ఇదా ప్రజాస్వామ్యం?

కష్టపడి ఒకడు ఇల్లు కడితే, కల్లు తాగి ఇంకొకడు దాన్ని తగలబెట్టాడట! చెప్పుకోవడానికి నామర్దా ఏమీ లేదు కానీ, మన దేశం పరిస్థితీ ఇలాగే తయారయ్యింది.

Published : 26 Mar 2023 00:43 IST

ష్టపడి ఒకడు ఇల్లు కడితే, కల్లు తాగి ఇంకొకడు దాన్ని తగలబెట్టాడట! చెప్పుకోవడానికి నామర్దా ఏమీ లేదు కానీ, మన దేశం పరిస్థితీ ఇలాగే తయారయ్యింది. సమానత్వం, స్వేచ్ఛా పునాదుల మీద తలెత్తుకుని నిలిచే ప్రజాస్వామ్య భారతాన్ని కలగన్నారు నాటి జాతినేతలు. అటువంటి ప్రగతిశీల దేశ నిర్మాణంకోసం దార్శనిక రాజ్యాంగానికి వారు ప్రాణంపోశారు. స్వాతంత్య్రోద్యమ ఆశయాలే దారిదీపాలుగా మొదట్లో పాలన కాస్త సజావుగానే సాగింది. కాలం గడిచే కొద్దీ చెరువులోకి చేపలకు బదులుగా మొసళ్లు వచ్చి చేరాయి. ఆదర్శాలను అడుసులో తొక్కేసి, అధికారంకోసం ఎటువంటి గడ్డి తినడానికైనా సిద్ధమయ్యే నేతలెందరో దేశంలో పుట్టుకొచ్చారు. అబద్ధం చెబితే అన్నం పుట్టదేమో కానీ ఓట్లు మాత్రం పడితీరతాయనే అధర్మ సూక్ష్మాన్ని వాళ్లు తలకెక్కించుకున్నారు. పార్టీలకు అతీతంగా తమ చావు తెలివితేటలతో జనాన్ని ఏమారుస్తూ ఆ నీతిలేని నేతలు పబ్బం గడుపుకొంటున్నారు. ప్రజాస్వామ్య ప్రమాణాలను చెల్లనికాసులుగా ఛీత్కరిస్తూ వారు ఆడుతున్న రాజకీయ చదరంగం- భారతావని ప్రతిష్ఠను అంతర్జాతీయంగా పలుచన చేస్తోంది.

స్వీడన్‌లోని ‘వి-డెమ్‌’ సంస్థ ఏటా వివిధ దేశాల్లోని ప్రజాస్వామ్య స్థితిగతులను మదింపు వేస్తూంటుంది. భావప్రకటనా స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన, ఎన్నికల నాణ్యత, పత్రికలూ ప్రసారమాధ్యమాల గొంతునొక్కే సర్కారీ ధోరణులు, పౌరసమాజమూ స్వచ్ఛంద సంస్థలపై ప్రభుత్వ నిర్బంధకాండలు... తదితరాల ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులు కేటాయిస్తుంది. కొద్దిరోజుల క్రితం ఆ సంస్థ తన ‘ప్రజాస్వామ్య నివేదిక-2023’ను విడుదల చేసింది. దానిలో అంతర్భాగమైన ‘ఉదారవాద ప్రజాస్వామ్య సూచీ’(ఎల్‌డీఐ)లో 179 దేశాలకుగాను ఇండియాకు 97వ స్థానం దఖలుపడింది. అందులోనే ‘ఎన్నికల ప్రజాస్వామ్య సూచీ’(ఈడీఐ)లోనైతే మన ర్యాంకు... 108. నిరుటి నివేదికలో ఆ రెండు సూచీల్లో వరసగా 93, 100వ ర్యాంకులు సాధించిన భారతావని ఈసారి ఇంకా దిగువకు పడిపోయింది. 2017 ‘వి-డెమ్‌’ నివేదిక 174 దేశాల్లోని ప్రజాస్వామ్య పరిస్థితులను సరిపోల్చింది. ఎల్‌డీఐ, ఈడీఐలలో ఇండియాకు అప్పట్లో వరసగా 70, 73వ ర్యాంకులు దక్కాయి. సంవత్సరాలు దొర్లిపోయే కొద్దీ దేశీయంగా ప్రజాస్వామ్యం కరి మింగిన వెలగపండులా మారిపోతోంది. రాజ్యాంగం ప్రబోధిస్తున్న విలువలేవీ... అంజనం వేసి వెతికినా ఎక్కడా కనిపించని పెనుచీకటిలో భారతీయ పౌరజీవనం క్రమంగా కళతప్పుతోంది!

ఓట్లు కొని కుర్చీలెక్కే దుర్విధానాలను నివారించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అశోక్‌ లవాసా మూడేళ్ల క్రితం పిలుపిచ్చారు. కానీ, అంతకన్నా కుందేటి కొమ్మును సాధించడం సులభమేమో! పదిమంది ఓటర్లు ఉంటే, వాళ్లలో అయిదుగురో ఆరుగురో పోలింగ్‌ కేంద్రాలకు వస్తారు. వాళ్లలో ముగ్గురో నలుగురో ఎవరిని ఎంచుకుంటే వాళ్లే గెలుస్తారు. అంటే- ఆ కొద్దిమందికి నచ్చినవాళ్లే మొత్తం పదిమందినీ పరిపాలిస్తారన్న మాట! కాసుల మూటలను గలగలలాడించకపోతే, మద్యం గ్లాసులను నింపకపోతే ఆ ‘నాలుగు’ ఓట్లు కూడా తమకు పడవన్నది నేటికాలపు తప్పాతాలు నాయకుల గట్టి నమ్మకం. ఇటువంటి ఎన్నికలు అయిదేళ్లకోసారి జరిగి ఎవరోఒకరు గద్దెనెక్కడమే ప్రజాస్వామ్యమా? దుడ్డుకర్రలతో జనాన్ని చావబాదే దాదాలూ నాయకులే... ఖజానాకు కన్నమేసి కోట్లకు పడగలెత్తి తమ ‘ప్రజాసేవ’కు ఆ సొమ్మునే పెట్టుబడిగా పెట్టే జగన్నాటక సూత్రధారులూ నాయకులే... కులమతాల కుంపట్లలో ప్రజలను నిలువునా తగలబెట్టే కర్కోటకులూ నాయకులే... చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి కారెవ్వరూ అనర్హులు మన పుణ్యభూమిలో? అలా నేరచరితులు రాజపూజ్యాలు అందుకుంటున్నప్పుడు, అంతర్జాతీయంగా దేశం అవమానాల పాలుకావడంలో వింతేముంది? క్రిమినల్‌ కేసుల కట్టలను వీపున కట్టుకున్న పెద్దమనుషులే విధాన నిర్ణేతలుగా చక్రం తిప్పుతున్నప్పుడు ఇక శాంతిభద్రతలకు దిక్కేది? అవి దేవతావస్త్రాలవుతున్న చోట ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టగలదా? విధానాల రూపకల్పన నుంచి పరిపాలన వరకు ప్రతిచోటా ప్రజలు భాగస్వాములైతేనే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. అధికార పార్టీ అధినేత బుర్రను రాత్రికిరాత్రి ఏ పురుగో తొలిచి... అదే సర్కారీ నిర్ణయంగా తెల్లారేకల్లా అమలులోకి వచ్చేస్తే- అది రాజరికానికి నయా రూపమవుతోంది. ప్రజాస్వామ్యం పేరిట ప్రస్తుతం భారతావనిలో దశాబ్దాలుగా ప్రదర్శితమవుతోంది ఆ రంగుల నాటకమే!

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ మూడురోజుల క్రితం ఉద్ఘాటించినట్లు- పత్రికలూ ప్రసారమాధ్యమాలు స్వేచ్ఛగా పనిచేయగలిగితేనే ప్రజాస్వామ్య రాజ్యంగా దేశం కొనసాగగలదు. దేశ నిర్మాణ క్రతువులో కీలక వ్యవస్థగా పాత్రికేయాన్ని ప్రోత్సహించేదే క్రియాశీల, ఆరోగ్య ప్రజాస్వామ్యమవుతుంది. ప్రశ్నలంటే చాలు, నాలుగు కిలోమీటర్ల దూరం పారిపోయే పిరికివారు మహానాయకులవుతున్న రోజులివి! అటువంటి వారికి సహజంగానే పత్రికలూ ప్రసారమాధ్యమాల పొడగిట్టదు. దానికి తగ్గట్టుగానే పత్రికాస్వేచ్ఛా సూచీలో 180 దేశాలకుగాను ఇండియాకు నిరుడు 150వ స్థానం దక్కింది. భౌతికదాడులూ రాజద్రోహం వంటి కేసులతో కలాల గళాలను నొక్కేసే అప్రజాస్వామిక ధోరుణులు ఆసేతుహిమాచలం రాజ్యమేలుతున్నాయి. ఆలోచనాపరులను వెంటాడి వేధించే మూకల అరాచకాలు సామాజిక మాధ్యమాల్లోనూ పెచ్చరిల్లుతున్నాయి. నోరుతెరిచి నిజం చెప్పడమే మహాపాపమన్నట్లుగా నేతలు వ్యవహరిస్తున్నారు. వారి మోచేతి నీళ్లకు గుటకలేసే అంతేవాసులు, అనుంగు అధికారులూ అదే రీతిన ప్రవర్తిస్తున్నారు. సత్యాన్ని వధిస్తే... విమర్శలు వర్షించకపోతే... విభిన్న భావాలు సంఘర్షించుకోకపోతే... అది అచ్చంగా నిరంకుశ రాజ్యమే అవుతుంది కదా! ప్రస్తుతం దేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఏమైనా ఉన్నాయా?

సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించడమూ స్వాతంత్య్రోద్యమ లక్ష్యాల్లో కీలకమైంది. అదెంతవరకు వచ్చిందో చూడబోతే- మంచమంతా కంతలే కనిపిస్తాయి. దేశీయంగా ఆదాయ అసమానతలు అంతకంతకూ అధికమవుతున్నాయి. బతుకుబండి సాఫీగా సాగక నిస్సహాయులెందరో అర్ధాంతరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సామాజిక సమానత్వ భావనను అపహాస్యం చేస్తూ ఆధిపత్య భావజాల ఛాందసులు చెలరేగిపోతున్నారు. వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన నాయకులూ ఆ బురదలోనే జలకాలాడుతున్నారు. ఇక మనది రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యమని చంకలు గుద్దుకోవడంలో అర్థమేముంది? పౌరహక్కులకు రక్షకులుగా పనిచేయాల్సిన పోలీసులు ఏమి చేస్తున్నారు? ప్రజాధనాన్ని జీతాల రూపేణా తీసుకుంటున్న వారిలో అత్యధికులు నాయకులకు సేవకులుగా తరిస్తున్నారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయత నేతిబీర చందమవుతోంది. రాజకీయ అవినీతి బకాసురుల ధాటికి జాతివనరులు పప్పుబెల్లాలవుతున్నాయి. దోచుకోవడం... దోచిపెట్టడం... సర్వసాధారణమవుతున్నాయి. ఇటువంటివి అసలు సమస్యలే కానట్టుగా గాలిలో మేడలు కడుతూ... దేశంలో అంతా బాగుందంటూ నేతలు చిరునవ్వులు చిందిస్తుంటారు. ఇదీ... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్న నాయకగణాల విశ్వరూపం!

 శైలేష్‌ నిమ్మగడ్డ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు