ఆరోగ్యాన్ని కమ్మేస్తున్న పొగ
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. ఎన్నో అనర్థాలకు, అనారోగ్యాలకు కారణమవుతున్న పొగాకును నిర్మూలించాలంటూ ప్రపంచ దేశాలన్నీ తీవ్రస్వరం వినిపిస్తున్నాయి.
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. ఎన్నో అనర్థాలకు, అనారోగ్యాలకు కారణమవుతున్న పొగాకును నిర్మూలించాలంటూ ప్రపంచ దేశాలన్నీ తీవ్రస్వరం వినిపిస్తున్నాయి. పొగాకు వాడకాన్ని నిషేధిస్తూ పాలకులు కఠిన చట్టాలు చేస్తున్నారు. అయినా వినియోగం తగ్గడం లేదు. పొగాకుపై పోరాటంలో అధికార యంత్రాంగాల్లో చిత్తశుద్ధి కొరవడటమే సమస్యగా మారుతోంది.
పొగాకు ఆరోగ్యానికి హానికరం. సిగరెట్, బీడీ, చుట్ట, పాన్‌మసాలా, ఖైనీ, ముక్కుపొడి, గుట్కా, తంబాకు... ఇలా ఏ రూపంలో వాడినా ముప్పు తప్పదు. తద్వారా వచ్చే వ్యాధుల బారి నుంచి కాపాడుకోవడానికి జీవితపర్యంతం కష్టపడి సంపాదించిన సొమ్ములో సగానికిపైగా ఖర్చు పెట్టాల్సిందే. పొగాకు వినియోగంతో మనదేశంలో గణనీయంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. పరోక్ష ధూమపానంతో లక్షల మంది వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని అరికట్టేందుకు ‘పొగాకు ఉత్పత్తుల ప్రకటనలు, వ్యాపార నియంత్రణ, పంపిణీ నిషేధ చట్టం, 2003’ను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం పొగాకు ఉత్పత్తులకు సంబంధించి బహిరంగ ప్రకటనలు నిషేధం. ఉత్పత్తి, పంపిణీ మొదలైనవన్నీ కొన్ని పరిమితులకు, నిబంధనలకు లోబడే ఉండాలి. ఈ చట్టంలోని సెక్షన్-4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగమూ నిషేధం. అయినా, ఈ చట్టం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, మరింత పకడ్బందీగా అమలు చేసే ఉద్దేశంతో 2020లో పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ, రకరకాల కారణాలతో ఆ బిల్లు ఇంకా చట్టంగా రూపొందలేదు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే- పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు, ప్రచారాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాతోపాటు జైలుశిక్ష పడుతుంది.
పంటకు ప్రోత్సాహం
పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను తగ్గించే విషయంలో ప్రస్తుత నిబంధనలు ప్రభావం చూపడం లేదు. రోజురోజుకీ పెరుగుతున్న వినియోగానికి ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కొవిడ్ ప్రభావిత కాలంలో మాత్రమే కొంతమేర అమ్మకాలు తగ్గాయి. కొవిడ్ వ్యాధిపట్ల భయం, సరకు అందుబాటులో లేకపోవడం, నల్లబజారు కారణంగా ధరలు ఆకాశాన్ని అందుకోవడంతో అమ్మకాలు, వినియోగం కొంతమేర తగ్గాయి. ప్రభుత్వపరంగా ఒకపక్క పొగాకు వినియోగాన్ని నిషేధించేందుకు చట్టాలు చేస్తున్నారు. మరోవైపు పొగాకు పంటకు రుణాలు, రాయితీలు కొనసాగిస్తూ రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. దిగుబడుల్ని పెంచేందుకు ఈ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడం విచారకరం. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో స్థాపించిన కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ద్వారా పంట వృద్ధికి, సంరక్షణకు అవసరమైన అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థ ద్వారా పొగాకు రైతులకు అవసరమైన సలహాలు, శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నారు. మరోవైపు, పొగాకు పండించే రైతులు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంటకువాడే ఎరువులు, క్రిమిసంహారక మందులవల్ల కర్షకులు తీవ్ర అనారోగ్యంపాలై పంటచేతికి వచ్చేలోపే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పైగా ఆరుగాలం చెమటోడ్చి పండించే రైతులకు దక్కుతున్నదీ అంతంతమాత్రమే. అన్ని పంటల్లాగే మధ్యవర్తులు, దళారులే లాభాలను దండుకుపోతున్నారు. చివరికి రైతుకు పొగాకు సాగు దండగమాలిన వ్యవహారంలా మారుతోంది.
పొగాకు వినియోగాన్ని పూర్తిస్థాయిలో తగ్గించాలంటే ప్రభుత్వ యంత్రాంగాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. కేవలం ప్రచార కార్యక్రమాలతోనే చేతులు దులుపుకోకుండా, చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉత్పత్తులను అమ్మే వ్యాపారులు, వినియోగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. ప్రజల ఆరోగ్యానికి కలిగించే నష్టాన్ని, తద్వారా దేశ ఆర్థికరంగంపై పడే ప్రభావాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధించడంతో సరిపెట్టకుండా, ముందుగా పంట సాగును, ఉత్పత్తుల తయారీనీ నిలువరించాలి. పొగాకు పంటను నమ్ముకొని బతుకుతున్న రైతులు, రైతుకూలీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. ఒకపక్క మద్యం అమ్మకాల్ని కొనసాగిస్తూ, మరోపక్క పొగాకు నిర్మూలనకు యత్నించడం ఫలితాల్ని ఇవ్వదు. పొగాకు వ్యతిరేక దినానికి సంబంధించి ఈ ఏడాది థీమ్ ‘ఆహారాన్ని పండించాలి, పొగాకును కాదు’ అనే అంశానికి తగిన ప్రాధాన్యం కల్పిస్తూ, రైతులు ఇతర ఆహార పంటలు పండించేలా ప్రోత్సహించాలి. ఫలితంగా దేశ ఆహార భద్రత ఇనుమడిస్తుంది.
చిత్తశుద్ధి అవసరం
చట్టాలను అమలుచేసే ప్రభుత్వ యంత్రాంగాల్లో చిత్తశుద్ధి కొరవడితే- పొగాకు నిషేధంపై ఎన్ని సమావేశాలు, సదస్సులు నిర్వహించినా, ప్రచారోద్యమాలు చేపట్టినా ప్రయోజనం ఉండదు. ఏటా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాలు నిర్వహిస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనపడకపోవడమే ఇందుకు నిదర్శనం. పొగాకుపై సమరంలో ప్రజాభాగస్వామ్యమూ అవసరం. ప్రభుత్వ చర్యలకు అన్ని వర్గాల నుంచి అవసరమైన మద్దతు కొరవడటమూ ఆశించిన ఫలితాలు కనిపించకపోవడానికి కారణమవుతోంది.18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు దక్కనీయకూడదు. రాష్ట్ర, జిల్లా స్థాయి, స్థానిక అధికారులు నిబంధనల్ని పకడ్బందీగా అమలు చేయాలి. స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందించాలి. యువత పొగాకు ఉత్పత్తుల వైపు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమవంతు కృషి చేస్తే మెరుగైన ఫలితాలు సిద్ధిస్తాయి.
డాక్టర్ వి.ఆర్.ప్రసాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ