మనసు కల్లోలం... భవిత అభద్రం!

భావి భారతావనికి ఉజ్జ్వల బాటలు పరవాల్సిన విద్యార్థులు, యువతలో మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయి. భవితను సమున్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన నేటితరం పిల్లలు పగలూ ప్రతీకారాలతో రగిలిపోతున్నారు.

Published : 30 Mar 2023 00:41 IST

భావి భారతావనికి ఉజ్జ్వల బాటలు పరవాల్సిన విద్యార్థులు, యువతలో మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయి. భవితను సమున్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన నేటితరం పిల్లలు పగలూ ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా, ఇతరుల జీవితాల్లోనూ అలజడికి కారణమవుతున్నారు. విద్యాసంస్థల్లో మానసిక నిపుణుల సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుత కాలంలో కౌమార దశ, యుక్త వయసులోనే మానసిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. చిన్న వయసులోనే ఒత్తిళ్లు, కుంగుబాటు, ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా కరోనా అనంతరం, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిన తరవాత పిల్లలు, యువత ఆలోచన ధోరణులు మారి, విపరీత పోకడలు పెరిగిపోతున్నాయి. విచక్షణ, స్వీయ నియంత్రణ కోల్పోతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు ఒడిగడుతూ, ఇతరులను వేధిస్తూ, హతమారుస్తూ నేరాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు.

నిపుణుల అవసరం

మానసిక రుగ్మతల వల్ల ప్రపంచవ్యాప్తంగా 10-19 ఏళ్ల పిల్లలు  ఏటా సుమారు 45 వేల మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని 2021లో యునిసెఫ్‌ వెల్లడించింది. మానసిక అనారోగ్యం వల్ల జాతీయ ఉత్పాదకత కూడా దెబ్బతింటోంది. ఈ కారణంగా భారత్‌కు 2012-30 మధ్య 18 ఏళ్లలో రూ.1,378 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 5.6 కోట్ల మంది మానసిక ఒత్తిడి, 3.8 కోట్ల మంది ఆందోళనతో సతమతమవుతున్నారు. దేశ జనాభాలో 14శాతం ఒత్తిళ్లు, కుంగుబాటు, ఆందోళన తదితర సమస్యలతో బాధ పడుతున్నట్లు గతంలో నిర్వహించిన జాతీయ మానసిక ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. కరోనా అనంతరం దేశ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుండగా అందులో 10.2 శాతం మానసిక సమస్యలేనని జాతీయ మానసిక ఆరోగ్య, నాడీవిజ్ఞానశాస్త్రాల సంస్థ (నిమ్‌హాన్స్‌) వెల్లడించింది. పాఠశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఎన్‌సీఈఆర్‌టీ 2022లో 6-12 తరగతుల విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో 43 శాతం మానసిక కల్లోలంతో బాధ పడుతున్నట్లు తేలింది. చదువులు, పరీక్షలు, ఫలితాలు విద్యార్థుల ఆందోళనకు కారణమవుతున్నాయని వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిళ్లు, కుంగుబాటు, ఆందోళనలను అధిగమించేలా విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం పెంపొందించడం ఎంతో అవసరం. సచ్ఛీలత, సత్ప్రవర్తన అలవడేలా బాల్యదశలోనే వారిలో మంచి  ఆలోచనకు బీజాలు నాటడం ఉత్తమం. దేశంలో ప్రతి లక్ష మందికి ముగ్గురు మానసిక వైద్య నిపుణుల అవసరం ఉన్నా, ఆ స్థాయిలో అందుబాటులో లేరు. ఆ లెక్క ప్రకారం 30,000 సైకియాట్రిస్టులు, 37,000 సైకియాట్రిక్‌ నర్సులు, 38,000 సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్స్‌, 38,000 మంది క్లినికల్‌ సైకాలజిస్టులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. వివిధ కళాశాలలు, సంస్థల్లో ఆయా విభాగాలకు సంబంధించి ప్రస్తుతం 700 నుంచి 800 మంది వరకు మాత్రమే శిక్షణ పూర్తి చేసుకుంటున్నారు. ఈ లెక్కన నిర్దేశిత సంఖ్యలో సైకియాట్రిస్టులు సుశిక్షితులు కావడానికి 42 సంవత్సరాలు, సైకియాట్రిక్‌ నర్సులకు 74, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్స్‌కు 76, క్లినికల్‌ సైకాలజిస్టులు తయారవడానికి 76 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందని అంచనా.

నియామకాలు, కౌన్సెలింగ్‌ ప్రధానం

భారత్‌ను మానసిక ఆరోగ్య దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులను ఎక్కువగా తయారు చేయడంపై దృష్టి సారించాలి. మానసిక వైద్య విద్య చదివే వారిని ప్రోత్సహిస్తూ ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో వారిని ఎక్కువ సంఖ్యలో నియమించాలి. ఏటా పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం 2022 బడ్జెట్‌లో జాతీయ దూరవైద్య ఆరోగ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 23 దూరవైద్య మానసిక ఆరోగ్య కేంద్రాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 10-19 ఏళ్ల వయసును ‘అత్యంత సున్నిత వయసు విభాగం’గా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ ఆ వయసు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం ఎంతో ముఖ్యమని నొక్కిచెప్పింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక నిపుణులను నియమించాలని కేంద్రం గతంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. కేవలం పరీక్షల సమయంలోనే సైకాలజిస్టుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రభుత్వాలు, విద్యాసంస్థలు ఆ తరవాత ఆ అంశాన్నే విస్మరిస్తున్నాయి. మానసిక వైద్య నిపుణులతో విద్యార్థులకు తరచూ తరగతులు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులు మానసిక వైద్య నిపుణులతో పిల్లలకు నైతిక విలువల బోధన చేపట్టాలి. అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. గ్రామాలు, పట్టణాల్లో మానసిక ఆరోగ్యంతో బాధ పడుతున్న వారిని గుర్తించి తగిన చికిత్స అందించేలా ప్రభుత్వాలు చొరవ చూపాలి.

 ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.