డిజిటల్‌ సాగుతో లాభాల పంట

భారత్‌లో జనాభా పెరుగుదల వల్ల 2050 నాటికి ఆహార కొరత తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. దీన్ని నివారించేందుకు వ్యవసాయ ఉత్పత్తులను పెంచాల్సిన అవసరముంది.

Published : 20 May 2023 01:03 IST

భారత్‌లో జనాభా పెరుగుదల వల్ల 2050 నాటికి ఆహార కొరత తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. దీన్ని నివారించేందుకు వ్యవసాయ ఉత్పత్తులను పెంచాల్సిన అవసరముంది. ఇందుకోసం డిజిటల్‌ సాగు విధానం ఎంతగానో తోడ్పడుతుంది.

దేశీయంగా తొంభయ్యో దశకంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణల ప్రభావంతో జాతీయాదాయంలో వ్యవసాయరంగం వాటా క్రమంగా క్షీణిస్తోంది. అయినా, దేశ ఆర్థిక వ్యవస్థలో సాగు ప్రాధాన్యాన్ని విస్మరించలేం. నేటికీ సుమారు 60శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తోంది. ప్రపంచంలో అమెరికా తరవాత అత్యధిక వ్యవసాయ భూమి భారత్‌లోనే ఉంది. పంట ఉత్పాదకతలో మాత్రం అగ్రరాజ్యం కన్నా భారత్‌ చాలా వెనకబడింది. చైనా సైతం మనకన్నా ఎంతో ముందంజలో ఉంది. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు దశాబ్దాలుగా వ్యవసాయంలో కృత్రిమ మేధ(ఏఐ), రిమోట్‌ సెన్సింగ్‌ వంటి డిజిటల్‌ సాంకేతికతలను విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. ఈ విషయంలో భారత్‌ చాలా వెనకబడింది.

మౌలిక సదుపాయాల కొరత

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగు రంగంలో డిజిటల్‌ సాంకేతికతను పెంచడానికి పలు చర్యలు తీసుకున్నా, ఆశించిన ఫలితాలు దక్కలేదు. వ్యవసాయంలో డిజిటలీకరణ గ్రామాల్లో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి, వ్యవసాయ క్షేత్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. పంటల్లో తెగుళ్లు, అనూహ్య వాతావరణ మార్పులను ముందుగానే పసిగట్టి నష్టాలను తగ్గించుకొనే వీలుంటుంది. ఫలితంగా ప్రతి సీజన్‌లో రైతులు లాభాలు ఆర్జించవచ్చు. ఇది వ్యవసాయాభివృద్ధికి, గ్రామీణ పునరుజ్జీవనానికి తోడ్పడుతుంది.
కొవిడ్‌ మహమ్మారి సంప్రదాయ వ్యవసాయాన్ని డిజిటల్‌ రూపంలోకి మార్చడానికి అవకాశం కల్పించింది. ఇండియాలో డిజిటల్‌ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. విశ్వసనీయత లేని ఇంటర్నెట్‌ కనెక్షన్లు, ఖరీదైన డిజిటల్‌ పరికరాలు, పరిశోధనపై అలక్ష్యం, డిజిటల్‌ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన లేకపోవడం వంటివి అవరోధాలుగా నిలుస్తున్నాయి. పట్టణ జనాభాలో 67శాతం క్రియాశీల ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. గ్రామీణంలో ఇది 32శాతమే. అంతర్జాలంలో ఈ వెనకబాటు డిజిటల్‌ వ్యవసాయ వృద్ధికి ప్రధాన ప్రతిబంధకంగా మారింది. ఇంటర్నెట్‌ అనుసంధానత, డిజిటల్‌ పరికరాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలి. ఇండియాలోని అన్నదాతల్లో 82శాతం చిన్న, సన్నకారు రైతులే. దాదాపు 60శాతం సాగుభూమి వర్షాధారమే. 37శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. ఇలాంటివారంతా ఖరీదైన డిజిటల్‌ సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయలేరు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అధిక వ్యయంతో కూడిన డిజిటల్‌ పరికరాలను తక్కువ ధరకే రైతులకు అందుబాటులో ఉంచాలి. అన్నదాతలు సులభంగా రుణాలు పొందే ఏర్పాటు చేయాలి.

ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధికి చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. అమెరికాలో సాగు రంగంలో ఆర్‌అండ్‌డీకి జీడీపీలో 2.8శాతం, చైనాలో 2.1శాతం ప్రత్యేకిస్తున్నారు. భారత్‌లో కేవలం  0.6-0.7శాతమే విదిలిస్తున్నారు. దానివల్ల దీర్ఘకాలంలో డిజిటల్‌ వ్యవసాయానికి సంబంధించి ప్రపంచ స్థాయి లక్ష్యాలను అందుకోవడం క్లిష్టమవుతుంది. గ్రామీణంలో 53శాతం రైతులే అక్షరాస్యులు. వారిలో దాదాపు 33శాతం ఒకటి నుంచి అయిదు తరగతుల్లోపు చదివినవారే. వ్యవసాయంలో డిజిటల్‌ సాంకేతికతను విజయవంతంగా అమలు చేయడానికి ఇదీ ఒక అవరోధంగా నిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని అన్నదాతలు, యువతలో డిజిటల్‌ అక్షరాస్యతను ఇతోధికంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

ప్రైవేటు సహకారం

సాంకేతిక వ్యవస్థల సులభ నిర్వహణ, సకాలంలో వాటి పంపిణీ వంటివి ఇండియాలో డిజిటల్‌ వ్యవసాయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకంగా నిలుస్తాయి. వీటికి సంబంధించి ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంపై పాలకులు దృష్టి సారించాలి. రైతులు డిజిటల్‌ సాంకేతికత ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందడానికి ప్రతి గ్రామ పంచాయతీలో అగ్రిటెక్‌ స్టార్టప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఒక్కటే డిజిటల్‌ వ్యవసాయాన్ని విజయవంతం చేయలేదు. అందుకోసం ప్రతి దశలో ప్రైవేటు రంగం సహకారం అవసరం. మారుమూల గ్రామాల్లోని డిజిటల్‌ ప్రాజెక్టులు ప్రైవేటు సంస్థలకు లాభదాయకంగా ఉండకపోవచ్చు. అందువల్ల వాటికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. ఈ రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం కోసం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించి, ఆచరణలోకి తేవాలి.

 డాక్టర్‌ సత్యనారాయణమూర్తి దొగ్గ
(సహాయ ఆచార్యులు, రాజస్థాన్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి