ఇరాన్‌ సౌదీల కొత్త నెయ్యం

ఇంతకాలం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇరాన్‌, సౌదీ అరేబియా- ఇక దౌత్య సంబంధాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించుకోవాలని నిర్ణయించాయి. ఉభయులకు మధ్యవర్తిగా వ్యవహరించి రాజీ కుదిర్చింది చైనా కావడం విశేషం.

Updated : 21 Mar 2023 06:53 IST

ఇంతకాలం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇరాన్‌, సౌదీ అరేబియా- ఇక దౌత్య సంబంధాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించుకోవాలని నిర్ణయించాయి. ఉభయులకు మధ్యవర్తిగా వ్యవహరించి రాజీ కుదిర్చింది చైనా కావడం విశేషం. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో అమెరికా పెద్దన్న పాత్రకు గండిపడే అవకాశాలున్నాయి.

కప్పుడు పశ్చిమాసియాపై ఆధిపత్యం సాధించేందుకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ పోటీ పడ్డాయి. సోవియట్‌ విచ్ఛిన్నం తరవాత ఈ ప్రాంతంలో ఒక్క సిరియా తప్ప మరే దేశంలోనూ రష్యా చురుకైన పాత్ర పోషించడం లేదు. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ యుద్ధాలకు లక్షల కోట్ల డాలర్లు ధారపోసిన అమెరికా కూడా ఆర్థికంగా అలసిపోయి పశ్చిమాసియాలో తన ప్రమేయాన్ని తగ్గించుకొంటోంది. తనకు, తన మిత్రదేశాలైన ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియాలకూ బద్ధశత్రువైన ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకోవడానికి ఒబామా హయాములో అమెరికా గట్టిగా ప్రయత్నించింది. ఇరాన్‌ అణ్వస్త్ర తయారీ యత్నాలను విరమించుకోవడానికి వీలుగా 2015లో అణు సహకార ఒప్పందం కుదరడానికి చొరవ తీసుకుంది. ఈ ఒప్పందంపై అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లతోపాటు జర్మనీ సైతం సంతకం చేసింది. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైన తరవాత ఇరాన్‌ అణు ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. దాంతో రష్యా, చైనాలకు ఇరాన్‌ బాగా చేరువైంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు ఇరాన్‌ పెద్దయెత్తున డ్రోన్లను సరఫరా చేసింది. చైనా మరోవైపు ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను, ఆ దేశంలోని మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాన్నీ పెంచుకుంది. రక్షణ పరమైన సహకారాన్నీ విస్తృతం చేసింది. తదనుగుణంగా ఇటీవల చైనా, రష్యా, ఇరాన్‌ నౌకాదళాలు ఒమన్‌ సింధుశాఖలో సంయుక్త నౌకా విన్యాసాలు నిర్వహించాయి.

ట్రంప్‌ ఇరాన్‌ను చైనా, రష్యాలకు చేరువయ్యేలా చేయగా, బైడెన్‌ అమెరికా అధ్యక్షుడైన తరవాత సౌదీ అరేబియాను రష్యా, చైనాల వైపు నెట్టారు. 2018లో అమెరికాకు చెందిన పాత్రికేయుడు జమాల్‌ ఖషోగ్గీని తుర్కియేలో హతమార్చిన ఘటనకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మానే కారకుడని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బైడెన్‌ నిందించారు. తీరా దేశాధ్యక్షుడైన తరవాత సల్మాన్‌ను మంచి చేసుకోవడానికి ప్రయత్నించినా అది బెడిసికొట్టింది. రష్యా చమురు ధరకు పరిమితి విధించి మాస్కో ఆర్థిక సత్తాను దెబ్బతీయాలని అమెరికా, ఐరోపా సమాఖ్యలు నిర్ణయించడమే కాదు- అందుకు కలిసి రావాలని సౌదీ అరేబియానూ కోరాయి. తనకు ప్రధాన ఆర్థిక వనరైన చమురు ఎగుమతులను దెబ్బతీసే ఈ నిర్ణయానికి సౌదీ ససేమిరా అంది. అయినా అమెరికా శాసనకర్తలు కొందరు చమురు ధరపై మళ్ళీ పరిమితి విధించాలని కొత్త బిల్లును ప్రవేశపెట్టడం సౌదీకి కోపకారణమైంది. చమురు ఎగుమతులకు డాలర్లలో మాత్రమే చెల్లింపులు స్వీకరిస్తామని 1970లలో సౌదీ అరేబియా నిర్ణయించినందువల్లే ఇవాళ అంతర్జాతీయ కరెన్సీగా డాలర్‌ ఆధిపత్యం చలాయించగలుగుతోంది. ఇకపై చైనా చమురు బిల్లులకు పెట్రో యువాన్లలో చెల్లింపులను స్వీకరించడానికి సౌదీ అరేబియా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అదే జరిగితే డాలర్‌ ఆధిపత్యానికి గండిపడక మానదు.

మరోవైపు పశ్చిమాసియాలో అగ్ర శక్తిగా ఎదగాలని తుర్కియే (టర్కీ) ఆరాటపడటం సౌదీ, ఇరాన్‌లకు రుచించని వ్యవహారం. ఇస్లామిక్‌ ప్రపంచానికి కేంద్ర బిందువైన సౌదీ తన అగ్రేసర పాత్రను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అది  విజన్‌-2030తో శక్తిమంతమైన ఆధునిక రాజ్యంగా అవతరించాలని లక్షిస్తోంది. చమురు దిగుమతులపై ఎంతోకాలం ఆధారపడలేమని గ్రహించి తన ఆర్థిక వ్యవస్థను వైవిధ్యీకరించడానికి నడుంకట్టింది. ఉదారవాద మత భావాలను పుణికిపుచ్చుకోవడం ఆధునిక విద్యా, వైద్య సౌకర్యాలను, హైటెక్‌ పరిశ్రమలను, మౌలిక వసతులను విస్తరించడం సౌదీ విజన్‌-2030లో కీలకాంశాలు. అందులో భాగంగానే 2030కల్లా 100 దేశాలకు రాకపోకలు జరపగల రియాద్‌ ఎయిర్‌ అనే సరికొత్త విమానయాన సంస్థను ప్రారంభించింది. తాజాగా ఇరాన్‌తో రాజీ కుదుర్చుకున్న వెంటనే అమెరికా నుంచి 121 బోయింగ్‌ విమానాలను కొనదలచినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ విధంగా తాను ఎవరి అదుపాజ్ఞల్లోనూ లేనని, తన ప్రయోజనాల కోసం స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తానని సౌదీ అరేబియా చాటుకొంటోంది.

 కైజర్‌ అడపా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు