దొంగ ఓట్ల మాటేమిటి?

తొంభైనాలుగు కోట్లకు పైబడిన ఓటర్లు కలిగిన భారత్‌ను ఎందరో ప్రజాస్వామ్య మేరునగంగా అభివర్ణిస్తారు. అటువంటిచోట, ఎన్నికల నిర్వహణకు ప్రాణాధారమైన ఓటర్ల జాబితాలు పక్కాగా ఉన్నాయా అని ఎవరూ పొరపాటునైనా ప్రశ్నించకూడదు.

Published : 28 May 2023 00:51 IST

తొంభైనాలుగు కోట్లకు పైబడిన ఓటర్లు కలిగిన భారత్‌ను ఎందరో ప్రజాస్వామ్య మేరునగంగా అభివర్ణిస్తారు. అటువంటిచోట, ఎన్నికల నిర్వహణకు ప్రాణాధారమైన ఓటర్ల జాబితాలు పక్కాగా ఉన్నాయా అని ఎవరూ పొరపాటునైనా ప్రశ్నించకూడదు. దురదృష్టం ఏమిటంటే, అవి తప్పుల తడకలుగా కొనసాగుతున్నాయన్న యథార్థం అందరికీ తెలుసు. క్యాలెండర్‌ చేతపుచ్చుకొని నిర్ణీత కాలావధిలో ఎన్నికలు నిర్వహించడంతోనే స్వీయ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించినట్లు ఎలెక్షన్‌ కమిషన్‌ భ్రమపడుతుంటుంది. ధన భుజ బలాలకు తోడుగా దొంగ ఓట్ల దన్నుతో ఎన్నికల రంగాన్ని యథేచ్ఛగా దున్నేయడానికి తరతమ భేదాలతో రాజకీయ పక్షాలు ఉరకలెత్తుతుంటాయి. దిక్కుతోచని జనం మూగపావులుగా మిగిలిపోతుంటారు. ఈ దృశ్యాలు పదేపదే పునరావృతమవుతూ భారతీయ ఘన జనతంత్రాన్ని సారహీనం చేసేస్తున్నాయి. సాంకేతికంగా, ఇక్కడి ప్రతి ఓటూ అత్యంత కీలకమే. ఒకే ఒక్క ఓటు తేడాతో కేంద్రంలో ప్రభుత్వమే కుప్పకూలిన దేశం మనది. ఒక్క ఓటు తేడాతో చట్టసభల ఎన్నికల బరిలోని అభ్యర్థుల జయాపజయాలు తారుమారైన ఉదంతాలకూ కొదవ లేదు. జనస్వామ్య తులాభారంలో ప్రతి ఓటూ తులసిదళమే అయినప్పుడు- ఓటరు జాబితాలను సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం (ఈసీ) అడుగడుగునా ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? వాస్తవంలో ఆ స్పృహే కొరవడిన నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తాజా ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తోంది.

దేశంలో రోజూ సగటున సుమారు 79వేలకు పైగా జననాలు, 29వేల దాకా మరణాలు సంభవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమాచారాన్ని ఓటరు జాబితాలతో అనుసంధానించడానికి ఉద్దేశించిన ప్రత్యేక బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు అమిత్‌ షా వెల్లడించారు. ఇలా ఎప్పటికప్పుడు జననాల వివరాలు నమోదు చేస్తూ- పద్దెనిమిదేళ్లు నిండిన పౌరులెవరూ పనికట్టుకుని ఓటరు కార్డుకోసం అర్జీ పెట్టుకునే అవసరం లేకుండా విధివిధానాల్ని ప్రక్షాళించాలి. అలాగే, చనిపోయినవారి పేర్లను యాంత్రికంగా తొలగించే పద్ధతినీ సక్రమంగా పాటించాలి. ఫిన్లాండ్‌లో జాతీయ జనాభా రిజిస్టర్‌ ప్రాతిపదికన కొత్త ఓటర్ల నమోదు దానంతటదే జరిగిపోతుంది. ఆస్ట్రేలియాలో పద్దెనిమిదేళ్లు నిండిన పౌరులు ప్రత్యేకంగా ఎవరినీ అభ్యర్థించనక్కరలేదు, ఏ కార్యాలయాన్నీ సంప్రతించనక్కరలేదు. నిర్ణీత కాలావధిలో ఇంటింటికీ తమ సిబ్బందిని ఎలక్టోరల్‌ కమిషనే పంపిస్తుంది. అదే తరహాలో ఇక్కడా ప్రతిపాదిత శాసన నిర్మాణం ద్వారా ఓటర్ల జాబితాల ప్రక్షాళన పట్టాలకు ఎక్కితే, ఆ మేరకు కొంతైనా మేలు చేకూరుతుందేమో చూడాలి.

జనన మరణాల సమాచారాన్ని ఓటరు జాబితాలతో అనుసంధానించడంతోనే ఎన్నికల మాయామేయ దృశ్యాలు అమాంతం చెల్లాచెదురైపోతాయని విశ్వసించే వీల్లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలవేళ భారీయెత్తున బోగస్‌ ఓట్లు నమోదైనట్లు గగ్గోలు పుట్టింది. ఒక్క తిరుపతిలోనే 15వేల బోగస్‌ ఓట్లు వెలుగులోకి వచ్చాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఖాళీ స్థలాన్ని చిరునామాగా పేర్కొని అక్కడ పదిమంది పట్టభద్రుల్ని ఓటర్లుగా చేర్చేశారు. ఓ కార్మికుడి ఇంట్లో 12 మంది నకిలీ ఓటర్లు పుట్టుకొచ్చారు. లోగడ తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పెద్దయెత్తున ఓట్లు గల్లంతయ్యాయి. తమ కార్యనిర్వాహక తప్పిదాల వల్లనే మహారాష్ట్రలో రెండు లక్షల ఓట్లు మాయమైపోయాయని 2014లో ఎన్నికల సంఘం బహిరంగంగా అంగీకరించింది. ఓటర్ల జాబితాలు నిర్దుష్టంగా కట్టుదిట్టంగా ఉండేట్లు సకల విధ జాగ్రత్తలూ తీసుకోవాల్సిన ఈసీ అసమర్థత, అలసత్వం నిర్ఘాంతపరుస్తున్నాయి. దేశంలోని ఓటర్ల జాబితాల్లో ఎనిమిదిన్నర కోట్ల పేర్లు బోగస్‌ లేదా నకిలీవని ఎనిమిదేళ్ల క్రితం సీఈసీగా హెచ్‌ఎస్‌ బ్రహ్మ లెక్క చెప్పారు. అది అప్పటి లెక్క. రాజకీయ పక్షాలు, శ్రేణుల చేతివాటం పుణ్యమా అని మరెన్ని దొంగఓట్లు జాబితాలో చేరిపోయాయో ఎవరికెరుక?

ఎందరో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల్లో కనిపించకుండా పోవడం వెనక కుట్రకోణాలపై ఆరోపణలు, ఘాటు విమర్శలకు దేశంలో కొదవే లేదు. సిబ్బంది అడిగిన వివరాలన్నీ సమర్పించి జాబితాలో నామధేయం నమోదు చేయించుకున్నా, అది ఎన్నాళ్లు కొనసాగుతుందో అంతుచిక్కని అయోమయంలో చింతాక్రాంతులయ్యే బాధితుల సంఖ్య పెద్దదే. ‘ఓటు వేయడం వయోజనుల బాధ్యత’ అంటూ జన చేతన కార్యక్రమాల్లో పాల్గొన్న కొంతమంది ప్రముఖుల పేర్లూ లిస్టులోంచి గల్లంతైన ఉదంతాలు సైతం ఎన్నో విన్నాం. తమ నాయకులకు అనుచిత లబ్ధి ఒరగబెట్టడానికి దొంగ ఓట్లు చేర్పించే మాయగాళ్లు కొందరు. ఫలానా పక్షానికి సానుభూతి పరులన్న అంచనాతో పేర్లు తీయించేసే మోసగాళ్లు ఇంకొందరు. పర్యవసానంగా, తమ ఓటుహక్కుకు దిక్కు లేకుండా పోయిందని ఆక్రోశించే పౌరుల సంఖ్య పెరుగుతుండటం- రాజ్యాంగబద్ధ విధుల నిర్వహణలో ఎన్నికల సంఘం దారుణ వైఫల్యానికి ప్రబల దృష్టాంతం.

అర్హత కలిగిన ప్రతి పౌరుడికీ ఓటుహక్కు కల్పించి అర్జెంటీనా వంటి దేశాలు సగర్వంగా శిరసెత్తుకుంటున్నాయి. అదే ఇక్కడ? దేశంలో అర్హులైన ఓటర్లందరికీ తమ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేదు. నాలుగేళ్ల క్రితం ‘ఏ ఒక్క ఓటర్నీ వదిలిపెట్టరా’దంటూ ఉద్యమించిన వారి అంచనా ప్రకారం- 12 కోట్ల మంది భారతీయుల పేర్లకు ఓటరు జాబితాల్లో చోటు దక్కలేదు. అందులో నాలుగు కోట్ల మంది దళితులు, మూడు కోట్ల మంది ముస్లిములు. యూపీ, మహారాష్ట్రల్లో ఈ తొలగింపు ధోరణులు ఆనవాయితీగా స్థిరపడ్డాయని కథనాలు వెలువడుతున్నా, మిన్నకుండిపోవడం ఎన్నికల సంఘం విలక్షణత! 1962 నాటితో పోలిస్తే దేశంలో ఓటర్ల సంఖ్య నాలుగింతలకు పైగా వృద్ధి చెందిందన్న ఈసీ వీరాలాపాలకు అవతలి వైపున చీకటి పార్శ్వం విస్మరించలేనిది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ 67.1శాతానికే పరిమితమైంది. దాన్ని 75శాతానికి పెంపొందించాలని సంకల్పం చెప్పుకొంటున్న ఈసీ లెక్కల ప్రకారమే- పట్టణ ప్రాంతవాసులు, యువ ఓటర్లు, వలస కార్మికుల రూపేణా సుమారు 30 కోట్ల మంది ఎన్నికల క్రతువుకు దూరంగా ఉండిపోతున్నారు. వారిని చైతన్యపరచే బాధ్యతనూ ఎలెక్షన్‌ కమిషన్‌ అందిపుచ్చుకోవాలి.
దేశంలో వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2024 డిసెంబరులోగా ఏపీ, తెలంగాణలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, రాజస్థాన్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ శాసన సభలకూ ఎలెక్షన్లు నిర్వహించనున్నారు. అప్పటికైనా ఓటరు జాబితాలు పకడ్బందీగా రూపొందించకపోతే- ఎన్నికల ప్రక్రియే హాస్యాస్పదమవుతుంది. ఓటి జాబితాల చెడుగుడు ప్రజాస్వామ్య వ్యవస్థనే నవ్వులపాలు చేస్తుంది!

బాలు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి