కాలనాగుల బుసలు

‘అబ్బా... ఏంటి ప్రభాకరం ఆ గావుకేకలు, చెవులు చిల్లులు పడేలా. వస్తున్నా ఆగు’ ‘త్వరగా రా బాబాయ్‌!’ ‘అబ్బబ్బ... నువ్వూ మీ పిన్నిలానే తెగ హడావుడి చేస్తున్నావుగా. అంతలా ఏం కొంపలంటుకుపోయాయ్‌!’ ‘మరి... ఏటీఎంలో... ఏం జరిగిందంటే...’ ‘చూడబ్బాయ్‌... నా దగ్గర రెండువేల రూపాయల నోట్లు గట్రా లేవు. నాకు బ్యాంకులూ ఏటీఎంలతో ఇప్పుడప్పుడే పనిలేదు’ ‘ఇందుకు కదా బాబాయ్‌! నిన్ను మా పిన్ని కోపగించుకునేది. చెప్పేది పూర్తిగా విను’ ‘తెగ కంగారు పెట్టేస్తున్నావు... ఇంతకీ ఏమైంది?’

Published : 27 May 2023 02:18 IST

‘అబ్బా... ఏంటి ప్రభాకరం ఆ గావుకేకలు, చెవులు చిల్లులు పడేలా. వస్తున్నా ఆగు’
‘త్వరగా రా బాబాయ్‌!’

‘అబ్బబ్బ... నువ్వూ మీ పిన్నిలానే తెగ హడావుడి చేస్తున్నావుగా. అంతలా ఏం కొంపలంటుకుపోయాయ్‌!’
‘మరి... ఏటీఎంలో... ఏం జరిగిందంటే...’

‘చూడబ్బాయ్‌... నా దగ్గర రెండువేల రూపాయల నోట్లు గట్రా లేవు. నాకు బ్యాంకులూ ఏటీఎంలతో ఇప్పుడప్పుడే పనిలేదు’
‘ఇందుకు కదా బాబాయ్‌! నిన్ను మా పిన్ని కోపగించుకునేది. చెప్పేది పూర్తిగా విను’
‘తెగ కంగారు పెట్టేస్తున్నావు... ఇంతకీ ఏమైంది?’

‘ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఓ ఏటీఎం కేంద్రంలో కార్డు పెట్టి పిన్‌ కొట్టగానే పాముపిల్లలు పాక్కుంటూ వచ్చాయట. ఇంకేముంది- వరసలో ఉన్నవారంతా పరుగులు పెట్టారట’

‘అవునా... నిజంగా ఇది వింతే అబ్బాయ్‌! అయినా నాకో అనుమానం... పూర్వం నిధులకు నాగబంధనం వేసినట్లు ఆ ఏటీఎంకు కూడా సర్పబంధనం వేశారా ఏమిటి?’

‘ఈ కాలంలో అవన్నీ ఎక్కడున్నాయి బాబాయ్‌?’

‘ఏం... ఎందుకు లేవు. మన కళ్ల ముందే... కాలనాగులు కాలరెగరేస్తూ, చట్టాలను కాలరాస్తూ, రుసరుసగా బుసలు కొడుతున్నాయి... తనను తాను ఆసుపత్రిలో ‘ఇష్ట’దిగ్బంధనం చేసుకుని దర్యాప్తు అధికారులనే అష్టకష్టాలు పెడుతున్నారు... అనుచరులను ‘నిశా’చరులుగా మార్చి పగలూ రాత్రీ కాలకేయ సైన్యంలా కాపలాగా పెట్టుకుంటున్నారు... పాత్రికేయుల సంచులు, సామగ్రి లాక్కొని పరుగులు పెట్టిస్తున్నారు... కూర్చున్న చోటు నుంచి కదలకుండా వ్యవస్థలకు వ్యవస్థలనే అవస్థల పాలయ్యేలా అపహాస్యం చేస్తున్నారు! ఇంత తతంగం జరుగుతున్నా... ఓ పెద్దన్న బటన్ల మీద బటన్లు నొక్కుతూ బ్రహ్మాండంగా కాపాడుకొస్తుంటే... మన దగ్గరే ఇన్ని వింతలూ విడ్డూరాలు జరుగుతుంటే... నువ్వేమో ఇంకా అమాయకుడిలా మాట్లాడుతున్నావు’

‘అంతేనా బాబాయ్‌! అయినా పరుల సొమ్ము పాము వంటిది అంటారు కదా. ఏటీఏంలో ఉండేదంతా పరులసొమ్మేనాయే... అందుకే పాములు వచ్చి ఉంటాయి’
‘పిల్లపాములకే అంత కంగారుపడిపోతే ఎలా అబ్బాయ్‌... మన దగ్గర కోట్లకు పడగలెత్తిన కట్లపాములెన్నో ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని అమాంతం మింగేసి హాయిగా అరాయించుకునే కొండచిలువలూ ఉన్నాయి. కొండల్నీ గుట్టల్ని పీల్చి పిప్పిచేసే అనకొండలూ ఉన్నాయి. ప్రశ్నించే వారిమీద విషం చిమ్మే రక్త పింజరలు లేవా ఏమిటి? అయినా అబ్బాయ్‌... చట్టం తనపని తాను చేసుకుపోతుందంటారు కానీ, ఇప్పుడు ఆ చట్టానికి పెద్ద కష్టమే వచ్చింది. అల్లరి మూకల్ని ఆసరా చేసుకుని రౌడీల్లా ఢీ అంటే ఢీ అంటూ అధికారుల్ని తమ పని తమను చేసుకోనివ్వడం లేదు. పైగా ‘లేక... లేక... రాశాను ఒక లేఖ... మీకెందుకంత తొందర. కాసేపు ఆగక’ అంటూ సన్నగా సన్నాయి నొక్కులూ నొక్కుతున్నారు’

‘ఆరారగా కోరలు చాచి బుసలు కొడుతున్న తాచుపాముల్ని బూర ఊది... బుట్టల్లో బంధించే నాథులే లేరా బాబాయ్‌?’

‘మనది కర్మభూమి. అందుకేనోమో కొన్ని సార్లు ఎవరి ఖర్మకు వాళ్లను వదిలేయాల్సి రావచ్చు. అయినా కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది’

‘అంటే... అదీ... కాలనాగులకూ కాలమే బదులిస్తుందా!? ఈలోపు వాటి కాటుకు బలైపోయేవారి మాటేమిటి?’
‘అధికారమనే మణి వాటి దగ్గర ఉన్నంత వరకు ఆ విషనాగులు అలాగే పడగలెత్తి, పగతో రగులుతూ ఇష్టారీతిన ఆడుతూనే ఉంటాయి. అయిదేళ్లు పూర్తయితే కానీ, వాటి కోరలను పూర్తిగా పీకలేం. పట్టి బంధించలేం. విషానికి విరుగుడూ కనుక్కోలేం’

‘అలా అంటే ఎలా గురువు  గారూ... కలుగులో ఉన్న ఎలుకల్ని ఎప్పుడంటే అప్పుడు పట్టుకోగలం కానీ ప్రజాక్షేత్రంలో ఉన్న నాగుల్ని పట్టలేమంటారా?’
‘నాకైతే అలా అనాలని లేదు. కొండలా అధికారం అండదండలుంటే అరదండాలు పడటానికి కాస్త అడ్డంకులు, అసలైన ఆటకు ఆటంకాలు తప్పవు. మొత్తానికి నేను చెప్పొచ్చే చేదునిజం ఏమిటంటే... ఆలస్యం అయితే చేయగలరు కానీ, చివరకు పాపాలపుట్ట బద్దలు కాకతప్పదు. అప్పుడు అరాచక అనకొండల ఆట కడుతుంది. అధికారానికి కత్తెర పడుతుంది’

‘తథాస్తు... జనానికి పట్టిన పీడ విరగడయ్యే రోజు ప్రాప్తిరస్తు!’

‘శ్రీరస్తు... శుభమస్తు.. ప్రభాకరం ఇదిగో- ఈ పకోడీలు, ఆ చెగోడీలు తింటూ ఉండు. మనిద్దరికీ కాస్త కాఫీ కలుపుకొస్తానుండు’

దస్తగిర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.