కనుమరుగవుతున్న తుమ్మెద జాతులు

నేడు ప్రపంచ తేనెటీగల దినోత్సవం. మానవుడితో పాటు ఇతర జీవుల ఆహార భద్రతకు, కొన్ని జాతుల మొక్కల మనుగడకు తేనెటీగలు, కందిరీగలు వంటి తుమ్మెద జాతులే ఆధారం.

Published : 20 May 2023 01:11 IST

నేడు ప్రపంచ తేనెటీగల దినోత్సవం. మానవుడితో పాటు ఇతర జీవుల ఆహార భద్రతకు, కొన్ని జాతుల మొక్కల మనుగడకు తేనెటీగలు, కందిరీగలు వంటి తుమ్మెద జాతులే ఆధారం. అవి క్రమంగా కనుమరుగవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మొక్కల్లో పరాగసంపర్కం ద్వారా ఫలదీకరణకు తేనెటీగలు, కందిరీగలు తోడ్పడతాయి. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 35శాతానికి ఇవే కారణం. పన్నెండు వందలకు పైగా పంటల్లో పరాగసంపర్కం తుమ్మెదల ద్వారా జరుగుతుంది. ఇవి ప్రొటీన్ల కోసం పరాగరేణువులపై, పిండిపదార్థాల కోసం మకరందంపై ఆధారపడతాయి. పరాగరేణువులు ఆహారంగానే కాకుండా రాణీ ఈగ గుడ్లు పెట్టడానికీ ఉపయోగపడతాయి. తుమ్మెద జాతుల్లో చాలావరకు, తేనెటీగల మాదిరిగా తేనెను ఉత్పత్తి చేయవు. అవి కేవలం ఆహారం కోసమే మొక్కలపై ఆధారపడతాయి. 

ప్రపంచంలో 20వేల తుమ్మెద జాతులు ఉన్నాయి. వాటిలో 90శాతానికి పైగా సామూహికంగా ఉండే తేనెటీగలు, కందిరీగలే. మిగతావి ఒంటరిగా ఉండే తుమ్మెద జాతులు. ఇతర కీటకాలతో పోలిస్తే తేనెటీగలు, తుమ్మెదల శరీరంపై పెద్దయెత్తున  వెంట్రుకలు ఉంటాయి. అవి పరాగరేణువులను పట్టి ఉంచి, మొక్కల్లో ఫలదీకరణకు తోడ్పడతాయి. వివిధ రకాల తుమ్మెదలు కేవలం కొన్ని మొక్కజాతుల పరాగసంపర్కానికే తోడ్పడతాయి. అందువల్ల వాటి మనుగడ కొన్ని ప్రత్యేక మొక్క జాతుల ఉనికికి కారణమవుతోంది. తేనెటీగలు, కందిరీగలు తగ్గిపోతే వన్యజాతి మొక్కల సంఖ్యా పడిపోతుంది. దానివల్ల వన్యప్రాణులకు ఆహార కొరత తలెత్తుతుంది. ఒక తేనె పట్టులో యాభై వేలకు పైగా తేనెటీగలు ఉంటాయి. అవి ఆహారం కోసం మూడు కిలోమీటర్ల  దాకా ప్రయాణిస్తాయి. ఎలుగుబంట్లు, పుట్టి ఎలుగు (హనీ బ్యాడ్జర్‌), రకూన్‌ తదితర జంతువులు, హనీ బజార్డ్‌ వంటి పక్షులకు తేనె, తేనెటీగల లార్వాలే ప్రధాన ఆహారం. ఆవరణ వ్యవస్థలో ఎనలేని ప్రాధాన్యం కలిగిన తేనెటీగలు, కందిరీగలను కీలకమైన జాతులు (కీస్టోన్‌ స్పీషీస్‌)గా చెబుతారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా తుమ్మెదల సంఖ్య ప్రమాదకర రీతిలో తగ్గుతోంది.ఇప్పటికే మూడోవంతు తుమ్మెదల జనాభా కనుమరుగైనట్లు ఒక అంచనా. ఆవాసాలు క్షీణించడం, సహజ పరిసరాలు, వాటిలోని వైవిధ్యం దెబ్బతినడం వల్ల తుమ్మెదలు పోషకాహార లోపం బారిన పడుతున్నాయి, పర్యావరణ ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. పంటల వైవిధ్యం తగ్గి ఒకే విధమైన వాటిని సాగుచేయడం ప్రపంచవ్యాప్తంగా అధికమైంది. దాంతో ఒకేరకమైన ఆహారాన్ని చాలాకాలం పాటు తీసుకోవాల్సి రావడం వల్ల తుమ్మెదల్లో రోగనిరోధక శక్తి దెబ్బతింటోంది. దాంతో అవి బ్యాక్టీరియా, వైరస్‌ వ్యాధుల బారిన పడుతున్నాయి. ప్రధానంగా పరాన్నజీవులు, వ్యాధికారక క్రిముల బారినపడటం, పురుగుమందుల ప్రభావం వల్ల వాటి వ్యాధినిరోధకత దెబ్బతిని పెద్దయెత్తున మరణిస్తున్నాయి. పురుగుమందుల్లోని రసాయనాలు తుమ్మెదల లార్వాల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయి. వాతావరణ మార్పుల వల్లా తేనెటీగల మనుగడ ప్రమాదంలో పడుతోంది. వరి, గోధుమ, మొక్కజొన్న వంటి ప్రధాన ఆహార పంటల్లో పరాగసంపర్కం అధికంగా గాలి ద్వారానే జరుగుతుంది. తేనెటీగలు, తుమ్మెదలు అదృశ్యమైతే సుమారు 25వేల రకాల పుష్పించే, పండ్ల, కూరగాయల మొక్క జాతుల్లో 60శాతం నశిస్తాయని అంచనా! దానివల్ల పంటల దిగుబడి తగ్గి, ఆహార కొరత ఏర్పడుతుంది.

భారత్‌లో తేనెటీగల పెంపకం ద్వారా రెండున్నర లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. మొత్తం తేనె ఉత్పత్తిలో 75శాతం వన్యజాతి తేనెటీగల నుంచే లభిస్తోంది. గత పదేళ్లలో వాటి సంఖ్య 20శాతం తగ్గిపోయింది. ప్రధానంగా పంటలపై పురుగుమందులను అతిగా వాడటం వల్లనే దేశంలో తేనెటీగలు, తుమ్మెదల సంఖ్య తగ్గిందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తేనె ఉత్పత్తి కోసం స్థానికేతర జాతుల తేనెటీగలను పెంచడమూ దేశీయ జాతుల తరుగుదలకు దారితీస్తోంది. తేనెటీగలు, కందిరీగలకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలంటే వాటికి హానికరంగా పరిణమిస్తున్న పురుగుమందుల వాడకాన్ని నిలిపివేయాలి. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. వాటి మనుగడకు ఆధారమైన స్థానిక మొక్క జాతులను విరివిగా పెంచాలి. ఆవరణ వ్యవస్థలో తేనెటీగలు, కందిరీగల పాత్ర, వాటి సంరక్షణ గురించి రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరమూ ఉంది.

 ఎం.రామ్‌మోహన్‌
(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.