కట్టు తప్పుతున్న ఓటీటీ

ప్రజల స్వేచ్ఛ, సృజనాత్మకతలను కట్టడి చేయడం ప్రజాస్వామ్య లక్షణం కాదు. అలాగని అసభ్య, అశ్లీల, హింసాత్మక, జుగుప్సాకర దృశ్యాలను సృజనాత్మకత ముసుగులో కప్పిపుచ్చాలనుకోవడం సమాజానికి మేలు చేయదు. చాలా ఓటీటీలు ప్రస్తుతం ఇదే బాటలో సాగుతున్నాయి.

Updated : 23 Mar 2023 06:27 IST

ప్రజల స్వేచ్ఛ, సృజనాత్మకతలను కట్టడి చేయడం ప్రజాస్వామ్య లక్షణం కాదు. అలాగని అసభ్య, అశ్లీల, హింసాత్మక, జుగుప్సాకర దృశ్యాలను సృజనాత్మకత ముసుగులో కప్పిపుచ్చాలనుకోవడం సమాజానికి మేలు చేయదు. చాలా ఓటీటీలు ప్రస్తుతం ఇదే బాటలో సాగుతున్నాయి.

ఓటీటీ వేదికల్లో ప్రదర్శితమవుతున్న అనేక వెెబ్‌సిరీసులు ప్రస్తుతం విశృంఖల దృశ్యాలు, పరమ రోత బూతులతో నిండి ఉంటున్నాయి. యువతపై అవి తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఓటీటీల్లో మితిమీరుతున్న అశ్లీలతపై కేంద్ర సమాచార, ప్రసారశాఖా మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ కొద్దిరోజుల క్రితం స్పందించారు. సృజనాత్మకత పేరిట విచ్చలవిడితనంతో వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అటువంటి ధోరణులను కట్టడి చేయడానికి నిబంధనలను సవరించాల్సి వస్తే ప్రభుత్వం ఆ దిశగా పరిశీలిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఓటీటీల నియంత్రణ చర్చనీయాంశమైంది.

యువతపై విష ప్రభావం

ఓటీటీల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను చూడవచ్చు. సంబంధిత యాప్స్‌ అన్నీ మొబైల్‌లో అందుబాటులో ఉంటున్నాయి. ఎలాంటి వాటినైనా చూడటానికి తగిన ఏకాంతం లభిస్తోంది. అందుకే ఓటీటీలకు ఆదరణ విపరీతమవుతోంది. భారతీయ ఓటీటీ ప్రేక్షకులు రోజుకు సగటున డెబ్భై నిమిషాల పాటు ఆయా వేదికల్లో అందుబాటులో ఉండే వీడియోలను చూస్తున్నట్లు అంచనా. భారతీయ వినోద విపణిలో ప్రస్తుతం ఓటీటీల వాటా ఏడు నుంచి తొమ్మిది శాతం దాకా ఉంది. 2018లో ఆయా ఓటీటీ వేదికలు ఇండియాలో సుమారు రూ.2600 కోట్లు ఆర్జించాయి. ఈ ఏడాది చివరకు అది పన్నెండు వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం 2022లో భారతీయ ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 20శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా సుమారు 43కోట్ల మంది ఓటీటీలను చూస్తుంటే- వారిలో సుమారు పన్నెండు కోట్ల మంది రుసుము చెల్లించి (సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని) వాటిని వీక్షిస్తున్నారు. వీక్షకుల్లో యువతే ఎక్కువ. వారిని ఆకట్టుకోవడానికి దర్శక నిర్మాతలు మితిమీరిన శృంగారం, మాదక ద్రవ్యాల సేవనం, మద్యపానం, పరమ హింసాత్మక దృశ్యాలతో అనేక వెబ్‌సిరీస్‌లను చిత్రీకరిస్తున్నారు. హింసను అతి సాధారణ అంశంగా చూపిస్తున్నారు. నటీనటులతో బూతు సంభాషణలను విచ్చలవిడిగా పలికిస్తున్నారు. మొత్తంగా ఆయా సిరీస్‌లు టీనేజర్ల మనసుల్లో పరోక్షంగానైనా విషబీజాలు నాటుతున్నాయి. దురలవాట్లనే గొప్పగా భావించే స్థితిలోకి వాళ్లను తీసుకెళ్తున్నాయి. లెక్కకు మిక్కిలి అసభ్య దృశ్యాలు, సంభాషణలతో నేరుగా మొబైల్‌ ఫోన్లలోకి వచ్చిపడుతూ- పలుచోట్ల నేరాల వైపూ యువతను అవి పురికొల్పుతున్నాయి.

థియేటర్లలో ప్రదర్శితమయ్యే చలనచిత్రాలు కచ్చితంగా సెన్సార్‌బోర్డు ధ్రువీకరణను పొందాల్సి ఉంటుంది. సెన్సార్‌ విధానమే లేని ఓటీటీ ప్రసారాల్లో అసభ్యత శ్రుతిమించి స్వైరవిహారం చేస్తోంది. ‘సంప్రదాయ విధానాల్లో సినిమా వీక్షణకు ఇప్పుడు కాలంచెల్లింది. చలనచిత్రాలు, షోలను అంతర్జాలంలోనే చూడటం సర్వసాధారణమైంది. అందువల్ల ఆయా ప్రసారాలను ముందస్తుగా పరిశీలించాల్సిన అవసరం ఉందా’ అంటూ ఓటీటీల ధోరణులపై సుప్రీంకోర్టు 2021లోనే కీలకప్రశ్నను లేవనెత్తింది. ‘కొన్ని నిబంధనలైతే కచ్చితంగా ఉండాలి’ అని సర్వోన్నత న్యాయస్థానం అప్పట్లో అభిప్రాయపడింది. ఆయా వేదికల్లో ప్రసారమయ్యే వాటిని ముందస్తుగా పరిశీలించాలన్నదే తమ అభిప్రాయమని వ్యాఖ్యానించింది. పలు భాగాలుగా తెరకెక్కే వెబ్‌సిరీస్‌లను ఆసాంతం వీక్షించి తగిన నిర్ణయం తీసుకోవడం సాధ్యమేనా అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. స్వీయ నియంత్రణ విధానం విఫలమవుతూ వెబ్‌సిరీసుల్లో అశ్లీలత, హింస తదితరాలు అధికమవుతున్న తరుణంలో ఓటీటీలనూ సెన్సార్‌ చేయాల్సిందేనన్న డిమాండ్లు బలంగా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సామాజిక మాధ్యమాలు, ఓటీటీల్లో అసభ్య పదజాల వినియోగాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఆ మేరకు ఆయా వేదికల్లో అందుబాటులో ఉండే అంశాలను నియంత్రించేందుకు తగిన చట్టం, మార్గదర్శకాల రూపకల్పనపై ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలని దిల్లీ హైకోర్టు ఇటీవల సూచించింది.

ప్రత్యేక వ్యవస్థలు అవసరం

ఓటీటీల్లో ప్రసారమయ్యే అభ్యంతరకర అంశాలపై ఫిర్యాదుల దాఖలు, వాటి పరిష్కారానికి కేంద్రం రెండేళ్ల క్రితమే మూడంచెల విధానం తెచ్చింది. తొలి అంచెలో అంతర్గత నియంత్రణ కింద ఓటీటీ సంస్థ ఒక అధికారిని నియమించుకుంటుంది. రెండో దశలో విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రముఖ వ్యక్తి నేతృత్వంలో ఓటీటీల స్వీయ నియంత్రణ వ్యవస్థ, మూడో అంచెలో అంతర్‌ మంత్రిత్వ శాఖల సంఘం ఉంటాయి. అయితే, ఓటీటీల ద్వారా అభ్యంతరకరమైన దృశ్యాలు ఒక్కసారి ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయిన తరవాత ఇక వాటిపై చర్యలు తీసుకోవడం వల్ల లాభమేమిటన్నది కీలక ప్రశ్న. సామాజిక ఆరోగ్యానికి ప్రమాదకరమైన అంశాలు ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళకుండా తగిన కట్టుబాట్లు విధించాలి. ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఇలాంటి అంశాల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ప్రేక్షకులు ముఖ్యంగా నవతరంపై దుష్ప్రభావం చూపే వెబ్‌సిరీస్‌లను అడ్డుకోవాలంటే- దేశీయంగానూ ఆ మేరకు సమర్థ విధానాలను అనుసరించాలి.

పద్మ వడ్డె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.