అతిథులపై అకృత్యాలా?

వేల సంవత్సరాలుగా విశిష్ట సంస్కృతీ సంప్రదాయాలకు నెలవైన ఘనత- భరతమాత కంఠసీమలో సహజాభరణం. నైతికత, నాగరికతల కలబోతగా ప్రపంచ దేశాలకు జ్ఞానప్రదాతగా వెలుగులీనిన ధన్యచరిత- ఈ పుణ్యధాత్రి సొంతం. స్త్రీని మాతృస్వరూపంగా, అతిథి అభ్యాగతుల్ని దైవ సమానులుగా సంభావించి సమాదరించిన అద్భుత ఒరవడికి నేడు ఎలాంటి వికృతజాడ్యం సంక్రమించింది?

Published : 02 Apr 2023 00:46 IST

వేల సంవత్సరాలుగా విశిష్ట సంస్కృతీ సంప్రదాయాలకు నెలవైన ఘనత- భరతమాత కంఠసీమలో సహజాభరణం. నైతికత, నాగరికతల కలబోతగా ప్రపంచ దేశాలకు జ్ఞానప్రదాతగా వెలుగులీనిన ధన్యచరిత- ఈ పుణ్యధాత్రి సొంతం. స్త్రీని మాతృస్వరూపంగా, అతిథి అభ్యాగతుల్ని దైవ సమానులుగా సంభావించి సమాదరించిన అద్భుత ఒరవడికి నేడు ఎలాంటి వికృతజాడ్యం సంక్రమించింది? ఈ గడ్డపై కొన్నేళ్లుగా పైశాచిక శక్తులు, అసుర మూకల వీరంగం నిశ్చేష్టపరుస్తోంది. దూరతీరాలనుంచి తరలివచ్చిన సందర్శకుల్ని భద్రంగా సాగనంపే ఉత్తమ సంస్కారానికి తలకొరివి పెట్టే దానవ సంతతి అకృత్యాలు పెచ్చరిల్లుతున్న తీరు- యావజ్జాతినీ తలదించుకునేలా చేస్తోంది!

భారత పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్‌ మహిళపై ఆమె బసచేసిన గోవా హోటల్‌ సిబ్బందిలో ఒకడు కన్నేశాడు. ఆమె ఆదమరచి నిద్రిస్తుండగా అర్ధరాత్రి వేళ చొరబడిన నిందితుడు అనుచిత ప్రవర్తనకు తెగబడ్డాడు. భయభ్రాంతులకు గురైన యువతి గట్టిగా కేకలు పెట్టేసరికి ఆమె పీక నొక్కి బెదిరించాడు. అంతలో అరుపులు విని స్థానికుడొకరు కాపాడేందుకు వచ్చేసరికి- ఆ ఇద్దరినీ కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అంతకు వారం రోజుల్లోపే గోవా హోటల్‌ గదిలో విశ్రమిస్తున్న రష్యన్‌ జాతీయురాలిపై ఇద్దరు వ్యక్తులు దాడికి, దొంగతనానికి యత్నించి అడ్డంగా దొరికిపోయారు. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు గోవా పేరు అవమానకరంగా పత్రికలకు ఎక్కడంపై తాజాగా స్పందించిన ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌- నెదర్లాండ్స్‌ యువతిని కాపాడుతూ కత్తిపోట్లకు గురైన వ్యక్తిని సన్మానిస్తామని ప్రకటించారు. మరి, దేశం పరువు ప్రతిష్ఠలకు పడిన తూట్ల మాటేమిటి?

నిరుడు నెల్లూరు జిల్లాలో విదేశీ వనితపై లైంగిక దాడి ఘటన కలకలం రేకెత్తించింది. తాను ఒంటరిగా ఎన్నో దేశాలు పర్యటించినా ఎప్పుడూ ఇటువంటి చేదు అనుభవం ఎదుర్కోలేదన్న లిథువేనియా మహిళ- తనపై దాడిని తప్పించుకుని వాహన చోదకుల సాయంతో పోలీస్‌ రక్షణ పొందగలిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు జరిగిన అత్యాచార యత్నం విదేశీ పర్యాటకులకు దేశంలో పొంచి ఉన్న గండాలెన్నో మచ్చుకు చాటింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది అసత్యం. పర్యాటకుల భద్రతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఠాణాలు నెలకొల్పదలచామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రివర్యులు ప్రకటించి ఏడాదిన్నర కాలం గతించింది. వెలుపలి సందర్శకులపై ముఖ్యంగా మహిళల మీద దాడులు, వేధింపుల ఉదంతాలు అంతులేని కథగా వెలుగు చూస్తున్న తరుణంలోనైనా భద్రతాపరమైన చర్యలు చురుకందుకోవాలి. లేకపోతే మసిబారిన ప్రతిష్ఠ తేటబారదు.

అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా ప్రభృత దేశాలు- ఇండియాలో పర్యటించే మహిళలు తగుజాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేయాల్సి రావడం ఎవరికి గౌరవం? ఆయా దేశాల ‘ప్రత్యేక సూచనలు’ భారతదేశ ప్రతిష్ఠకు ఏడు నిలువుల లోతున పాతరేస్తున్నాయి. ఇటీవలి హోలీ పర్వదినాన జపనీస్‌ మహిళ ఒకరు దిల్లీలో అనుచిత వేధింపుల పాలబడ్డానంటూ చేసిన వరస ట్వీట్లు గగ్గోలు పుట్టించాయి. సంక్రాంతి వేళ కేరళలోని ఇడుక్కిలో విదేశీ పర్యాటకుల్ని చితకబాదిన 14 మంది అరెస్టయ్యారు. రెండు నెలల క్రితం యూకే యువతిపై తిరువనంతపురంలో అయిదుగురు సభ్యుల ముఠా లైంగిక దాడులకు తెగబడింది. అదే కేరళలోని కోవలం బీచ్‌ దగ్గరి రిసార్టు నుంచి లాత్వియన్‌ టూరిస్ట్‌ అయిదేళ్లక్రితం అదృశ్యమైంది. సుదీర్ఘ విచారణ దరిమిలా ఫోరెన్సిక్‌ డీఎన్‌ఏ పరీక్ష తదితరాల ద్వారా అప్పట్లో జరిగిందేమిటో అక్కడి జిల్లా కోర్టు ఇటీవలే సాక్ష్యాధారాల ప్రాతిపదికన ధ్రువీకరణకు వచ్చింది. ఆ యువతిని ఇద్దరు నేరచరితులు మార్జువానా మత్తులో ముంచి, పలుమార్లు కిరాతకంగా బలాత్కరించి పశువాంఛ తీర్చుకున్నాక సముద్ర జలాల్లో తొక్కిపట్టి ఊపిరాడకుండా చేసి పొట్టన పెట్టుకున్నారని నిర్ధారించింది. వాళ్ళిద్దరూ హతమార్చింది విదేశీ సందర్శకురాల్ని మాత్రమే కాదు- ‘అతిథి దేవోభవ’ సంస్కృతి స్ఫూర్తిని.

అంతర్జాతీయ ప్రయాణాలు పర్యాటక సూచీలో 2019 నాటికి భారత్‌ 46వ స్థానంలో ఉండేది. ఇప్పుడది 54వ స్థానానికి పతనమైంది. అమెరికా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, సింగపూర్‌, ఇటలీ వంటివి సందర్శకుల్ని సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి. దర్జాగా భారీయెత్తున విదేశ మారకద్రవ్యాన్ని కూడబెట్టుకుంటున్నాయి. అపార ఉపాధి అవకాశాల పరికల్పనతో ఆతిథ్య రంగాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాయి. సాంస్కృతికంగా భౌగోళికంగా తనకున్న ఎన్నో ప్రత్యేకతల్ని సొమ్ము చేసుకోవడంలో విఫలమవుతున్న ఇండియా- చిన్నాచితకా దేశాల సరసనా వెలాతెలాపోతోంది. మలేసియా, ఇండొనేసియా వంటివీ పర్యాటక రంగంలో మనకన్నా మిన్నగా రాణిస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పరిపుష్టీకరణ, ఆతిథ్య రంగానికి వివిధ పన్నుల రాయితీలపై ప్రభుత్వాలు తగినంతగా దృష్టి కేంద్రీకరించక- దేశం ఇప్పటికే నష్టపోతోంది. మహిళా పర్యాటకులపై లైంగిక దాడులు, సందర్శకుల పట్ల అమానవీయ ధోరణులు కొనసాగితే... దేశీయ టూరిజం ఇంకా బక్కచిక్కిపోదా?

జాతీయ నేర గణాంకాల సంస్థ క్రోడీకరించిన సమాచారం ప్రకారం, ఏడాది కాలంలో విదేశీ పర్యాటకులకు అత్యంత అభద్రమైన నగరమన్న దుష్కీర్తి దేశ రాజధానికే దఖలుపడింది. నువ్వా నేనా అంటూ దిల్లీకి కర్ణాటక గట్టి పోటీ ఇస్తోంది. 2016-2021 సంవత్సరాల మధ్య దేశం నలుమూలలా విదేశీ పర్యాటకులపై దాష్టీకాలకు సంబంధించి ఎకాయెకి 2136 కేసులు నమోదయ్యాయి. జీ-20 అధ్యక్ష బాధ్యతలు దఖలుపడిన దశలోనైనా అతిథుల భద్రతా ఏర్పాట్లలో పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. అందులో కేంద్రం ఎక్కడా ఏ మాత్రం అలసత్వానికి తావివ్వకూడదు. దేశంలోని భిన్న పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టుల భద్రతకు ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక అమలుపరుస్తున్నారో చురుగ్గా సమీక్షించి అవసరమైన మార్పులూ చేర్పులకు ఉపక్రమించాలి. పర్యాటకుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎవరినైనా కఠినంగా శిక్షించాలి. సందర్శకులు వచ్చి చూసి వెళ్ళిపోతారులెమ్మన్న ఉదాసీన ధోరణులకు తిలోదకాలు వదలాలి. కామాంధ నరవ్యాఘ్రాల భరతం పట్టడమన్నది సంపూర్ణంగా ప్రభుత్వ బాధ్యత. అది యుద్ధప్రాతిపదికన పటుతర వ్యూహంతో సన్నద్ధం కాకపోతే పోయేది దేశం పరువే!

బాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.