భారీ వృక్షాలకు మరణ శాసనం

ఇటీవల 163వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న 705 మర్రి చెట్లను నరికి వేయకుండా ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)ను జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆదేశించింది.

Updated : 28 May 2023 07:06 IST

ఇటీవల 163వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న 705 మర్రి చెట్లను నరికి వేయకుండా ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)ను జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆదేశించింది. వాటిపై ప్రత్యేకంగా అధ్యయనం చేపట్టాలని స్పష్టంచేసింది. రోడ్ల విస్తరణలో మర్రి వంటి భారీ వృక్షాల తొలగింపులో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది.

భారత ఉపఖండానికి చెందిన మర్రి మన జాతీయ వృక్షం. మర్రి, రావి వంటి ఫైకస్‌ జాతి చెట్లకు భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం ఉంది. వీటిని పవిత్రంగా పూజిస్తారు. మర్రి, రావి చెట్టు లేని రచ్చబండలు, గ్రామాలు, ప్రార్థనా స్థలాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారిన బోధివృక్షం, రావి చెట్టే. హౌరాలోని జగదీశ్‌ చంద్రబోస్‌ ఉద్యానవనంలోని ‘గ్రేట్‌ బన్యన్‌’ ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టుగా పేరొందింది. తెలంగాణ మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి, ఆంధ్రప్రదేశ్‌ గూటిబయలులోని తిమ్మమ్మ మర్రిమాను, గుజరాత్‌ భరూచ్‌ జిల్లాలోని కబీర్‌వాద్‌ మర్రి చెట్లూ ప్రసిద్ధిచెందాయి. 2018లో వందల సంవత్సరాల వయస్సుగల పిల్లలమర్రి వ్యాధిగ్రస్తమై క్షీణతకు గురికాగా, పలుసంరక్షణ చర్యలతో కాపాడారు. ప్రపంచంలో ఎనిమిది వందలకుపైగా మర్రి జాతులున్నాయి. మర్రి, రావి, మేడి, జువ్వి మొదలైనవి సాధారణంగా మన ప్రాంతంలో పెరిగే జాతులు.

వ్యాధులకు ఔషధం

ఆవరణ వ్యవస్థలో మర్రి చెట్టు పాత్ర ఎంతో కీలకం. ఇది సతత హరితంగా ఉంటూ, సత్వరమే పెరిగే భారీ వృక్ష జాతి. దాదాపు దేశమంతటా విస్తరించింది. అటవీ, అటవీయేతర ప్రాంతాల్లోనూ వ్యాపిస్తుంది. అత్తిపళ్లుగా పిలిచే మర్రి జాతుల పండ్లు ఎన్నో పక్షి, క్షీరద జాతులకు ఆహారం. కందిరీగలు ఇతర కీటకాల వల్ల మర్రి జాతుల్లో ఫలదీకరణం జరుగుతుంది. ప్రధానంగా పండ్లను తినే పక్షులు, గబ్బిలాల ద్వారా విత్తన వ్యాప్తి సంభవిస్తుంది. పక్షుల జీర్ణ వ్యవస్థ ద్వారా ప్రయాణించే విత్తనాలు రసాయన చర్యలతో త్వరగా మొలకెత్తుతాయి. మర్రి చెట్లు ఊడలతో విశాల ప్రాంతంలో విస్తరించి భారీ వృక్షాలుగా రూపొందుతాయి. నేలపైనే కాకుండా, భవనాలు, జీవ, నిర్జీవ చెట్లు, రాళ్ల మధ్య, జలాభావ పరిస్థితుల్లో సైతం మనుగడ సాగించగలుగుతాయి. మర్రి నుంచి వెలువడే పాలు(లేటెక్స్‌), ఊడలు, వేళ్లు మొదలైన వాటిని వివిధ రుగ్మతలకు ఔషధాలుగా అనాదిగా ఉపయోగిస్తున్నారు. ఏళ్లకొద్దీ జీవించే మర్రిజాతి చెట్లు క్రిమికీటకాలు, పక్షులు, గబ్బిలాలు తదితర ఎన్నో జాతులకు ఆవాసంలా, ఆహార వనరుగా ఉపయోగపడతాయి. అటవీ విస్తీర్ణం క్షీణిస్తున్న తరుణంలో వృక్షసంపద పునరుద్ధరణకు మర్రిజాతులు ఎంతో తోడ్పడతాయి. విత్తన వ్యాప్తికి ఉపయోగపడే పక్షులు, జంతువులను ఆకర్షించడంలో ఇతర వృక్షాలకంటే మర్రిజాతులే ముందు వరసలో ఉన్నట్లు అస్సామ్‌లో చేపట్టిన పరిశోధనలో గుర్తించారు. మర్రిజాతి చెట్ల చుట్టూ పక్షులు జంతువుల ద్వారా జరిగే విత్తన వ్యాప్తితో మొలకెత్తిన వివిధ మొక్క జాతుల సంఖ్య 75శాతం అధికమని, వాటి సాంద్రతా రెట్టింపుగా ఉన్నట్లు ఆ అధ్యయనం స్పష్టం చేసింది.

సుదీర్ఘ సమయం

ప్రస్తుత కాలంలో ఆర్థిక అవసరాలు, భవనాలు, రహదారుల నిర్మాణాల్లో భాగంగా ఎన్నో మర్రి, రావి చెట్లు నేలకొరుగుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ప్రైవేటు భూముల్లో ఉండే చెట్లను నరకడానికి, రవాణా చేయడానికి అనుమతి అవసరంలేని, మినహాయింపు ఇచ్చిన వృక్షజాతుల్లో మర్రి, రావి వంటివి ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, రుసుము చెల్లించి, సంబంధిత భూమి, చెట్ల వివరాలను అటవీశాఖకు తెలియజేస్తే సరిపోతుంది. ఇది మర్రి చెట్ల మనుగడకు అశనిపాతమే. కొన్ని సందర్భాల్లో భారీ కొమ్మలను తొలగించి, వాటిని మరో ప్రాంతానికి తరలించి నాటుతున్నారు. కానీ, ఇది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. అంతేగాకుండా నాటిన చెట్లలో అన్నీ బతికే అవకాశం తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. అలా నాటుకున్న చెట్లు సైతం తిరిగి పెరగడానికి కనీసం పదేళ్లు పడుతుంది. అటవీ పునరుద్ధరణకు, విస్తరణకు దోహదపడుతూ, జీవవైవిధ్యానికి నెలవులుగా పర్యావరణ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న భారీ వృక్షాలు, ముఖ్యంగా మర్రి జాతి వంటి చెట్ల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాటిని తొలగించే విషయంలో పునరాలోచన చేయాలి. కొత్త వృక్షాల పెంపకానికి నడుంకట్టాలి.

ఎం.రామ్‌మోహన్‌ (సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి