భయం పోగొడితే... చదువూ పండగే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ మొదటి వారంలో పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. చదివిన విషయాలను ఎలా గుర్తుపెట్టుకోవాలోనని ఒకవైపు విద్యార్థులు మథనపడుతున్నారు.

Published : 28 Mar 2023 00:21 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ మొదటి వారంలో పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. చదివిన విషయాలను ఎలా గుర్తుపెట్టుకోవాలోనని ఒకవైపు విద్యార్థులు మథనపడుతున్నారు. మరోవైపు తమ పిల్లలు మిగతా వారికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దానివల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది.

పూర్వకాలంలో జ్ఞాన సముపార్జనే విద్యావిధానం ముఖ్య లక్ష్యంగా ఉండేది. సమాజంలో మంచి పౌరుడిగా జీవించడానికి ఆ జ్ఞానం ఉపయుక్తమయ్యేది. ప్రస్తుత చదువులు సంపాదనే ధ్యేయంగా మారిపోయాయి. భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలు భవిష్యత్తులో సంపన్నులుగా ఎదగాలని కోరుకుంటున్నారు. దానికి చదువు ఒక్కటే సరైన మార్గమని వారు భావిస్తున్నారు. తమ పిల్లలు ఇతరుల కన్నా చదువుల్లో ముందంజలో ఉండాలని వారు తీవ్రంగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో మారుమూల ప్రాంతాల యువతా పెద్దమొత్తంలో ఆర్జిస్తోంది. చాలామంది అమెరికా వంటి దేశాలకు వెళ్తున్నారు. వారిని చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలూ బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులపై చదువుల ఒత్తిడి పెరిగిపోతోంది. గతంలో కేరళలో హైస్కూల్‌ విద్యార్థులపై చేపట్టిన ఒక సర్వేలో దాదాపు 66శాతం పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి మరింత బాగా చదవాలన్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తేలింది. దాదాపు 33శాతం విద్యార్థుల్లో మానసిక సమస్యలు ఉన్నట్లు ఆ సర్వే వెల్లడించింది. 82శాతం విద్యార్థులు పరీక్షలంటే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతకంతకూ పెరిగిపోతున్న ఈ ఒత్తిడితో బలవన్మరణాలు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో పిల్లలకు సూచిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.

చదువుకోవాలని తల్లిదండ్రులు అస్తమానం అధికార స్వరంతో పోరుపెట్టడం వల్ల పిల్లల్లో ఒత్తిడి మరింత పెరుగుతుంది. దానివల్ల వారు అప్పటిదాకా చదివినవీ మరచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా వారిలో ఆత్మన్యూనత అధికమవుతుంది. అందువల్ల పిల్లలపై అధిక ఒత్తిడిని పెంచకుండా వారు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. పరీక్షలు అయ్యేదాకా తల్లిదండ్రులు టీవీకి దూరంగా ఉంటే మంచిది. ఇంట్లో గట్టిగా మాట్లాడుకోవడం, వాదులాడుకోవడం వంటివీ చేయకూడదు. దానివల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. చుట్టాలు, స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లల చదువుకు భంగం కలగకుండా చూసుకోవాలి.

ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడులూ ఫలితాలు సాధించాలని ఇటీవల ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు ఉత్తీర్ణతా లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుతం చాలా చోట్ల  వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు వంద రోజుల కార్యక్రమం చేపట్టాయి. పిల్లలకు ముందస్తు పరీక్షలు పెడుతున్నాయి. చాలాచోట్ల ప్రతి ఉపాధ్యాయుడికి పదో తరగతి పిల్లల్లో కొందరి చదువును పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు. కొందరు ఉపాధ్యాయులు తమ వృత్తిపై ప్రేమతో పిల్లలకు ప్రతి రోజూ వేకువజామున ఫోన్‌ చేసి నిద్రలేపి చదువుకోవాలని సూచిస్తున్నారు. తమకు అప్పగించిన పిల్లలకు వారి సామర్థ్యాలకు అనుగుణంగా పరీక్షలకు సిద్ధమవ్వాల్సిన విధానాలపై సూచనలు అందిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల సన్నద్ధత కోసం ప్రత్యేక టైం టేబుల్‌ రూపొందించుకునేలా విద్యార్థులకు వారు సహకరిస్తున్నారు. ఇవన్నీ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటన్నింటితోపాటు విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించాలి. పరీక్ష హాలులో ఒత్తిడికి లోనుకాకుండా జవాబులు ఎలా రాయాలో వివరించాలి. ఇక పిల్లల విషయానికి వస్తే చదివిన పాఠాలను వారు తరచూ మననం చేసుకోవాలి. చదవాల్సింది కొండంత ఉంది అనే భావనను మనసులోకి రానివ్వకుండా ప్రణాళికాబద్ధంగా అన్నింటినీ పూర్తి చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు మార్గదర్శకంగా నిలవాలి. పరీక్షల సన్నద్ధతలో పడి నిద్రను, ఆహారాన్ని అలక్ష్యం చేయకూడదు. రోజూ తగినంత సమయం నిద్రపోవాలి. సమతులాహారం తీసుకోవాలి. ఏకబిగిన అదే పనిగా చదవకుండా మధ్యలో పదీ పదిహేను నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో అప్పటిదాకా చదివిన వాటిని మననం చేసుకోవాలి. సందేహాలు వస్తే ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో చర్చించి నివృత్తి చేసుకోవాలి. సరైన ప్రణాళికతో సన్నద్ధమై, ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాస్తే గెలుపు తథ్యం!

 బసు పోతన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు