విపత్తుల సునామీ

ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. అపారమైన ఆస్తి, ప్రాణ నష్టాలను కలిగిస్తున్నాయి. ఆర్థికపరంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పర్యావరణ చట్టాలను గౌరవించడం, సక్రమంగా అమలు చేయడం, విపత్తులపై ప్రజలకు అవగాహన పెంచడం వంటి చర్యల ద్వారా ముప్పు తీవ్రతను కొంతమేర తగ్గించే అవకాశం ఉంటుంది.

Published : 29 Mar 2023 00:32 IST

ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. అపారమైన ఆస్తి, ప్రాణ నష్టాలను కలిగిస్తున్నాయి. ఆర్థికపరంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పర్యావరణ చట్టాలను గౌరవించడం, సక్రమంగా అమలు చేయడం, విపత్తులపై ప్రజలకు అవగాహన పెంచడం వంటి చర్యల ద్వారా ముప్పు తీవ్రతను కొంతమేర తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ దిశగా సరైన కార్యాచరణకు అడుగులు పడాలి.

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 2011-2021 మధ్య కాలంలో సంభవించిన వివిధ రకాల ప్రకృతి విపత్తులను క్రోడీకరించి ‘ప్రపంచ ప్రమాద సూచీ’ని రూపొందించారు. భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటాలు, తుపానులు, వరదలు, కరవులు, సముద్ర మట్టాల పెరుగుదల మొదలైన సహజ ప్రమాదాలను పరిగణనలోకి తీసుకొన్నారు. ఇందులో సింగపూర్‌, హంగేరీ, స్విట్జర్లాండ్‌ లాంటి 38 దేశాలు చాలా తక్కువ విపత్తు; స్వీడన్‌, నేపాల్‌, నార్వే లాంటి 41 దేశాలు తక్కువ విపత్తు; ఇజ్రాయెల్‌, జర్మనీ, బ్రిటన్‌ లాంటి 36 దేశాలు మధ్యస్థ విపత్తు; శ్రీలంక, ఫ్రాన్స్‌, బ్రెజిల్‌ వంటి 36 దేశాలు ఎక్కువ విపత్తు; అమెరికా, చైనా, ఇండియా లాంటి 41 దేశాలు చాలా ఎక్కువ విపత్తు ముప్పులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ విపత్తులు కలిగిన దేశాల్లో ప్రథమ స్థానంలో ఫిలిప్పీన్స్‌, రెండో స్థానంలో భారత్‌, మూడోస్థానంలో ఇండొనేసియా, నాలుగో స్థానంలో కొలంబియా, అయిదో స్థానంలో మెక్సికో ఉన్నాయి.

వరదలు, తుపానులే...

పర్యావరణ ముప్పు నమోదు నివేదిక (2020) ప్రకారం 1990-2019 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు పదివేలదాకా ప్రకృతి విపత్తు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో 41.5 శాతం వరదలు, 29.6 శాతం తుపానులు, 8.2 శాతం భూకంపాలు, 5.6 శాతం కొండచరియలు విరిగిపడటం, 5.3 శాతం తీవ్ర ఉష్ణోగ్రత, 4.8 శాతం కరవు, 3.4 శాతం వన్యప్రాణులు, 1.6 శాతం అగ్నిపర్వతాల కారణంగా సంభవించాయి. అంటే 70 శాతానికిపైగా ప్రకృతి వైపరీత్యాలు కేవలం వరదలు, తుపానుల కారణంగానే సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల మూలంగా సంవత్సరానికి సగటున 45 వేల మందిదాకా మృత్యువాత పడుతున్నారు. అధిక మరణాలు తక్కువ-మధ్య-ఆదాయం కలిగిన దేశాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. భారతదేశ మొత్తం భూభాగంలో 65 శాతం కరవు, 15 శాతం కొండచరియలు, 12 శాతం వరదలు, ఎనిమిది శాతం తుపానులకు గురవుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో 20 శాతం భూభాగంలో వరదలు, తుపానులు సంభవిస్తున్నాయి. దేశం మొత్తం మీద 58.6 శాతం భూభాగం భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో భూకంపాలు వివిధ రకాల తీవ్రతలతో రావడం తరచుగా చూస్తున్నాం. దేశం మొత్తంమీద చాలా చోట్ల చిన్న, పెద్ద బలహీనమైన ప్రాంతాలు ఉన్నాయి. వీటి వెంబడి భూకంపాలు రావడానికి ఆస్కారం మెండుగా ఉంది. భారత్‌లో తుపానులు, వరదలు జాతీయ విపత్తు గణాంకాల ప్రకారం గత 22 ఏళ్లలో (2000-2022) దేశం మొత్తం మీద సుమారు రూ.12 లక్షల కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. అందులో వరదల వల్ల దాదాపు రూ.7.67 లక్షల కోట్లు; తుపాన్లతో రూ.3.16 లక్షల కోట్లు; భూకంపాలు, సునామీలతో రూ.0.61లక్షల కోట్లు; కరవుతో రూ.0.60 లక్షల కోట్లు; వేడి, శీతల గాలుల వల్ల రూ.0.051 లక్షల కోట్లు; హిమనీ నదాలు కరగడం ద్వారా రూ.0.018 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాలు తరచుగా ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తుపాను, సునామీ, వరదలు, కరవులతో... తెలంగాణ వరదలు, కరవు, వేడిగాలులవల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. 

నష్టనివారణ చర్యలు

విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించడానికి ముందుగా విపత్తు సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని సరైన రీతిలో సేకరించాలి. దీన్ని ఆధునిక సాంకేతిక వ్యవస్థలతో తీర్చిదిద్దాలి. రాబోయే దుర్బల పరిస్థితులను విశ్లేషించడానికి ఉపయోగించాలి. ఈ సమాచారాన్ని చిత్రాల ద్వారా ముఖ్యంగా దుర్బల పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రదేశాల్లో ప్రదర్శించాలి. వీటిపై ప్రజల్లో శాస్త్రీయ అవగాహన కల్పించాలి. భూకంపాల ముప్పుండే ప్రాంతాల్లో పట్టణీకరణను నివారించాలి. భారీ నిర్మాణాలు చేపట్టకూడదు. వరదలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఎంతో కొంత నష్టాన్ని నివారించడానికి అవసరాన్ని బట్టి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. ముందుగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని అక్కడి నుంచి సత్వరమే ఖాళీ చేయించాలి. విపత్తు నిర్వహణ సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాలి. సహజ భౌగోళిక పరిస్థితులకు ఆటంకాలు కలిగించే కార్యకలాపాలను పరిహరించాలి. పర్యావరణ చట్టాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, ప్రజలు నడుచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి