మనుషులంతే!

‘హాయ్‌ 2కే బ్రో... ఏమిటి సంగతులు... నీకూ అర్ధాయుష్షుతో కాలం తీరిపోయినట్లుందే?’‘అంతే 1కే బ్రో... అప్పట్లో రంగులుహంగులు, తళతళలతో పెళపెళలాడుతూ బయటికొచ్చినప్పుడు అంతా ఎగబడి హత్తుకున్నారా! సంబరపడినంత సమయం పట్టలేదు ఆయువు తీరిపోవడానికి, అప్పుడే వెంటిలేటర్‌ పెట్టేశారు.’  

Published : 29 May 2023 00:35 IST

‘హాయ్‌ 2కే బ్రో... ఏమిటి సంగతులు... నీకూ అర్ధాయుష్షుతో కాలం తీరిపోయినట్లుందే?’

‘అంతే 1కే బ్రో... అప్పట్లో రంగులుహంగులు, తళతళలతో పెళపెళలాడుతూ బయటికొచ్చినప్పుడు అంతా ఎగబడి హత్తుకున్నారా! సంబరపడినంత సమయం పట్టలేదు ఆయువు తీరిపోవడానికి, అప్పుడే వెంటిలేటర్‌ పెట్టేశారు.’  
‘అప్పట్లో రద్దు ఖాతాలోకి చేరిపోయిన మమ్మల్ని ఎంత హీనంగా చూశావు, కొత్త మురిపెంలో ఎంత టెక్కు ఒలకబోశావ్‌... నీ బతుకూ అక్కడికే వచ్చిందిగా! డిపాజిట్‌ దక్కని నేతలా డీలా పడిపోయావు?’

‘అసలే చెత్తకుప్పకు చేరువై, విలువ చచ్చి, కీర్తికిరీటాలు పడిపోయి, రాజ్యంలేని రాజులా ధగధగలన్నీ ఆరిపోయి, బికారినయ్యాను. పంక్చర్లకూ పనికిరాకుండా పోయిన నా పరువును పనిగట్టుకుని మరీ తీయవద్దు! అయినా ఈ మనుషులేమిటి బ్రో... కరెన్సీ నోట్లనగానే ప్రాణం పోసుకుంటారు. మనకోసం తిట్టుకుంటారు, తన్నుకుంటారు, చంపుకొంటారు. అందరికీ దూరమవుతారు. ఎవరెవరికో దగ్గరవుతారు. మనచుట్టే తిరుగుతారు. మనతోటిదే ప్రపంచమంటారు. అరక్షణమైనా విడిచి ఉండలేమంటారు. మనల్ని కీర్తిస్తూ పద్యాలు, కీర్తనలు, శ్లోకాలు రాసుకొంటారు. మనపై నవలలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అవన్నీ మరచి పుసుక్కున పీక పిసికేశారేమిటిలా!’ 

‘ఈ మనుషులంతే బ్రో! స్వార్థప్రాణులు. అవసరం ఉన్నంతసేపు దేవుడివిరా అంటారు, అక్కర తీరగానే ఎవడివిరా అని ఎగిరి తంతారు. తక్కువ వయసుకే ఇంతలా బాధపడితే, తరతరాలుగా వీళ్ల చేతుల్లో నలిగి, నడ్డివిరగ్గొట్టుకున్న వాళ్లం మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?’

‘అదీ నిజమేలే! తాతల నుంచి మునిమనవల కాలందాకా అన్ని తరాలను చూసి, అందరినీ సేవించి, అనుకోకుండా అర్ధరాత్రి ఆయువు తీరి, కాలగతిలో కలిసి పోయారు. వీళ్లేమిటో, వీళ్లలెక్కేమిటో అర్థమేకావడంలేదు బ్రో... లక్ష్మీ నమస్తుభ్యం, లక్ష్మీ కటాక్షం అంటూ పూజలు చేస్తారు. దండలుగా గుచ్చి దేవుళ్లకు వేస్తారు. కళాకారులపై నోట్లు వెదజల్లుతారు. డ్యాన్సాడితే నోటినిండా నోట్లు కుక్కుతారు. శవాలపై చిల్లర విసురుతారు. సుఖంలోదుఃఖంలో డబ్బులనే వాడుకుంటూనే, నిర్దాక్షిణ్యంగా నలిపి పారేస్తున్నారు బ్రో!’

‘అంతేనా, నోట్లేమైనా చెట్లకు కాస్తున్నాయా అంటూ బుద్ధిచెబుతారు. డబ్బులు ఊరకే రావంటారు. పైసావసూలంటారు. ప్రతి మాటలో మనల్నే తలచుకుంటారు. ఎన్నో ఏళ్లుగా కష్టాల్లోబాధల్లో ఆనందాల్లో సంతోషాల్లో సగభాగమై ఉంటూ వచ్చిన మన బతుకుల్ని చిరిగిన అరిటాకులా చేసేశారే.’

‘అవును బ్రో! మనుషులింతే! అవసరం ఉన్నంత వరకే వాడుకొంటారు. అక్కరకు రాదంటే వజ్రాన్నయినా రాయిలా విసిరేస్తారు. కరెన్సీ నోటయినా కాగితం పడవకన్నా హీనంగా మారాల్సిందే.’

‘నిజమే, ఏళ్లకొద్దీ ఇనప్పెట్టెల్లో, భోషాణాల్లో, బీరువాల్లో, ట్రంకు పెట్టెల్లో, గోడల్లో, నేలమాళిగల్లో, ఇనప్పెట్టెల్లో, చూరుల్లో భద్రంగా దాచుకుని, సొంత పిల్లలకన్నా జాగ్రత్తగా చూసుకుంటూ, మురిసిపోతూ, గర్వపడుతూ, ధూపదీపాలతో కొలుస్తూ, దండాలు పెడుతుంటే... ఆహా మాదెంత భాగ్యం, మాదేమి జాతకం అనుకున్నా! ఒక్కసారి వద్దనుకున్నాక... వరసలు కట్టి, ప్రాణాలకు తెగించి మరీ వదిలించుకుంటారనుకోలేదు’

‘మనం లేనిదే పూట గడవదు. గొంతు తడవదు. ముద్ద దిగదు. నాలుగు మెతుకులు చేతికందవు. అత్యంత అపురూపంగా చేతుల్లోకి తీసుకుని, దండం పెట్టుకొని గుండెలకు హత్తుకొనేలా జేబులో పెట్టుకొంటారే. పొరపాటున కిందపడితే ప్రాణం పోయినంతగా విలవిలలాడుతూ కళ్లకద్దుకొంటారు. ఇంతచేసిన వారేనా ఇప్పుడసలు అక్కరే లేదన్నంత నిర్లక్ష్యంతో వదిలించుకోవడానికి తంటాలు పడుతున్నారనిపిస్తోంది!’

‘అవునుమరి, కట్టలపాములంటూ పోల్చినప్పుడు ఎందుకో అర్థం కాలేదు. ఇప్పుడు నిజంగా నోట్లకట్టల్ని చూసి కట్ల పాములన్నంతగా భయపడుతున్నారు. ఎవరూ చేరదీయడం లేదు. తోపుడు బండ్ల వ్యాపారులూ వద్దంటున్నారు. పెట్రోలు బంకుల్లో అక్కర్లేదంటూ మొహంమీద బోర్డులే పెడుతున్నారు. దుకాణాల వాళ్లయితే భయంతో కళ్లు తేలేస్తున్నారు. మర్యాదగా తీసుకోవాల్సిన బ్యాంకుల వాళ్లూ ఛీత్కరిస్తున్నారు. నోట్లవల్లే నానా తంటాలూ పడాల్సి వస్తోందంటూ జనం తిట్టుకుంటున్నారు. ఛీ ఛీ... వెధవ బతుకు...  ఎవరూ పట్టించుకోని ఇలాంటి బతుకు ఉంటే ఎంత లేకుంటే ఎంత? ఎవరికీ అక్కర్లేని అంకెలున్న రంగులకాగితంలా బిచ్చగాళ్లకూ పనికిరాని బిచ్చపు బతుకుకన్నా హీనం ఏముంటుంది?’

‘మరీ, ఎవరికీ పనికిరాకుండా పోతున్నామని బాధపడొద్దు. బ్రోకర్లు, దళారులు, దొంగ వ్యాపారులు, అక్రమ మార్పిడిగాళ్లు, నల్లధనరాయుళ్లు ఇప్పటికీ కళ్లకద్దుకుంటున్నారు’

‘ఇంత కష్టకాలంలోనూ మనల్ని చేరదీసే వాళ్లున్నారన్నమాట!’

‘అలాంటి జీరోదందాగాళ్లని నేరుగా పట్టుకోలేకే, మన నెత్తిన రద్దు ముద్రలు పడుతున్నాయి’ 

‘అక్రమార్కుల కోసం మనల్ని ముంచేబదులు... మనల్ని తయారు చేసేటప్పుడే ఏవో సెన్సర్లు, చిప్‌లు లోపల పెడితే సరిపోతుంది. పొగపెట్టగానే కలుగుల్లో నుంచి కట్లపాములు బయటికొచ్చినట్లు... పాతాళంలో దాచినవీ పైకితేలతాయి. దొంగనోట్లు, నకిలీ నోట్లు, అక్రమ నోట్లు, ఆదాయానికి మించిన నోట్లు... అవీఇవీ అన్నీ, కట్టలు కట్టలుగా బజారునపడతాయి!’

 శ్రీనివాస్‌ దరెగోని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి