పత్తి రైతు నష్టాలబాట

ఇండియాలో పత్తి ప్రధాన వాణిజ్య పంట. 2021-22లో పత్తి ధర గరిష్ఠ స్థాయిలో పలకడంతో తరవాతి ఏడాది దాని విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం ధరలు బాగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ మందగించడమే దీనికి ప్రధాన కారణం.

Published : 27 Mar 2023 00:49 IST

ఇండియాలో పత్తి ప్రధాన వాణిజ్య పంట. 2021-22లో పత్తి ధర గరిష్ఠ స్థాయిలో పలకడంతో తరవాతి ఏడాది దాని విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం ధరలు బాగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ మందగించడమే దీనికి ప్రధాన కారణం.

ప్రకృతి విపత్తులతో దిగుబడులు తగ్గడం, మరోవైపు పండిన కొద్దిపాటి పంటకూ మంచి ధర రాకపోవడంతో పత్తి రైతులు నష్టాల బారిన పడాల్సి వస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పత్తికి మంచి ధరలు లభించడంతో అన్నదాతలకు ఉపశమనం కలిగింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా గిరాకీ మందగించడంతో పత్తి ధరలు పడిపోయాయి. ధరలు పెరుగుతాయన్న ఆశతో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు పత్తిని విక్రయించకుండా ఇళ్ల వద్దే నిల్వచేశారు. మరో రెండు నెలల్లో కొత్త పంటకాలం (ఖరీఫ్‌) ఆరంభం కాబోతోంది. నేటికీ పత్తి ధరల్లో మార్పులేకపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో చిక్కుకొన్నారు. నిరుడు పత్తి క్వింటా గరిష్ఠంగా రూ.12 వేల దాకా పలికింది. ప్రస్తుతం దాదాపు ఏడు వేల రూపాయలు ఉంది.

భారత్‌లో 2022-23లో 3.21 కోట్ల బేళ్ల(ఒక బేల్‌ 170 కిలోలు) పత్తి దిగుబడి అవుతుందని అంచనా. ఎగుమతులు 30 లక్షల బేళ్లకే పరిమితమవుతాయని భావిస్తున్నారు. అంతకు ముందు సంవత్సరం 42.50 లక్షల బేళ్లను భారత్‌ ఎగుమతి చేసింది. ద్రవ్యోల్బణం ఒత్తిడి, మాంద్యం భయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పత్తికి గిరాకీ తగ్గింది. దేశీయంగా 2020-21లో పత్తి విస్తీర్ణం దాదాపు 133 లక్షల హెక్టార్లు. 2021-22లో అది 119 లక్షల హెక్టార్లకు తగ్గి, 2022-23లో మళ్ళీ 125 లక్షల హెక్టార్లకు పెరిగింది. మార్కెట్లో పత్తి ధరలను బట్టి దాని సాగు విస్తీర్ణం అధికమవుతూ, తగ్గుతూ ఉంటుంది. పత్తి సాగు, దిగుబడులపై వాతావరణం కీలక ప్రభావం చూపుతుంది. ఎగుమతులు పెరిగితే రైతులు మంచి ధరలు పొందుతారు. మరోవైపు భారత్‌ అధికంగా పత్తిని సాగుచేస్తున్నా, నాణ్యమైన కాటన్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

ప్రపంచంలోనే చైనా అతి పెద్ద పత్తి ఉత్పత్తిదారు. వినియోగంలోనూ అధిక వాటా దానిదే. భారత్‌ మూడో అతి పెద్ద పత్తి ఎగుమతిదారు. ఉత్పాదకతలో చైనా, బ్రెజిల్‌, అమెరికా, ఆస్ట్రేలియాల కన్నా భారత్‌ చాలా వెనకబడి ఉంది. దేశీయంగా గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పత్తి అధికంగా సాగవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదేళ్ల నుంచి దిగుబడులు తగ్గిపోయాయి. గులాబీ రంగు పురుగు ఉద్ధృతి వల్ల పంట నష్టం అధికంగా ఉంటోంది. బీటీ పత్తి రకాల్లోనూ చీడపీడలను తట్టుకొనే సామర్థ్యం సన్నగిల్లింది. గులాబీ రంగు, కాయతొలుచు పురుగులను బీటీ వంగడాలు నివారించలేక పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల రైతులు పురుగుమందులపై అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. భారీ వర్షాలు సైతం దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం పత్తి దిగుబడులు తగ్గడం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోయారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రకృతి విపత్తులను, చీడపీడలను తట్టుకోగలిగే నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావాలి. పత్తి సాగులో యాంత్రీకరణ పెరగాలి. పలు దేశాల్లో ఉత్పాదకత ఎక్కువగా ఉండటానికి పత్తి సాగులో వందశాతం యాంత్రీకరణే కారణం. అధిక సాంద్రతతో (మొక్కల మధ్య దూరం తక్కువగా) పంట సాగు చేయడం వంటి విధానాలు సైతం దిగుబడి పెరిగేందుకు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

భారత్‌లోని మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తిని అధికంగా సాగుచేస్తున్నారు. రైతులు నష్టపోకుండా ఉండాలంటే అనుకూలమైన నేలల్లోనే     ఈ పంటను పండించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలి. 2026 నాటికి దేశీయ వస్త్ర పరిశ్రమకు 4.5 కోట్ల బేళ్ల పత్తి అవసరం అవుతుందని అంచనా. ఈ గిరాకీకి తగ్గట్టుగా దిగుబడులను పెంచాలంటే సాగులో విప్లవాత్మక మార్పులు రావాలి. పత్తి సాగును   లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వ్యయానికి తగినట్లు మద్దతు ధరను నిర్ణయించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ వ్యయాన్ని లెక్కలోకి తీసుకొని మద్దతు ధరను పెంచాలని కోరుతున్నారు. మరోవైపు దేశంలో రైతుల ఆత్మహత్యలు పత్తి అధికంగా సాగుచేసే ప్రాంతాల్లోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు అంచనా. వీటన్నింటి దృష్ట్యా ప్రభుత్వాలు పత్తి రైతులకు మేలు జరిగేలా మెరుగైన కార్యాచరణ ప్రారంభించాలి.

డి.సతీష్‌బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.