వ్యర్థాలతో తీవ్ర అనర్థాలు

పట్టణాలు, నగరాల్లో నానాటికీ వెల్లువెత్తుతున్న ఘన, ద్రవ వ్యర్థాలు పెను సంకటంగా పరిణమిస్తున్నాయి. అవి నేలనూ జలవనరులనూ తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి.   ఈ క్రమంలో దేశీయంగా కొత్తగా పుట్టుకొచ్చే గృహ, వాణిజ్య సముదాయాల్లో వ్యర్థాల శుద్ధికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఇటీవల కేంద్రం ప్రతిపాదించింది.

Published : 20 Mar 2023 00:54 IST

పట్టణాలు, నగరాల్లో నానాటికీ వెల్లువెత్తుతున్న ఘన, ద్రవ వ్యర్థాలు పెను సంకటంగా పరిణమిస్తున్నాయి. అవి నేలనూ జలవనరులనూ తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి.   ఈ క్రమంలో దేశీయంగా కొత్తగా పుట్టుకొచ్చే గృహ, వాణిజ్య సముదాయాల్లో వ్యర్థాల శుద్ధికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఇటీవల కేంద్రం ప్రతిపాదించింది.

భారత్‌లోని పురపాలికల్లో పుట్టుకొచ్చే ఘన వ్యర్థాల్లో మూడో వంతే పునశ్శుద్ధికి నోచుకొంటోంది. 40శాతం డంపింగ్‌ యార్డులు, గోతుల్లోకి చేరి జనావళికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎలెక్ట్రానిక్‌ వ్యర్థాల మేటలూ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మరోవైపు భారత్‌లో వ్యర్థ జలాల శుద్ధి కథ అంతు లేని వ్యధ! పట్టణ భారతంలో నిత్యం పుట్టుకొచ్చే సుమారు ఏడు వేల కోట్ల లీటర్ల మురుగు నీటిలో 28శాతమే శుద్ధి అవుతున్నట్లు నీతి ఆయోగ్‌ నివేదిక నిరుడు చేదు వాస్తవాలు వెల్లడించింది. మిగిలింది నదులు, చెరువుల్లోకి చేరి వాటిని మురికి కూపాలుగా మార్చేస్తోంది. భూగర్భ జలాలనూ అది విషతుల్యం చేస్తోంది. ఇలాంటి దురవస్థలో ఇకపై నూతనంగా ఏర్పడే హౌసింగ్‌ సొసైటీలు, వాణిజ్య సముదాయాలు వ్యర్థాలను సమర్థంగా పునర్వినియోగంలోకి తెచ్చి వాటిని విలువైన వనరులుగా మార్చుకోవాలని, మురుగు నీటి శుద్ధికి ఏర్పాట్లు చేసుకోవాలని ఇటీవల కేంద్రం ప్రతిపాదించింది.

యాంత్రీకరణ కీలకం

చెత్త పునశ్శుద్ధి, దాని నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల భారత్‌లో క్యాన్సర్‌, ఉబ్బసం లాంటి 22 రకాల వ్యాధులు విజృంభిస్తున్నట్లు గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వాస్తవానికి పుష్కర కాలం కిందటే కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు రూపొందించింది. పదహారేళ్ల క్రితం వాటికి పలు సవరణలు తెచ్చింది. ఆ క్యార్యదీక్ష నీరుగారిపోవడంపై గతంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చే వ్యర్థాలతో రోజూ 439 మెగావాట్ల విద్యుత్తు, 13 లక్షల ఘనపు మీటర్ల బయోగ్యాస్‌, సుమారు 15వేల టన్నుల సేంద్రియ ఎరువులను తయారు చేయవచ్చునని పరిశీలనలు చాటుతున్నాయి. చెత్త నుంచి విద్యుత్‌, ఎరువులను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితమే ప్రణాళికలను సిద్ధం చేసింది. వాటిని సమర్థంగా పట్టాలకు ఎక్కించి ఉంటే, వ్యర్థాల పీడ గురించి నేడు ఇంతలా బెంబేలెత్తిపోవాల్సి వచ్చేది కాదు. మరోవైపు వ్యర్థ జలాల ముట్టడి కారణంగా తెలంగాణలోని వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ వంటి ఎన్నో చోట్ల చెరువులు మురుగునీటి కాసారాలుగా మారిపోతున్నాయి. కృష్ణా, తుంగభద్ర నదుల్లో నిత్యం 9.9 కోట్ల లీటర్ల మురుగు- వాటికి సమీపంలోని పుర, నగరపాలికల నుంచే కలుస్తున్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. మురుగునీటి శుద్ధి కేంద్రాలు సరిపడా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యర్థాల పెను సమస్యను తప్పించేందుకు తాజాగా కేంద్రం చేస్తున్న హడావుడి గతంలో మాదిరిగా మూన్నాళ్ల ముచ్చట కాకూడదంటే- పాలకుల చిత్తశుద్ధి క్షేత్రస్థాయిలో అసలైన ఆచరణ రూపం దాల్చాలి. మానవ వ్యర్థాలను చేతులతో తొలగించడాన్ని మూడు దశాబ్దాల క్రితమే భారత్‌లో నిషేధించారు. నేటికీ యాభై ఎనిమిది వేల మందికి పైగా ఆ అమానవీయ వృత్తిలో కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. సెప్టిక్‌ ట్యాంకులు, మురుగు కాలువలు శుభ్రం చేస్తూ 1993 నుంచి వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా కేంద్రం వెల్లడించింది. ఇలాంటి హృదయ విదారక ఘటనలను నిలువరించాలంటే పారిశుద్ధ్య విధుల్లో యాంత్రీకరణ పెరగాలన్న డిమాండ్లు కొంతకాలంగా ఊపందుకొన్నాయి. ఇటీవలి బడ్జెట్లో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యర్థాల నిర్వహణలో వందశాతం యాంత్రీకరణకు కట్టుబాటు చాటారు. అందులో భాగంగా యాంత్రిక పారలు వంటి తక్కువ వ్యయంతో రూపొందించే సాంకేతికతలను ప్రోత్సహించాలని కేంద్రం లక్షించింది. వ్యర్థ జలాల నుంచి సేకరించిన బురదను ఎరువులాగా వాణిజ్యపరంగా వినియోగించడంపైనా కసరత్తు చేయాలని పురపాలికలను కోరింది.

స్ఫూర్తిదాయక విధానం

పారిశుద్ధ్య పనుల్లో రోబోలు, ఇతర యంత్రాల వాడకం జోరెత్తాలంటే అంకుర సంస్థలను పాలకులు ప్రోత్సహించాలి. చేతులతో మానవ వ్యర్థాలను తొలగించే పనిలో ఉన్న వారికి సరైన ఆర్థిక సాయం అందించి మరో మెరుగైన ఉపాధిని చూపించాలి. మురుగు నీటిని వికేంద్రీకరణ విధానంలో ఎక్కడికక్కడ శుద్ధిచేసి పునర్వినియోగించుకోవడంపై నాగ్‌పుర్‌ పరిధిలోని అర్వి పురపాలికలో ‘సీఎస్‌ఐఆర్‌-నీరి’ శాస్త్రవేత్తల ప్రయోగం ఘన విజయం అందుకుంది. దేశీయంగా దాన్ని విస్తరించాలి. సర్కారు దవాఖానాల్లో వ్యర్థ జలశుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నడుంకట్టడం హర్షణీయం. మరోవైపు పుడమికి పెను ముప్పులా పరిణమించిన పునర్వినియోగ ప్లాస్టిక్‌తో రహదారుల నిర్మాణాన్ని జోరెత్తించాలి. అన్ని కర్మాగారాలు తప్పనిసరిగా వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలను ఏర్పాటుచేసేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.

ఎం.వి.బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.