అసంబద్ధ విధానాలతో వ్యర్థాల మేట
దేశంలోని నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారయింది. ఫలితంగా చెత్త కొండలు పేరుకుపోతు న్నాయి. అశాస్త్రీయ, అసంబద్ధ విధానాలతో చెత్త గుట్టలు పోనుపోను మరింతగా పెరిగిపోతున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2019-20 వార్షిక నివేదిక ప్రకారం...
దేశంలోని నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారయింది. ఫలితంగా చెత్త కొండలు పేరుకుపోతు న్నాయి. అశాస్త్రీయ, అసంబద్ధ విధానాలతో చెత్త గుట్టలు పోనుపోను మరింతగా పెరిగిపోతున్నాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2019-20 వార్షిక నివేదిక ప్రకారం భారత్‌లో రోజుకు సుమారు 1.5 లక్షల టన్నుల మున్సిపల్ ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో 47శాతమే శుద్ధికి నోచుకుంటున్నాయి. 27శాతాన్ని భూమిలో కప్పెడుతున్నారు. మిగతా 26శాతం దారి తప్పుతోందని పరిశీలనలు చెబుతున్నాయి. చెత్త సేకరణ, తడి, పొడి చెత్తను వేరుచేయడంలో లోపాల వల్ల; తగిన ప్రణాళికలు, దూరదృష్టి కొరవడి- పట్టణ ప్రాంత డంపింగ్ యార్డుల్లో వ్యర్థాల సమర్థ నిర్వహణ భారంగా మారుతోంది. పాత డంపింగ్ యార్డుల్లోనే, ప్రస్తుతం వెలువడే చెత్తనూ వేస్తున్నారు. దాంతో సమస్య మరింత జటిలమవుతోంది. డంపింగ్ యార్డులు అత్యంత విషపూరితమైన ద్రవాలను విడుదల చేస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు, ఉపరితల నీటి వనరులు కలుషితం అవుతున్నాయి.
వ్యర్థాల భారీ మేటతో ముంబయిలోని దేవ్‌నార్ డంపింగ్ యార్డు సుమారు 18 అంతస్తుల భవంతి అంత ఎత్తుతో దేశంలోనే అగ్రస్థానాన నిలిచింది. దిల్లీలోని భల్స్వా, ఘాజీపుర్, నరేలా తదితర డంపింగ్ యార్డులు చెత్త కొండల్లా తయారయ్యాయి. బెంగళూరులోని బింగిపుర, లక్ష్మీపుర, కోల్‌కతాలోని ధాపా, గార్డెన్ రీచ్ డంపింగ్ యార్డుల పరిస్థితీ ఇలాగే ఉంది. డంపింగ్ యార్డుల్లోని వ్యర్థాల నుంచి ప్రమాదకర వాయువులు విడుదలై, ఏటా వేసవిలో వాటిలో మంటలు చెలరేగడం సర్వసాధారణంగా మారుతోంది. గురుగ్రామ్‌లోని బాంధ్వారీ డంపింగ్ యార్డు వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని పరిశీలనలు చెబుతున్నాయి. చెత్తతో నిండిన డంపింగ్ యార్డులు పట్టణ ప్రాంతాల్లో స్థిరాస్తి, వినోద, పర్యాటక కార్యకలాపాల పురోగతికి అవరోధంగా నిలుస్తున్నాయి. మేటవేసిన చెత్తకుప్పల వల్ల స్థానికంగా ఉండే వృక్ష, జంతు జాలమూ నశిస్తోంది.
భారత్‌లో మూడు వేలకు పైగా డంపింగ్ యార్డులు ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నివేదిక వెల్లడించింది. వాటిలో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 611, మధ్యప్రదేశ్‌లో 328, మహారాష్ట్రలో 327 ఉన్నాయి. తెలంగాణలో 123, ఆంధ్రప్రదేశ్‌లో 110 నెలకొన్నాయి. దేశంలో డంపింగ్ యార్డుల వల్ల గాలి, నీరు కలుషితమై, దీర్ఘకాలిక పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఆ మేరకు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్2.0లో భాగంగా వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అన్ని నగరాల్లోని డంపింగ్ యార్డుల్లో పోగుపడిన చెత్త దిబ్బలను శుద్ధి చేయాలని నిర్దేశించారు. దానికి సంబంధించిన పనులు ఆశించిన మేర సాగడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశీయంగా 268 డంపింగ్ యార్డుల్లో దాదాపు 375 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించామని ఇటీవల కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ఆ పనులు మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉంది.
పట్టణాల్లోని భారీ చెత్త గుట్టలను తొలగించడానికి ప్రభుత్వాలు సమర్థ వ్యూహాన్ని రూపొందించి, పట్టాలకు ఎక్కించాలి. బయోమైనింగ్ లాంటి పద్ధతుల ద్వారా వాటిని కరిగించవచ్చని అధ్యయనాలు చాటుతున్నాయి. సాధారణంగా నిత్యం ఉత్పత్తి అయ్యే వ్యర్థాల్లో సింహభాగం తడి చెత్తే ఉంటుంది. తడి, పొడి చెత్తను రెండింటినీ కలపడం వల్ల వ్యర్థాల నిర్వహణ సమస్యగా మారుతోంది. పట్టణ ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించేలా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. పట్టణ స్థానిక సంస్థల సిబ్బంది సైతం వాటిని విడివిడిగా సేకరించాలి. ఇంటి వద్దనే తడి చెత్తతో ఎరువు తయారు చేసుకోవడంపై ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ ఎరువు మిద్దె తోటల పెంపకానికి ఉపయోగపడుతుంది. ఆధునిక సాంకేతికత సాయంతో కాలనీల్లో, వీధుల్లో ప్రజలు చెత్తను పడవేయకుండా నిరోధించడమూ తప్పనిసరి. అవసరమైతే అందులో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు వంటివాటికి వ్యర్థాల నిర్వహణలో భాగస్వామ్యం కల్పించాలి. చెత్త సమర్థ నిర్వహణలో భాగంగా సరికొత్త వ్యాపార నమూనాలను రూపొందించి, ఉపాధి అవకాశాలను ఏర్పరచవచ్చు. పాలకులు ఈ దిశగా దృష్టి సారించాలి. వ్యర్థాలు భారీగా పోగుపడకుండా చూస్తూ, ఎక్కడికక్కడ వాటిని నిర్మూలించడమే ప్రభుత్వాల లక్ష్యం కావాలి. ప్రజల భాగస్వామ్యమూ అందుకు జతపడాలి.
ఎ.శ్యామ్ కుమార్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: చంద్రబాబుకు బాసటగా.. కొత్తగూడెంలో కదం తొక్కిన అభిమానులు
-
Swiggy: యూజర్ల నుంచి స్విగ్గీ చిల్లర కొట్టేస్తోందా? కంపెనీ వివరణ ఇదే..!
-
Salman khan: రూ.100కోట్ల వసూళ్లంటే చాలా తక్కువ: సల్మాన్ ఖాన్
-
Apply Now: ఇంటర్‌తో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
-
Hyundai i20 N Line: హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్.. ధర, ఫీచర్ల వివరాలివే!
-
Tecno Phantom V Flip 5G: టెక్నో నుంచి రూ.50 వేల ఫ్లిప్ ఫోన్.. ఫీచర్లివే..!