కడలికి కర్బన చికిత్స

పారిశ్రామికీకరణ, మానవ చర్యల వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో బొగ్గుపులుసు వాయువు విడుదలవుతోంది. భూతాపం పెరగడానికి ఇదే ప్రధాన కారణం.

Published : 26 Mar 2023 00:45 IST

పారిశ్రామికీకరణ, మానవ చర్యల వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో బొగ్గుపులుసు వాయువు విడుదలవుతోంది. భూతాపం పెరగడానికి ఇదే ప్రధాన కారణం. సముద్రాలు అధికంగా ఈ వాయువును సంగ్రహిస్తున్నాయి. సాగరాల నుంచి బొగ్గుపులుసు వాయువును తొలగించే విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) ఆవిష్కరించింది.

మానవ కార్యకలాపాల వల్ల గాలిలో బొగ్గు పులుసు వాయువు (కార్బన్‌ డయాక్సైడ్‌) స్థాయులు పెరిగిపోతున్నాయి. ఆ వాయువును పీల్చుకొని సముద్ర జలాలు ఆమ్లీకరణకు గురవుతున్నాయి. దీన్ని పరిష్కరించగల విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధక బృందం ఇటీవల కనుగొంది. అందులో కృపా వారణాసి అనే భారతీయుడూ ఉన్నారు. ఆయన ఎంఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఆచార్యులు. ఎంఐటీ కనిపెట్టిన ప్రక్రియలో ఎలెక్ట్రోకెమికల్‌ ఘటాలలోకి సముద్ర జలాల్ని పంపిస్తారు. ఆ నీటిలోకి ప్రోటాన్లను విడుదల చేయడానికి రియాక్టివ్‌ ఎలెక్ట్రోడ్లను ఉపయోగిస్తారు. దీంతో సముద్ర జలం నుంచి బొగ్గుపులుసు వాయువు విడిపోతుంది. ఈ ప్రక్రియలో మొదట సముద్ర జలాన్ని ఆమ్లీకరించి, ఆ నీటిలో కరిగి ఉన్న అసేంద్రియ బైకార్బొనేట్లను బొగ్గు పులుసు వాయు మాలిక్యూల్స్‌గా మారుస్తారు. దాన్ని వాక్యూమ్‌లో వాయు రూపంలో సేకరిస్తారు. తరవాత మిగిలిన సముద్ర జలాన్ని రివర్స్‌ వోల్టేజి కలిగిన ఎలెక్ట్రోకెమికల్‌ ఘటాల్లోకి పంపుతారు. అవి నీటిలోని ప్రోటాన్లను పీల్చుకోవడంతో ఆమ్లీకృత జలం క్షారజలంగా మారిపోతుంది. ఇదే ప్రక్రియతో సముద్రాల్లోని ఆమ్ల జలాన్ని క్షార జలంగా మార్చవచ్చు. సముద్రపు నీటిలోని బొగ్గుపులుసు వాయువునూ తొలగించవచ్చు. అయితే, ఈ ప్రక్రియను భూగోళం పైన ఉన్న సముద్రాలన్నింటిలో చేపట్టడం సాధ్యపడదు. వీలైనచోట్ల దీన్ని చేపట్టవచ్చు. సముద్రంలో తిరిగే నౌకల్లో, చమురు రిగ్గుల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించవచ్చు. సముద్ర జలంలోని లవణాలను తొలగించి మంచి నీటిగా మార్చే ప్లాంట్లను ప్రపంచమంతటా సాగర తీర నగరాలు నెలకొల్పాయి. భారత్‌లో ఒక్క చెన్నై నగరంలోనే అలాంటి రెండు కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో ఒడిసిపట్టే బొగ్గుపులుసు వాయువును ఇతర పదార్థాలు, రసాయనాల ఉత్పత్తికి ఉపయోగించవచ్చు. 

సముద్ర జలం నుంచి తొలగించిన బొగ్గుపులుసు వాయువును సముద్ర గర్భంలో బాగా లోతైన చోట పూడ్చిపెట్టవచ్చు. లేదంటే ఆ వాయువును రసాయన ప్రక్రియల ద్వారా ఇథనాల్‌గా మార్చవచ్చు. అది రవాణా వాహనాలకు ఇంధనంగా ఉపకరిస్తుంది. బొగ్గుపులుసు వాయువు నుంచి ప్రత్యేక రసాయనాలను వెలికితీసి వివిధ పదార్థాలను తయారు చేయవచ్చు. అయితే, ఎంత ప్రయత్నించినా సముద్రాల నుంచి తొలగించిన బొగ్గుపులుసు వాయువు మొత్తాన్నీ ఉపయోగించడం సాధ్యపడదు. దానిలో అధిక భాగాన్ని భూగర్భంలో నిక్షిప్తం చేయక తప్పదు. ప్రస్తుతం నేరుగా గాలి నుంచే బొగ్గుపులుసు వాయువును తొలగించే ప్రక్రియ అందుబాటులో ఉంది. దానికన్నా సముద్రం నుంచి తొలగించడమే అత్యధిక ప్రయోజనకరం. సముద్ర జలంలో పెద్దమొత్తంలో బొగ్గుపులుసు వాయువు ఉంది. మానవ కార్యకలాపాల వల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో 30 నుంచి 40శాతాన్ని సముద్రాలే పీల్చుకుంటున్నాయి. అందుకే సముద్రాలను అతి పెద్ద కార్బన్‌ కేంద్రాలుగా పిలుస్తారు.

ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద కర్బన సంగ్రహణ కర్మాగారం ఐస్‌ల్యాండ్‌ దేశంలో ఉంది. అది గాలి నుంచి ఏటా నాలుగు వేల టన్నుల కర్బనాన్ని సంగ్రహించి భూగర్భంలో నిక్షిప్తం చేస్తుంది. మధ్యప్రదేశ్‌లో ఎన్‌టీపీసీకి చెందిన వింధ్యాచల్‌ సూపర్‌ థర్మల్‌ విద్యుత్కేంద్రం బొగ్గును మండించగా వచ్చే వాయువు నుంచి రోజుకు 20 టన్నుల బొగ్గుపులుసు వాయువును ఒడిసిపట్టుకుంటోంది. దీన్ని హైడ్రోజెన్‌తో కలిపి రోజుకు 10 టన్నుల మిథనాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచమంతటా కర్బనాన్ని ఒడిసిపట్టి, వినియోగించి, నిల్వచేసే (సీసీయూఎస్‌) సాంకేతికతలకు గిరాకీ పెరుగుతోంది. ఇవి గాలి, నీరు నుంచి తొలగించిన కర్బనంతో ఇథనాల్‌, మిథనాల్‌, ప్లాస్టిక్‌ ముడి పదార్థాలు, సోడాయాష్‌ వంటి పదార్థాలను ఉత్పత్తి చేయడానికి ఉపకరిస్తాయి. సీసీయూఎస్‌ సాంకేతికతలతో 2050 కల్లా ఏటా 75 కోట్ల టన్నుల కర్బనాన్ని తొలగించే సామర్థ్యాన్ని సంతరించుకుంటే 80 లక్షల నుంచి కోటి ఉద్యోగాలను సృష్టించవచ్చని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది.

 ఆర్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.