సమర్థ అమలుతోనే ‘ముద్ర’ విజయం

కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి, వ్యాపార విస్తరణకు ఆర్థిక చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్‌ 8న ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై)ను తీసుకొచ్చింది. చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు రుణాలను అందించడం దీని లక్ష్యం. ఎనిమిదేళ్లు పూర్తిచేసుకుంటున్న ‘ముద్రా యోజన’ను మరింతమందికి అందించాల్సిన అవసరముంది.

Updated : 09 Apr 2023 16:23 IST

కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి, వ్యాపార విస్తరణకు ఆర్థిక చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్‌ 8న ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై)ను తీసుకొచ్చింది. చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు రుణాలను అందించడం దీని లక్ష్యం. ఎనిమిదేళ్లు పూర్తిచేసుకుంటున్న ‘ముద్రా యోజన’ను మరింతమందికి అందించాల్సిన అవసరముంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ను వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్‌ బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ విత్త సంస్థలు, సూక్ష్మ ఆర్థిక (మైక్రో ఫైనాన్స్‌) సంస్థలు వంటివి అమలు చేస్తున్నాయి. ఇప్పటి   వరకు సుమారు 35కోట్ల మందికి రూ.16.69లక్షల కోట్లకు పైగా రుణాలను అందజేశాయి. ఈ పథకంలో- శిశు రుణాల కింద రూ.50,000 వరకు, కిశోర రుణాల కింద రూ.50,000 నుంచి రూ.5లక్షల వరకు, తరుణ్‌ రుణాల కింద రూ.5-10లక్షల మేర ఆర్థిక తోడ్పాటు అందిస్తారు. లబ్ధిదారులు మూలధనంలో పది శాతాన్ని సమకూర్చుకుంటే, మిగతా 90శాతాన్ని రుణంగా అందుకోవచ్చు. ఈ మొత్తాన్ని గరిష్ఠంగా అయిదేళ్లలో తిరిగి చెల్లించాలి. అప్పటివరకు నిర్దేశించిన రేటులో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం అమలు విషయంలో రిజర్వు బ్యాంకు ప్రతి బ్యాంకుకు, సంస్థకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ప్రధానమంత్రి ఈ పథకం పనితీరును ఏటా సమీక్షిస్తారు.

మూడొంతులు శిశు రుణాలే

ముద్రా యోజన ఆరంభమైననాటి నుంచి చూస్తే 2018-19లోనే ఎక్కువమంది దీనిద్వారా లబ్ధి పొందారు. ఈ ఏడాదిలో మార్చి మూడో తేదీ నాటికి విడుదల చేసిన రుణాల మొత్తం... 2022లోని మొత్తం రుణవితరణ రికార్డును అధిగమించింది. మొత్తం రుణాల్లో నాలుగింట మూడొంతులు శిశు రుణాలే ఉంటున్నాయి. ఈ లబ్ధిదారుల్లో అత్యధిక వాటా మహిళలదే. ముద్రా పథకం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందిన పది రాష్ట్రాల్లో పశ్చిమ్‌ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, బిహార్‌, కర్ణాటక, గుజరాత్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలు ఉన్నాయి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు ఏటా చివరి రెండు, మూడు స్థానాల్లోనే ఉంటున్నట్లు చెబుతున్నారు. లబ్ధిదారుల సంఖ్యను నిర్ణయించేందుకు రాష్ట్ర జనాభా, నిరుద్యోగుల సంఖ్య, అందుబాటులో ఉన్న బ్యాంకులు, బ్యాంకు మేనేజర్ల సహకారం, ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆసక్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ముద్రారుణాలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. కొవిడ్‌, అంతర్జాతీయ పరిణామాలతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి, కోలుకున్న ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించడానికి ఈ రుణాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ముద్రా యోజన చిన్న పారిశ్రామికవేత్తలకు దన్నుగా నిలుస్తుండటంతో పాటు నిరుద్యోగ సమస్యకూ కొంతమేర పరిష్కారం చూపుతోంది.

రుణాల మంజూరులో ప్రగతి కనిపిస్తున్నా, పథకం అమలులో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం, బ్యాంకుల మధ్య సమన్వయం లోపిస్తోంది. చాలామంది బ్యాంకు మేనేజర్లు అతి జాగ్రత్తకు పోతున్నారు. రూ.50,000లోపు ఉండే శిశు రుణాలకు సైతం పూచీకత్తు అడగడం, పదేపదే దరఖాస్తుదారులను తిప్పించుకోవడం చేస్తున్నారు. ఇప్పటికే రాని బాకీలతో సతమతమవుతున్న బ్యాంకులు సులభ రుణాలను అందించడం వల్ల నిరర్థక ఆస్తులు మరింతగా పేరుకుంటాయన్న ఆందోళన బ్యాంకింగ్‌ వర్గాల్లో ఉంది. నిజానికి విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ తదితర బడా పారిశ్రామికవేత్తల కారణంగానే పలు బ్యాంకులు వేల కోట్ల రూపాయలు నష్టపోయాయి. పేదలు, ముఖ్యంగా మహిళలు రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తుంటారని స్వయం సహాయక సంఘాలు ఇప్పటికే రుజువు చేశాయి. అయినప్పటికీ, అప్పులను నిజాయతీగా తీర్చే పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు బ్యాంకులు అంతగా ఆసక్తి చూపడంలేదన్నది వాస్తవం.

సమర్థంగా అమలుచేస్తే...

బ్యూటీ పార్లర్లు, జ్యూస్‌ సెంటర్లు, చాయ్‌ పకోడీ వంటివి విక్రయించే చిన్న దుకాణాల యజమానులకు శిశురుణాలు ఎంతో తోడ్పడతాయి. ముద్రా రుణాల విషయంలో పూచీకత్తు అవసరంలేదు. బ్యాంకర్లు మాత్రం తప్పనిసరి అంటున్నారు. దరఖాస్తుదారుల వివరాలు, ఆస్తిపాస్తులు, వ్యాపార భవిష్యత్తు వంటి అంశాలతో పాటు వారు వాయిదాలను చెల్లిస్తారా, లేదా అన్న అంశాలనూ లోతుగా ఆరా తీస్తున్నారు. చివరికి కొర్రీలు వేస్తున్నారు. ఆ కారణంగానే నిజమైన లబ్ధిదారులకు రుణాలు అందడంలేదన్న విమర్శలు ముద్రా పథకాన్ని ముసురుకున్నాయి. సమర్థంగా అమలు చేయాలేగాని- దేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం వంటి దీర్ఘకాలిక సమస్యలకు ముద్రా యోజన మేటి పరిష్కారం చూపగలదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.