మానసికంగా చాలా కుంగదీస్తాయి. భవిష్యత్తు మీద ఆశను చంపేసే నైరాశ్యంలోకి వారిని నెట్టేస్తాయి. వైరస్ కంటే అతిప్రమాదకరమైన అబద్ధాలను సృష్టించి, సామాజిక మాధ్యమాల ద్వారా వాటిని వ్యాప్తి చేసేవారిని గుర్తించి అరదండాలు వేయాలి కదా! అటువంటి సమర్థ వ్యవస్థే దేశంలో కొరవడింది. అదే అదనుగా 75కోట్ల స్మార్టుఫోన్లు, 80కోట్ల అంతర్జాల వినియోగదారులు కలిగిన భారతావనిలో నకిలీ వార్తలు క్షణాల్లో ఇంటింటికీ చేరిపోతున్నాయి. కరోనాకు సంబంధించి ఇండియాలో పురుడు పోసుకున్నన్ని పుక్కిటి పురాణాలు మరెక్కడా పుట్టుకురాలేదని 138 దేశాల్లో జరిగిన ఒక అధ్యయనం తేల్చింది. శాస్త్రవేత్తలను, విజ్ఞానశాస్త్రాన్ని అవహేళన చేసే పెడధోరణులు కొంత కాలంగా మన దేశంలో వెర్రితలలు వేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పొంగిపొర్లుతున్న అసత్యాలకు అవే పునాదులవుతున్నాయి.
కార్చిచ్చుల్లా వ్యాపించే విష వదంతులు- వివిధ రంగాలకు తీరని నష్టంచేస్తున్నాయి. కోళ్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందన్న తప్పుడు వార్తతో ఆమధ్య పౌల్ట్రీ పరిశ్రమకు ఒక్క నెలలోనే రూ.1750 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. పౌల్ట్రీతో ముడివడిన సోయాబీన్, మొక్కజొన్న రైతులపైనా ఆ ప్రతికూల ప్రభావం పడింది. ఇటువంటివే మరెన్నో ఉదంతాలు లోగడ వెలుగుచూశాయి. జనాన్ని తప్పుదోవ పట్టించే నకిలీ వార్తలతో పాటు యూట్యూబ్ వంటి వేదికల్లో సమాజానికి హానికరమైన సమాచారం ఎంతగా అందుబాటులో ఉంటోందో ప్రభుత్వాలు ఏమైనా పరిశీలిస్తున్నాయా? హరియాణాలోని పానీపత్‌కు చెందిన ఒక ప్రబుద్ధుడు చేతబడి వీడియోలు చూస్తూ... దానిలో ప్రావీణ్యం సంపాదించాలనుకున్నాడు. దానికోసం నరబలిగా... ఏడేళ్ల చిన్నారిని హత్యాచారం చేశాడు. అతిజుగుప్సాకరమైన నేరాలను ప్రోత్సహించే దృశ్యాలకు సామాజిక మాధ్యమాలు వేదికలు కావడమేమిటి... ఆ ఘోరాన్ని పాలకులు కళ్లప్పగించి చూడటమేమిటి? ఇది చాలదన్నట్లు వైద్యులుగా, వెల్‌నెస్ నిపుణులుగా అవతారాలెత్తి అమాయకులను బురిడీకొట్టిస్తున్న మోసగాళ్ల సంఖ్యా విపరీతమవుతోంది. అటువంటి వారి పెడపోకడలపై కర్ణాటక హైకోర్టు నిరుడు ఆందోళన వ్యక్తంచేసింది. సామాజిక మాధ్యమాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సూడో థెరపిస్టులను కట్టడిచేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించింది. వదంతులను మొగ్గలోనే తుంచేయాలంటే- ఆయా రంగాలకు చెందిన నిపుణులు వాటిని సకాలంలో ఖండించాలి. నిజానిజాలను వివరిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలి. శాస్త్ర సాంకేతిక వైద్య రంగాలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ప్రజావళికి వేగంగా అందించేందుకు ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలి. కానీ, నకిలీ వార్తల కట్టడి ముసుగులో పౌరుల భావప్రకటన స్వేచ్ఛకు కళ్లాలు బిగించడంపైనే పాలకులు ఎక్కువగా శ్రద్ధాసక్తులను కనబరుస్తున్నారు. సామాజిక ఆరోగ్యాన్ని కుళ్లబొడుస్తున్న తప్పుడు సమాచారానికి నిజంగా సంకెళ్లు వేసే సమగ్ర వ్యూహాన్ని వారెప్పటికి అనుసరిస్తారు?
శైలేష్ నిమ్మగడ్డ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు
-
Movies News
Pathu Thala: వారికి థియేటర్లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్..
-
Politics News
Bandi sanjay: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?
-
Politics News
Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్కాల్?: హరీశ్‌రావు ఫైర్