ఖలిస్థాన్‌ ఉద్యమానికి ఉగ్రమూకల ఊతం

పంజాబ్‌లో ఖలిస్థానీ కార్యకలాపాలు మళ్ళీ జోరందుకుంటున్నాయి. ఐఎస్‌ఐతో పాటు విదేశాల్లోని కొన్ని దుష్టశక్తులు ఖలిస్థాన్‌ పేరుతో ఇండియాలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Published : 20 Mar 2023 00:54 IST

పంజాబ్‌లో ఖలిస్థానీ కార్యకలాపాలు మళ్ళీ జోరందుకుంటున్నాయి. ఐఎస్‌ఐతో పాటు విదేశాల్లోని కొన్ని దుష్టశక్తులు ఖలిస్థాన్‌ పేరుతో ఇండియాలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఖలిస్థానీ మద్దతుదారులు కొంతకాలంగా కెనడా, బ్రిటన్‌లలోని హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులతో ఘర్షణలకు దిగుతున్నారు. ఇటీవల ఖలిస్థానీ అనుకూలవాది, వారిస్‌ పంజాబ్‌దే సంస్థ అధినేత అమృత్‌పాల్‌ సింగ్‌ ప్రధాన అనుచరుడిని పంజాబులో పోలీసులు అరెస్టు చేశారు. దానికి నిరసనగా అతడి మద్దతుదారులు అమృత్‌సర్‌కు సమీపంలోని అజ్‌నాలా ప్రాంతంలో కత్తులు, తుపాకులతో వీరంగం ఆడారు. అక్కడి పోలీస్‌స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. ఖలిస్థానీ నినాదాలతో యువతను రెచ్చగొడుతున్న అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ), ఐరోపా దేశాల నుంచి పనిచేస్తున్న ఇతర తీవ్రవాద భావజాల మూకలు ఖలిస్థాన్‌ ఉద్యమాన్ని ఎగదోస్తూ, ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. 2019లో పాక్‌-భారత్‌ మధ్య కర్తార్‌పుర్‌ కారిడార్‌ తెరచుకున్న తరవాత ఖలిస్థానీ ప్రచారం మరింత ఊపందుకొంది. ఐఎస్‌ఐ, పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే తీవ్రవాద ముఠాలు సామాజిక మాధ్యమాల ద్వారా ఖలిస్థానీ ప్రచారాన్ని మరింత జోరెత్తిస్తున్నాయి. కెనడా వంటి దేశాల నుంచి పనిచేస్తున్న సిక్కు గ్రూపుల ఆర్థిక సాయంతో పంజాబులో ఖలిస్థాన్‌ ఉద్యమానికి పునరుజ్జీవం వచ్చినట్లయింది. కెనడాయే కాకుండా ఉత్తర అమెరికా, ఐరోపాలో తీవ్రవాద భావజాల సిక్కు మూకలు ఆయా దేశాల్లోని పరిస్థితులను తమ భావజాలానికి రాజకీయ మద్దతు కూడగట్టేందుకు వినియోగించుకొంటున్నాయి. సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌, ఖలిస్థాన్‌ లిబరేషన్‌ ఫోర్స్‌, బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ వంటి సంస్థలు సోషల్‌ మీడియా వేదికగా అసత్య ప్రచారాలను ముమ్మరం చేశాయి. నిరుడు సెప్టెంబరు 19, నవంబరు ఆరున సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌తో పాటు మరికొన్ని ఖలిస్థానీ అనుకూల ముఠాలు కెనడాలోని బ్రామ్టన్‌, టొరంటోలలో సమావేశాలు ఏర్పాటు చేశాయి. భారత్‌లో ఖలిస్థానీ ఉద్యమ పునరుద్ధరణ నిమిత్తం నిధులను సేకరించేందుకు అవి తోడ్పడ్డాయి. భారతదేశపు అన్నం గిన్నెలా భావించే పంజాబులో గాడి తప్పిన శాంతి భద్రతలు, ఆర్థిక కష్టాలు, మత్తుపదార్థాల విజృంభణ వంటివి అక్కడ వేర్పాటువాద ముఠాల వృద్ధికి ఊతంగా నిలుస్తున్నాయి. పంజాబ్‌ ప్రస్తుతం ఆర్థికంగా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. హరిత విప్లవం కారణంగా రెండు దశాబ్దాల పాటు ఇండియాలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా పంజాబ్‌ నిలిచింది. ప్రభుత్వాలు అలవిగాని ఉచిత పథకాలను అమలు చేయడానికి భారీగా అప్పులు చేయడంతో ఆ రాష్ట్రం రుణ ఊబిలో చిక్కుకొంది. బడ్జెట్‌ నివేదికలను చూస్తే, పంజాబ్‌ బాకీలు 2022-23లో రూ.2.83 లక్షల కోట్ల నుంచి రూ.3.5 లక్షల కోట్లకు పెరిగాయి. ఒక్కో పంజాబీ నెత్తిపై ప్రస్తుతం లక్ష రూపాయల అప్పు ఉంది. నానాటికీ కుంచించుకుపోతున్న వ్యవసాయ దిగుబడులూ ఆ రాష్ట్రానికి శరాఘాతంగా మారాయి. విద్య, వినోదం, క్రీడలు, వ్యాపారం తదితరాలకు సంబంధించి ప్రతిభ కలిగిన వారిని నిలుపుకోవడంలోనూ ఆ రాష్ట్రం ఘోరంగా విఫలమైంది. ఉద్యోగ, వ్యాపార అవకాశాలు లేకపోవడంతో వారంతా ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పంజాబులో ఎంతోమంది మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. ఈ జాడ్యాన్ని నిలువరించడంతో పాటు ఆ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర, పంజాబ్‌ ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

ఖలిస్థానీ ముఠాల భారత వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్రం, ఇంటెలిజెన్స్‌ విభాగం  నిఘాను పటిష్ఠం చేయాలి. సామాజిక మాధ్యమాల్లో ఖలిస్థానీ అసత్య, వేర్పాటువాద ప్రచారాన్ని పటిష్ఠంగా నిలువరించడం తప్పనిసరి. మాదకద్రవ్య భూతం నుంచి పంజాబ్‌ను బంధ విముక్తం చేసి వ్యవసాయంపై సమధిక దృష్టి సారించడం మరో కీలకాంశం. వేర్పాటువాదం పేరుతో దారితప్పుతున్న యువతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి మంచి మార్గంలో నడిపించాలి. గతంలో పంజాబులో పేట్రేగిన ముఠాలను ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణచివేశాయి. ఇప్పుడు దేశ భద్రతకు సవాళ్లు విసురుతున్న దుష్ట శక్తులను కూకటివేళ్లతో పెకలించివేయాలి.

ఎస్‌.నీరజ్‌ కుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.