పశ్చిమాసియాలో డ్రాగన్ పాగా!
సుదీర్ఘకాలంగా ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెట్టి సౌదీఅరేబియా, ఇరాన్‌లు ఇటీవల శాంతి ఒప్పందం కుదుర్చుకొన్నాయి. దీనికి చైనా మధ్యవర్తిత్వం వహించింది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి.
సుదీర్ఘకాలంగా ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెట్టి సౌదీఅరేబియా, ఇరాన్‌లు ఇటీవల శాంతి ఒప్పందం కుదుర్చుకొన్నాయి. దీనికి చైనా మధ్యవర్తిత్వం వహించింది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. పశ్చిమాసియాలో ఈ కొత్త పొత్తు డ్రాగన్ విస్తరణ వాదానికి దోహదపడుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సౌదీ అరేబియా, ఇరాన్‌లు ఇటీవల సరికొత్త స్నేహ బంధాన్ని ఏర్పరచుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యం రేకెత్తించింది. సౌదీకి వ్యతిరేకంగా యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులను ఇరాన్ ఇప్పటిదాకా ఎగదోసేది. ఇకపై ఆ సంఘర్షణకు అడ్డుకట్ట పడుతుందని భావించవచ్చు. మరోవైపు లెబనాన్, సిరియాలు సైతం తమ వివాదాలకు చరమగీతం పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని చైనా క్రమంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యాన్ని నీరుగార్చేందుకు అది ప్రయత్నిస్తోంది. నిజానికి 2019లో సౌదీ చమురు కేంద్రంపై హూతీ తిరుగుబాటుదారుల దాడిని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా ఖండించలేదు. ఆ తరవాత బైడెన్ సైతం ట్రంప్ బాటలోనే నడిచారు. సౌదీని పశ్చిమాసియాలో ఏకాకిని చేయాలని చూడటంతో పాటు ఎన్నికల ప్రచారంలో దాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా సైన్యం అఫ్గాన్‌ను తాలిబన్ల దయాదాక్షిణ్యాలకు వదిలేసి రాత్రికి రాత్రే ఆ భూభాగాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ పశ్చిమాసియాలో చైనా పాగా వేయడానికి అవకాశం కల్పించాయి.
అమెరికా ఏకాకి
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తరవాత ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పోరు కారణంగా చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. దానివల్ల తన ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని గుర్తించిన బైడెన్ వైఖరిలో మార్పు వచ్చింది. చమురు ఉత్పత్తిని పెంచి, ధరలు తగ్గేలా చూడాలని కోరేందుకు ఏడాది క్రితం బైడెన్ సౌదీలో పర్యటించాలని తలచారు. అమెరికా లక్ష్యానికి గండి కొట్టేలా రష్యా అప్పటికే మంత్రాంగం నడిపింది. చమురు ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఆయిల్ ధరలు అధికంగా ఉండేలా చూడాలని రష్యా, సౌదీలు ఒక ఒప్పందానికి వచ్చాయి. చమురు ఉత్పత్తి దేశాల కూటమిలో కీలకంగా నిలిచే మాస్కో- వాటన్నింటితో చర్చలు జరిపి అమెరికాను తమ ఉమ్మడి శత్రువుగా భావించేలా చేయడంలో విజయం సాధించింది. ఉక్రెయిన్‌లో పోరాడుతున్న రష్యన్ సేనలకు సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అనుసంధానించిన డ్రోన్లను ఇరాన్ సమకూర్చింది. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని తగ్గించి ధరలు అధికంగా కొనసాగేలా చేయడం రష్యాకు మేలు చేసింది. అదే సమయంలో పాత శత్రువులైన సౌదీ అరేబియా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందానికి చైనా మధ్యవర్తిత్వం నెరిపింది. చైనా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఒప్పందం కుదిరింది. తద్వారా పశ్చిమాసియా రాజకీయ ముఖచిత్రం కొత్త రూపు సంతరించుకుంది. దీనివల్ల పశ్చిమాసియాలో అమెరికా ఏకాకి అయినట్లు కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్‌లు బద్ధశత్రువులు. ఇజ్రాయెల్ దళాలపై పోరాడుతున్న పాలస్తీనా తిరుగుబాటు ముఠాలకు ఇరాన్ చాలా కాలంగా సహాయం అందిస్తోంది. ప్రస్తుతం ఇరాన్-సౌదీల శాంతి ఒప్పందం అరబ్-ఇజ్రాయెల్ సంబంధాలపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశం ఉంది. పైగా శాంతి ఒప్పందాన్ని యూఏఈ ఆహ్వానించడం ఇజ్రాయెల్‌కు మింగుడుపడని విషయమే.
అప్రమత్తత అవసరం
సౌదీ, ఇరాన్‌లతోనూ భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. వాటి వైరానికి సంబంధించి ఇప్పటిదాకా భారత్ తన నిష్పాక్షిక వైఖరిని విజయవంతంగా కొనసాగించింది. అయితే, భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలున్న దేశాల మధ్య చైనా మధ్యవర్తిత్వం నెరపుతుండటం కాస్త ఆందోళన కలిగించే అంశం. వీటన్నింటి ద్వారా చైనా పశ్చిమాసియాలో పాగా వేసి, తన విస్తరణ వాదాన్ని కొనసాగించడానికి అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం పెరిగిన చమురు ధరల వల్ల భారత్ సైతం అధికంగా లబ్ధి పొందుతోంది. రష్యా నుంచి ఇండియా రాయితీ ధరకు చమురును కొని దాన్ని పశ్చిమ, ఐరోపా దేశాలకు అధిక వెలకు విక్రయిస్తోంది. ఇటీవల రష్యాకు చైనా మరింతగా చేరువవుతోంది. క్రెమ్లిన్ విస్తృత ప్రయోజనాలకు అక్కరకొచ్చేలా సౌదీ-ఇరాన్ శాంతి ఒప్పందానికి డ్రాగన్ మధ్యవర్తిత్వం వహించింది. ఇలాంటి తరుణంలో తన ఆర్థిక ప్రయోజనాలకు చైనా దెబ్బకొట్టకుండా దిల్లీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ఇప్పటిదాకా తటస్థ వైఖరి అవలంబించింది. మిత్ర,శత్రు కూటములతో సమతుల్యత పాటిస్తోంది. ఇకమీదటా ఇదే వైఖని అనుసరిస్తూ తన ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ఇండియా ముందుకు సాగాలి.
బిలాల్ భట్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Accident: రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిల్..
-
India News
Odisha Train Accident: 1,000 మంది సిబ్బంది.. భారీ యంత్రాలతో ట్రాక్ పునరుద్ధరణ..
-
Sports News
Virat Kohli: విరాట్‌ను అడ్డుకోవడం అంత సులువేం కాదు: ఆసీస్ ఆల్‌రౌండర్
-
Crime News
Kadapa: ప్రాణం తీసిన పూచీకత్తు.. చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు!
-
Education News
TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 హాల్‌టికెట్లు విడుదల
-
India News
Odisha Train Accident: ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి