సంక్షోభ నివారణకు సన్నద్ధతే కీలకం
ఈ ఏడాది ఎల్‌నినో సంభవించడం వల్ల తలెత్తే సమస్యలను అధిగమించడానికి పలు దేశాలు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా తృణధాన్యాలు ప్రధాన ఆహారంగా ఉన్న దేశాలు వాటి నిల్వలను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. విదేశాల నుంచి అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి.
ఈ ఏడాది ఎల్‌నినో సంభవించడం వల్ల తలెత్తే సమస్యలను అధిగమించడానికి పలు దేశాలు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా తృణధాన్యాలు ప్రధాన ఆహారంగా ఉన్న దేశాలు వాటి నిల్వలను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. విదేశాల నుంచి అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. మనదేశంలోనూ ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావచ్చనే అంచనాల నేపథ్యంలో, వివిధ దేశాలు ముందస్తు చర్యలు ప్రారంభించాయి. ఆహార ధాన్యాల నిల్వలపై దృష్టిసారించాయి. ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, మలేసియా దేశాలు బియ్యం దిగుమతులను పెంచుతున్నాయి. దీనివల్ల బియ్యం ధరలు పెరుగుతున్నాయని భారత బియ్యం ఎగుమతుల సంఘం (టీఆర్‌ఈఏ) అధ్యక్షుడు బీవీ కృష్ణారావు వెల్లడించారు. ప్రభుత్వం మద్దతు ఇస్తే గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా ఈ ఏడాదీ అదే పరిమాణంలో బియ్యాన్ని ఎగుమతి చేయవచ్చని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. 2007-08లో అధిక ధరల వల్ల ఏర్పడ్డ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలుదేశాలు ఆహార ధాన్యాల నిల్వలను పెంచుకుంటున్నాయి. అదే సంవత్సరం మనదేశం బియ్యం ఎగుమతులను నిషేధించింది. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ధరలు అమాంతం పెరిగాయి. ఇది సంక్షోభానికి దారితీసిందని, పేదలకు హాని కలిగించిందనిప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) వెల్లడించింది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసేందుకు పలు దేశాలు ముందస్తు చర్యలు ప్రారంభించాయి.
ఎగుమతుల్లో పెరుగుదల
ఎల్‌నినో ప్రభావం ముఖ్యంగా మొక్కజొన్న, వరి, సోయాచిక్కుడు పంటలపై చూపుతుందని ఎఫ్‌ఏఓ వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమయ్యే రుతుపవనాల సీజన్ రెండో భాగంలో ఎల్‌నినో ఏర్పడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఆసియాలో కరవు, అమెరికాలో వరదలకు కారణమయ్యే ఎల్‌నినో వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఎగుమతుల్లో మూడుశాతం పెరుగుదల చోటుచేసుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడం వల్ల కూడా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాది గోధుమ సేకరణ లక్ష్యాన్ని చేరకపోవడంతో దేశంలో మొత్తం ఆహార ధాన్యాల నిల్వలు అయిదేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. గోధుమ ఉత్పత్తి తగ్గడంతో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు అదనంగా బియ్యాన్ని మళ్ళించాల్సి వచ్చింది. గత ఖరీఫ్, రబీ సీజన్లలో రికార్డు స్థాయిలో మనదేశంలో బియ్యం ఉత్పత్తి జరిగింది. దీంతో ఎగుమతులు పెరిగాయి. మరోవైపు దేశంలో ఉప్పుడు బియ్యం ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. ప్రభుత్వం వాటిని సేకరించకపోవడంతో ధరలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఎల్‌నినో అనేది సహజసిద్ధంగా ఏర్పడే ప్రక్రియ. తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే అధికంగా నమోదయ్యేందుకు కారణమవుతుంది. ఇది కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం, మరికొన్ని చోట్ల కరవు పరిస్థితులకు దారితీస్తుంది. ఎల్‌నినో సగటున రెండు నుంచి ఏడు సంవత్సరాలకు సంభవిస్తుంది. భారత వాతావరణ శాఖ దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఎల్‌నినో ప్రభావం రుతుపవనాలపై ఎలా ఉంటుందనేది సీజన్ ద్వితీయార్ధంలో మాత్రమే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1951 నుంచి 2022 వరకు పదిసార్లు ఎల్‌నినో ఏర్పడగా ఆరుసార్లు సాధారణ వర్షపాతం, అంతకంటే ఎక్కువగా నమోదైందని స్పష్టం చేస్తున్నారు. 2009లో సంభవించిన ఎల్‌నిలో కారణంగా భారత్ కరవును ఎదుర్కొంది. ఇది ఆస్ట్రేలియాలో గోధుమ పంటను ధ్వంసం చేసింది. ఆసియా అంతటా పంటలు దెబ్బతిన్నాయి. ఆహార ధరలు పెరిగాయి.
ముందస్తు ప్రణాళికలు
బలమైన ఎల్‌నినో- వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుంది. దీని ప్రభావం రుతుపవన వర్షపాతం మీద అధికంగా ఉంటుంది. రుతుపవన వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. బియ్యం, మొక్కజొన్న, పామాయిల్ వంటి వస్తువుల సరఫరా గొలుసుకు ఆటంకం కలిగిస్తుంది. ఆసియా, పసిఫిక్‌లో కొన్నిచోట్ల ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగాయి. చివరిగా ఏర్పడిన ఎల్‌నినోతో ఆసియా పసిఫిక్‌లో నష్టాలు తలెత్తాయి. ఈ ఏడాది సైతం కొన్ని దేశాల్లో భారీ నష్టాల్ని కలిగించవచ్చని శాస్త్రవేత్తల అంచనా. భారత్‌కు రుతుపవనాలే కీలకం. సగం పంటభూములకు నీటిపారుదల లేదు. ప్రపంచ బియ్యం వ్యాపారంలో మనదేశం 40 శాతంపైగా వాటాను కలిగి ఉంది. 100కు పైగా దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఎల్‌నినో వల్ల వర్షపాతం తగ్గితే ఆ ప్రభావం వరిసాగుపై తీవ్రంగా పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డి.సతీష్‌బాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెదేపా
-
YouTube: క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్.. వీడియో ఎడిటింగ్‌కు ఫ్రీ యాప్
-
Agent: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Bigg Boss Telugu 7: ఈ ఎద్దుపై స్వారీ.. మూడో పవర్ అస్త్రను సాధించేది ఎవరు?
-
NDA: పొత్తు కుదిరింది.. ఎన్డీయేలో చేరిన జేడీఎస్