ఎగుమతుల్లో ఎక్కడున్నాం?

దేశ ఆర్థికాభివృద్ధికి వస్తు ఎగుమతులు ఎంతో కీలకం. వాటిని పెంచుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వ్యాపారాలు పుంజుకొంటాయి. ఎగుమతుల వృద్ధి ద్వారా వాణిజ్య లోటును తగ్గించుకొని, విదేశ మారకద్రవ్య నిల్వలను పెంచుకోవచ్చు. తద్వారా దేశీయ కరెన్సీ బలపడుతుంది.

Updated : 17 May 2023 17:04 IST

దేశ ఆర్థికాభివృద్ధికి వస్తు ఎగుమతులు ఎంతో కీలకం. వాటిని పెంచుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వ్యాపారాలు పుంజుకొంటాయి. ఎగుమతుల వృద్ధి ద్వారా వాణిజ్య లోటును తగ్గించుకొని, విదేశ మారకద్రవ్య నిల్వలను పెంచుకోవచ్చు. తద్వారా దేశీయ కరెన్సీ బలపడుతుంది.

భారత్‌ 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.36.50 లక్షల కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 5.6శాతం అధికం. అదే సమయంలో రూ.58.71 లక్షల కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. 2021-22తో పోలిస్తే ఇది 16.1శాతం ఎక్కువ. మొత్తం వస్తు ఎగుమతులు, దిగుమతుల మధ్య సుమారు రూ.22లక్షల కోట్ల వ్యత్యాసం ఉంది! అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రతికూల వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో భారత్‌ ఎగుమతుల్లో 5.6శాతం వృద్ధిరేటును నమోదు చేయడం విశేషమే. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కొనసాగుతుండటం... చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు ఎగుమతుల్లో పెరుగుదలకు దోహదపడ్డాయి.

విశ్వసనీయ వాణిజ్య భాగస్వామి

ఈ సారి ఇండియా ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తరవాతి స్థానంలో వరసగా ఎలెక్ట్రానిక్‌ పరికరాలు, బియ్యం, రసాయనాలు, ఔషధ ఉత్పత్తులు ఉన్నాయి. పొగాకు, ఆయిల్‌ విత్తనాలు, కాఫీ, పండ్లు, కాయగూరలు, తోలు ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, పౌల్ట్రీ ఉత్పత్తులూ ఎగుమతుల వృద్ధికి దోహదపడ్డాయి. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరగడం ఎగుమతుల విలువపై కొంతమేర సానుకూల ప్రభావం చూపింది. 2022-23లో మొత్తం ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తుల వాటా 21.1శాతం. విదేశీ వాణిజ్యంలో కీలకంగా భావించే ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు 2021-22 కంటే తక్కువగానే నమోదయ్యాయి. భారత్‌ ఎక్కువగా వస్తువులను ఎగుమతిచేసే దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో నిలుస్తోంది. యూఏఈ ద్వితీయ స్థానంలో ఉంటోంది. ఇన్నాళ్లూ చైనా మూడో స్థానంలో ఉండేది. ఇప్పుడు నెదర్లాండ్స్‌ డ్రాగన్‌ దేశాన్ని నాలుగో స్థానంలోకి నెట్టి మూడో స్థానానికి చేరింది.

ఎగుమతుల విషయంలో 2021-22 ఆర్థిక సంవత్సరాన్ని మరవలేం. సవరించిన అంచనాల ప్రకారం ఆ ఏడాది ఎగుమతుల్లో 9.1శాతం వృద్ధిరేటు కనిపించింది. కొవిడ్‌ మూలంగా 2019-20, 2020-21 ఎగుమతుల్లో భారీ పతనం నెలకొంది. అయితే 2022-23లో పరిస్థితి మారింది. ఉక్రెయిన్‌లో యుద్ధానికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడి, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు తలెత్తాయి. వాణిజ్య పరంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ భారత ఎగుమతుల్లో పెరుగుదల కనిపించడం విశేషమనే చెప్పాలి. విదేశాల నుంచి చెల్లింపులు పెరగడంతో కరెంట్‌ ఖాతా లోటు నియంత్రణలోకి వస్తోంది. ప్రపంచ దేశాల దృష్టిలో భారత్‌ ఒక బలమైన, విశ్వసనీయమైన వాణిజ్య భాగస్వామి. అందుకే ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయా దేశాలు భారత్‌తో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇటీవల మారిషస్‌, యూఏఈ, ఆస్ట్రేలియాలు భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. యూకే, కెనడా, ఐరోపా సమాఖ్య, బంగ్లాదేశ్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాలతో వాణిజ్య ఒప్పందాల విషయంలో సంప్రతింపులు కీలక దశకు చేరుకుంటున్నాయి. నాణ్యమైన సరకులను సరసమైన ధరలకు సరఫరా చేయడం ద్వారా చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్న దేశాలను భారత్‌ ఆకట్టుకోవచ్చు. ఈ దిశగా కేంద్రం తలపెట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌, ఆధునికీకరణ, డిజిటలైజేషన్‌ వంటి కార్యక్రమాలను మరిన్ని రంగాలకు విస్తరించుకోవాల్సిన అవసరముంది.

విలువ జోడింపు కీలకం

ఉత్పత్తులను భారత్‌ నేరుగా విదేశాలకు పంపకుండా, విలువ జోడించి వాటిని ఎగుమతి చేయాలి. తద్వారా అధిక ధర లభిస్తుంది. ఒకప్పుడు ప్రజల ఆకలి తీర్చడానికి విదేశాలపై ఆధారపడిన ఇండియా- నేడు ప్రపంచానికి అవసరమైన బియ్యంలో 40శాతం సమకూరుస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో విలువను జోడించే అవకాశాలు ఎక్కువ. ఆ దిశగా భారత్‌ దృష్టి సారించాలి. ఇండియా నేడు 75కు పైగా దేశాలకు రక్షణరంగ ఉత్పత్తులను, పరికరాలను ఎగుమతి చేస్తోంది. సమీప భవిష్యత్తులో వాటిని మరింతగా పెంచుకునేందుకు కృషి జరగాలి. అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలను భారత్‌ సాకారం చేసుకోవాలంటే- వస్తు ఉత్పత్తి, ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలి.

ఆచార్య బి.ఆర్‌.కె.రావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.