నీటి ఎద్దడితో తగ్గుతున్న దిగుబడులు

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్ని నీటి కొరత వేధిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆసియా ఖండంలోని పలు దేశాల్లో పంటల దిగుబడులు పడిపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Published : 31 Mar 2023 00:30 IST

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్ని నీటి కొరత వేధిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆసియా ఖండంలోని పలు దేశాల్లో పంటల దిగుబడులు పడిపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వాననీటి పరిరక్షణకు, నీటి పొదుపునకు గట్టి చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ప్రపంచ జనాభాలో మనదేశం వాటా 18శాతం, నీటి వనరులలో మాత్రం నాలుగు శాతమే. నీటి కొరత, ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా 2050 నాటికి భారతదేశ ఆహార సరఫరాలో 16 శాతానికిపైగా తగ్గుదల ఏర్పడుతుందని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. దేశంలో ఆహార భద్రత కొరతను ఎదుర్కొనే జనాభా 50 శాతం పెరుగుతుందని వెల్లడించింది. ప్రస్తుతం నికర ఆహార ఎగుమతిదారులుగా ఉన్న చైనా సహా పలు ఆసియా దేశాలు 2050 నాటికి దిగుమతిదారులుగా మారతాయని వివరించింది. నీటి ఎద్దడి ఎదుర్కొనే విషయంలో మనదేశం 2019లో ప్రపంచంలో 13వ స్థానంలో నిలిచింది. ఒకవైపు వనరులు తగ్గిపోవడం, మరోవైపు అధిక ఒత్తిడి కారణంగా స్వచ్ఛమైన, వాడుకునే నీటికి డిమాండ్‌ పెరుగుతోంది. నీటిపై ఒత్తిడిని తగ్గించే విషయంలో దేశంలోని పేలవమైన నీటి నిర్వహణ విధానమే ప్రధాన అవరోధంగా మారుతోంది. ఇప్పటికే మనదేశంలోని చాలా ప్రాంతాలు వేసవిలో నీటి కొరతతో సతమతమవుతున్నాయి. అధిక సంఖ్యలో భారతీయులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని ఇటీవల నీతిఆయోగ్‌ నివేదిక సైతం వెల్లడించింది. మనదేశం నీటి అవసరాలకోసం అస్థిరమైన రుతు పవనాలపై ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. ఒకవైపు దేశంలో వరదలు, కరవుల తీవ్రత పెరుగుతోంది. మరోవైపు వాతావరణ మార్పులు నీటి వనరులపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయి.

మన దేశంలో వ్యవసాయం సహా గ్రామీణ, పట్టణ గృహావసరాలు, తాగునీటికి భూగర్భ జలాలే అత్యంత కీలకం. అతి వినియోగం భూగర్భ జలాల క్షీణతకు దారితీస్తోంది. కేంద్ర భూగర్భ జలమండలి (సీజీడబ్ల్యూబీ) ప్రకారం దేశంలో ఉపయోగించే మొత్తం నీటిలో సుమారు 70 శాతం భూగర్భ జలవనరుల నుంచే పొందుతున్నారు. నీటి అసమర్థ వినియోగంతోపాటు వర్షపు నీటిని నిల్వ చేయడానికి తగిన మౌలిక సదుపాయాలు కొరవడటం భూగర్భ జలాల క్షీణతకు దారితీస్తోంది. అటవీ నిర్మూలన, నేలకోత వంటివీ ఇందుకు దారితీస్తున్నాయి. భూగర్భ జలాలు క్షీణించడం పర్యావరణానికీ చేటు చేస్తుంది. భూగర్భ జలస్థాయులు తగ్గడం వల్ల తీరప్రాంతాల్లో ఉప్పునీటి చొరబాటు జరుగుతుంది. దానివల్ల మంచినీటి వనరులు కలుషితమవుతాయి. భూగర్భ జలాల క్షీణత వ్యవసాయ దిగుబడులు తగ్గడానికి కారణమవుతుంది. పంపింగ్‌ కోసం రైతులు అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. దేశంలో సమగ్ర నీటి సంరక్షణ చర్యలు అవలంబించకపోతే బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌ సహా మరో 20 నగరాల్లో రాబోయే కొన్నేళ్లలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని నీతి ఆయోగ్‌ సైతం హెచ్చరించింది. భూగర్భ జలాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన, అటల్‌ భూజల్‌ యోజన, జలశక్తి అభియాన్‌ తదితర కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం చొరవతో కొన్ని ప్రాంతాల్లో ఇవి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వీటిని మరింత సమర్థంగా అమలు చేయాలి.

మొత్తం నీటి వినియోగంలో వ్యవసాయ రంగానిది 70శాతం మేర ఉంటోంది. రైతులు సమగ్ర సాగునీటి యాజమాన్య పద్ధతులు పాటించేలా చర్యలు తీసుకోవాలి. బిందు సేద్యం, వాననీటి సంరక్షణ, కరవును తట్టుకునే పంటలు, వంగడాల ఎంపిక, పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయం వంటి విధానాలను ఆచరించేలా ప్రోత్సహించాలి. ఈ పద్ధతులు నేల తేమను నిలుపుకోవడంలో సాయపడతాయి. భూసారాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయి. జనాభా పెరుగుదల కారణంగా 2050 నాటికి ఆహార డిమాండ్‌ 70 నుంచి 100 శాతం అధికమవుతుందని అంచనా. అప్పటికి సాగు నీటి అవసరాలు సైతం 70-90 శాతం పెరుగుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ స్థాయిలో నీటిని అందుబాటులో ఉంచడం అంత సులభం కాదు. కాబట్టి నీటి సంరక్షణ, పొదుపు పద్ధతులతో డిమాండ్‌ను అధిగమించే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. దీన్ని దీర్ఘకాలిక వ్యూహంతో అమలు చేయాలి. ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు అన్నదాతల భాగస్వామ్యం కీలకం. ప్రభుత్వాలు సైతం విరివిగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. రైతుల్లో వీటిపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.

డి.ఎస్‌.బాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు