బైక్ ట్యాక్సీలకు పెరుగుతున్నఆదరణ
భారతీయ నగరాలు, పట్టణాల్లో ర్యాపిడో, ఉబర్, ఓలా సంస్థల మోటార్ బైక్ ట్యాక్సీలకు గిరాకీ పెరుగుతోంది. ట్యాక్సీలు, ఆటోలకన్నా బైక్ ట్యాక్సీలు తక్కువ ధరకే సులువుగా వేగంగా రవాణా సౌకర్యం అందిస్తున్నాయి.
భారతీయ నగరాలు, పట్టణాల్లో ర్యాపిడో, ఉబర్, ఓలా సంస్థల మోటార్ బైక్ ట్యాక్సీలకు గిరాకీ పెరుగుతోంది. ట్యాక్సీలు, ఆటోలకన్నా బైక్ ట్యాక్సీలు తక్కువ ధరకే సులువుగా వేగంగా రవాణా సౌకర్యం అందిస్తున్నాయి. దాంతో మధ్యతరగతి ప్రయాణికులు వాటివైపు మొగ్గు చూపుతున్నారు. ర్యాపిడో యాప్ ఒక్కటే జనవరి నాటికి కోటి డౌన్‌లోడ్‌లను నమోదు చేసిందంటే గిరాకీ ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు.
దేశమంతటా 21 కోట్ల స్కూటర్లు, మోటార్ బైక్‌లు ఉన్నాయి. వాటి యజమానుల్లో చాలామంది పరిమిత లేదా పూర్తి కాలానికి బైక్ ట్యాక్సీ యాప్‌ల ద్వారా ఉపాధి పొందుతూ ఎంతో కొంత ఆదాయం కళ్లజూస్తున్నారు. బైక్ ట్యాక్సీలు 20 లక్షల మందికి ఉపాధి కల్పించగలవని, ఏటా రూ.41,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలవని అంచనా. దేశంలో బైక్ ట్యాక్సీలు వారానికి కోటి నుంచి 1.20 కోట్ల వరకు రైడ్‌లను అందిస్తున్నాయి. వాటిలో నాలుగో వంతు దేశరాజధాని దిల్లీలోనే నడుస్తున్నాయి. అయితే, బైక్ ట్యాక్సీలు రవాణా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ దిల్లీ ప్రభుత్వం ఫిబ్రవరిలో వాటిని నిషేధించింది. అంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి, పుణేలలో ర్యాపిడో బైక్ ట్యాక్సీల లైసెన్సులను నిరాకరించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇకపై ఎలెక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే బైక్ ట్యాక్సీలుగా అనుమతించాలని దిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు తగిన నియమ నిబంధనలను రూపొందించే పనిలో ఉంది. కర్ణాటక ప్రభుత్వం 2021లోనే ఎలెక్ట్రిక్ బైక్ ట్యాక్సీలను అనుమతించింది.
ఇరుకు మార్గాల్లోనూ...
ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో బైక్ ట్యాక్సీలకు విపరీతమైన ప్రాచుర్యం ఉంది. ఆటోలు, కార్లు, బస్సులకన్నా వాటిలో వేగంగా గమ్యస్థానానికి చేరుకునే సౌలభ్యం ఉండటం దీనికి కారణం. భారత్‌లోనూ దీనివల్లనే బైక్ ట్యాక్సీలకు ఆదరణ పెరిగింది. దేశీయంగా బైక్ ట్యాక్సీలను తొలిసారిగా గోవా 1981లోనే అనుమతించింది. ఆ తరవాత మిజోరం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా, గుజరాత్, పశ్చిమ్ బెంగాల్, పంజాబ్ తదితర రాష్ట్రాలూ వాటికి పచ్చజెండా ఊపాయి. మోటారు బైక్‌ను రవాణా సాధనంగా ఉపయోగించుకోవచ్చని, వెనక సీటుపై ఒక ప్రయాణికుడిని తీసుకెళ్ళవచ్చని కేంద్రం 2004లోనే చెప్పింది. రవాణా అనేది ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి మోటారు వాహన చట్టంలోని 72, 73 సెక్షన్ల కింద రాష్ట్రాలు సైతం బైక్ ట్యాక్సీలను అనుమతించవచ్చని 2018లో కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. నగరాలు, పట్టణాల్లో రవాణా రద్దీని తగ్గించడానికి బైక్ ట్యాక్సీలు ఉపకరిస్తాయని కేంద్రం భావిస్తోంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం రవాణా రద్దీ వల్ల మన నగరాల్లో కార్లు, ఆటోలు, బస్సులు గంటకు 15-17 కిలోమీటర్ల వేగంతోనే ముందుకు కదులుతున్నాయి. ఈ నత్తనడక వల్ల వాయు కాలుష్యం, ఇంధన వృథా, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. బైక్ ట్యాక్సీలు గంటకు కనీసం 30 కిలోమీటర్ల వేగంతో పయనించగలవు. అందువల్ల అవి రద్దీ, కాలుష్య నియంత్రణకు తోడ్పడతాయి. ప్రయాణికులు వేగంగా మెట్రో రైలు లేదా బస్సును అందుకోవడానికి బైక్ ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు. మెట్రో లేదా బస్ స్టేషన్‌లో దిగిన తరవాత ఇంటికి చేరుకోవడానికీ బైక్ ట్యాక్సీలను ఎంపిక చేసుకుంటున్నారు. నగరాల్లో 50శాతం బైక్ ట్యాక్సీ ప్రయాణాలు ఇలాంటివేనని ఒక అధ్యయనం వెల్లడించింది. బైక్ ట్యాక్సీలు నగరాల్లోని ఇరుకు మార్గాల ద్వారానూ ప్రయాణిస్తూ తక్కువ ధరకే ప్రజలను ఇళ్లకు చేరుస్తున్నాయి. వారిని గృహాల నుంచి ఆఫీసులకూ తీసుకెళ్తున్నాయి.
మేలైన ప్రత్యామ్నాయం
ఇండియాలో 2030కల్లా పట్టణ జనాభా 63 కోట్లకు చేరనుంది. అప్పటికి భారత జీడీపీలో 70శాతం మహా నగరాలు, పెద్ద పట్టణాల ద్వారానే సమకూరుతుందని అంచనా. దీంతో ఆర్థిక అవకాశాల కోసం పట్టణాలకు వలసలు మరింత పెరిగి రవాణా వంటి మౌలిక వసతులపై విపరీతమైన భారం పడుతుంది. దాన్ని తగ్గించడానికి మెట్రో, సబర్బన్ రైల్వే సర్వీసులను ఉన్నఫళాన విస్తరించడం సాధ్యమయ్యే పని కాదు. కార్లు కొనడం, రైడ్ షేరింగ్ యాప్ ద్వారా కార్లలో ప్రయాణించడం అందరికీ సాధ్యం కాదు. బెంగళూరులో క్యాబ్ ద్వారా ప్రయాణానికి రోజుకు కనీసం రూ.1,000 ఖర్చవుతుంది. అందుకే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఆటోలు, బైక్ ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు. పోనుపోను రాష్ట్రాలు ఎలెక్ట్రిక్ బైక్, ట్యాక్సీలను మాత్రమే అనుమతిస్తామంటే ప్రయాణికులకు వెసులుబాటు తగ్గుతుంది. బైక్ యజమానులకు ఉపాధీ సన్నగిల్లుతుంది. మామూలు వాటికన్నా ఎలెక్ట్రిక్ బైకుల ధరలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. దేశీయంగా ఛార్జింగ్ సదుపాయాలూ అరకొరే. రానున్న అయిదేళ్లలో ఎలెక్ట్రిక్ బైకులకు అన్ని వసతులూ ఏర్పడి, వాటి ధరలు సైతం దిగివచ్చే వరకు సాధారణ బైకులను అనుమతించడం మంచిది. ఏదిఏమైనా రోడ్లపై ఒత్తిడి పెరుగుతూ, సరైన పార్కింగ్, ప్రజారవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న మధ్యతరగతికి బైక్ ట్యాక్సీలు మేలైన ప్రత్యామ్నాయాలు!
ఆర్య
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSRTC: బైక్ ఢీకొనడంతో ప్రమాదం.. దగ్ధమైన ఆర్టీసీ రాజధాని బస్సు
-
India News
India Corona: అమాంతం 40 శాతం పెరిగి.. 3 వేలకు చేరిన కొత్త కేసులు
-
Movies News
Tollywood:యాక్టింగ్‌తో అలరించి.. టేకింగ్‌తో మెప్పించి.. రెండు పడవలపై ప్రయాణించిందెవరంటే?
-
India News
Rahul Gandhi: ‘అప్పీల్ చేసుకునే స్థితిలోనే..’: రాహుల్ అనర్హతపై జర్మనీ స్పందన
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు