విద్యుత్‌ వాహన విపణికి కుదుపు

మధ్య తరగతికి అందుబాటులో ఉండేవి ద్విచక్ర వాహనాలే. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. డిమాండుకు అనుగుణంగా వీటిని సరఫరా చేసేలా ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. చైనా నుంచి విడిభాగాల దిగుమతిని తగ్గించాలని... బ్యాటరీలు, ముఖ్య భాగాలను దేశీయంగానే తయారు చేయాలని ఉత్పత్తిదారులను కేంద్రం కోరుతోంది.

Updated : 30 Apr 2023 16:39 IST

మధ్య తరగతికి అందుబాటులో ఉండేవి ద్విచక్ర వాహనాలే. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. డిమాండుకు అనుగుణంగా వీటిని సరఫరా చేసేలా ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. చైనా నుంచి విడిభాగాల దిగుమతిని తగ్గించాలని... బ్యాటరీలు, ముఖ్య భాగాలను దేశీయంగానే తయారు చేయాలని ఉత్పత్తిదారులను కేంద్రం కోరుతోంది.

భారత్‌లో హైబ్రిడ్‌, ఎలెక్ట్రిక్‌ వాహనాల సత్వర స్వీకరణ-ఉత్పత్తి (ఫేమ్‌) పథకం కింద విద్యుత్‌ వాహన (ఈవీ) ఉత్పత్తిదారులు స్థానికంగా తయారైన ఈవీలను 40శాతం తగ్గింపు ధరకు విక్రయించాలి. ఆ తగ్గించిన మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రాయితీగా పొందవచ్చు. ఇదే రాయితీతో ఎలెక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను (ఈ2డబ్ల్యూ) ప్రోత్సహించడానికి ఫేమ్‌-2 పథకం తీసుకొచ్చారు. 2019-2022 మధ్య కాలంలో అమలులో ఉండే ఈ పథకం ద్వారా దేశంలో 10 లక్షల ఈ2డబ్ల్యూలను, 7000 విద్యుత్‌ బస్సుల తయారీని సాధించాలని కేంద్రం లక్షించింది. తరవాత ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకు పొడిగించి, ఫేమ్‌-2 కింద 10 లక్షల ఈ2డబ్ల్యూలకు అంతిమ ధరపై రూ.20,000 రాయితీ ఇస్తోంది. దేశమంతటా 2,700 ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడమూ పథకంలో భాగమే. కానీ, ఫేమ్‌-2 మార్గదర్శక సూత్రాలను తయారీదారులు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు రావడంతో సంవత్సర కాలంగా అనేక ఈ2డబ్ల్యూ ఉత్పత్తిదారులకు సబ్సిడీని నిలిపేసింది. తాజాగా ఈ అంశంపై టీవీఎస్‌, ఓలా ఎలెక్ట్రిక్‌, హీరో మోటోకార్ప్‌, ఏథర్‌ ఎనర్జీ వంటి అనేక కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. భారతీయ ఈ2డబ్ల్యూ మార్కెట్‌లో పై నాలుగు కంపెనీలకు 40-45శాతం వాటా ఉంది.

దిగుమతులతో అమ్మకాలు

భారత్‌లోని 50 ఈ2డబ్ల్యూ కంపెనీలలో దాదాపు 21 కంపెనీలకు మాత్రమే ఫేమ్‌-2 సబ్సిడీలు పొందడానికి అర్హత ఉంది. వాటిలో 16 నుంచి 18 కంపెనీలకు ఏడాది నుంచి సబ్సిడీలు నిలిపేశారు. ఈ కంపెనీలు వాహన ధరలను తారుమారు చేస్తున్నాయని, బ్యాటరీలతోపాటు పలు ఈ2డబ్ల్యూ విడిభాగాలను స్వదేశంలో తయారు చేయాలన్న స్థానికీకరణ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలు రావడమే దీనికి కారణం. ఫేమ్‌-2 మార్గదర్శక సూత్రాల కింద ఎలెక్ట్రిక్‌ ద్విచక్ర వాహన (ఈ2డబ్ల్యూ) ధరలోనే పోర్టబుల్‌ ఛార్జర్‌, అంతర్గత సాఫ్ట్‌వేర్‌ ధర కలిసి ఉండాలి. కానీ ఏథర్‌ ఎనర్జీ తమ వాహన సాఫ్ట్‌వేర్‌ను ఆధునికీకరించామనే సాకుతో విడిగా ధర వసూలు చేసిందని, పోర్టబుల్‌ ఛార్జర్‌కూ ధర పిండుకొందనే ఆరోపణలు వచ్చాయి. భారతీయ ఈ2డబ్ల్యూ కంపెనీలు బ్యాటరీలను చైనా, జపాన్‌, కొరియాల నుంచి దిగుమతి చేసుకుంటూ స్థానికీకరణ నియమాన్ని పక్కన పెడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనాలో ఏటా నాలుగు కోట్ల ఎలెక్ట్రిక్‌ స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. భారత్‌లో అనేక కంపెనీలు చైనీస్‌ ఈ2డబ్ల్యూలను విడి భాగాల రూపంలో దిగుమతి చేసుకుని ఇక్కడ బిగించి, సొంత ముద్రలు వేసుకుని అమ్ముకొంటున్నాయి. ఆటో పరిశ్రమతో సంబంధం లేనివారూ ఈ2డబ్ల్యూ మార్కెట్‌లో ప్రవేశిస్తుండటానికి కారణమిదే. అయితే టీవీఎస్‌, హీరో ఎలెక్ట్రిక్‌, బజాజ్‌, ఒకనావా వంటి బడా కంపెనీలూ స్వదేశీ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వకుండా చైనా ఈ2డబ్ల్యూలను సొంత బ్రాండ్‌ పేరిట అమ్ముకొంటున్నాయని ఒక ప్రజావేగు ఆరోపించారు.

కంపెనీలు సతమతం

ఏదిఏమైనా దేశంలో ఈ2డబ్ల్యూల విక్రయాలు పెరుగుతున్నాయి. 2021-22లో 3,27,900 వాహనాలను విక్రయించారు. 2022-23లో అమ్మకాలు 8,46,976కు పెరిగాయని ఎలెక్ట్రిక్‌ వాహన ఉత్పత్తిదారుల సంఘం (ఎస్‌ఎంఈవీ) వెల్లడించింది. ఈ లెక్కన 10 లక్షల ఈ2డబ్ల్యూలను అమ్మాలన్న నీతిఆయోగ్‌ లక్ష్యంలో 20 శాతం తరుగు పడినట్లే. ఏటేటా అమ్మకాలు పెరుగుతున్నా స్థానికీకరణ నియమాన్ని పాటించలేదనే కారణంపై రూ.1,200 కోట్ల సబ్సిడీని బిగపట్టడం పరిశ్రమకు ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతోందని ఎస్‌ఎంఈవీ పేర్కొంది. దీనివల్ల ఈ2డబ్ల్యూ మార్కెట్‌లో 96 శాతం వాటా కలిగిన 16 కంపెనీలు సతమతమవుతున్నాయని వివరించింది. అదీకాకుండా వాహనంలోని బ్యాటరీ పరిమాణంతో ప్రభుత్వం రాయితీలను ముడిపెట్టడం సమస్యాత్మకమవుతోంది. 2.5 కిలోవాట్‌ అవర్లకన్నా తక్కువ సామర్థ్యంగల బ్యాటరీలకు ఫేమ్‌-2 సబ్సిడీ లభించదు. అంటే, దేశంలో తయారవుతున్న ఈ2డబ్ల్యూలలో 95 శాతానికి రాయితీ వర్తించదన్నమాట. ఈ నేపథ్యంలో స్థానికీకరణకు ఉద్దేశించిన పీఎంపీ పథకాన్ని 2023 ఏప్రిల్‌ నుంచి మరో రెండేళ్లు పొడిగించాలని ఎస్‌ఎంఈవీ కోరింది. మరోవైపు ఫేమ్‌-2 పథకాన్ని 2024 తరవాత పొడిగించకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే పీఎంపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఫేమ్‌ బదులు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద ఉత్పత్తిని పెంపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.