రూపాయి అంతర్జాతీయీకరణ
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. చాలా దేశాలు అమెరికా డాలరు ఆధిపత్యం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సొంత కరెన్సీలో చేసుకునేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రూపాయినీ బలపరచేందుకు భారత్ కృషి చేస్తోంది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. చాలా దేశాలు అమెరికా డాలరు ఆధిపత్యం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సొంత కరెన్సీలో చేసుకునేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రూపాయినీ బలపరచేందుకు భారత్ కృషి చేస్తోంది.
భారత్ నేడు రష్యా సహా పద్దెనిమిది దేశాలతో విదేశీ వాణిజ్యాన్ని రూపాయల్లో జరిపే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందుకోసం ఆయా దేశాల బ్యాంకులు ప్రత్యేకంగా ఓస్ట్రో ఖాతాలను తెరవాలి. రష్యా నుంచి భారత్ ప్రస్తుతం చౌక ధరలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. డాలర్ అవసరం లేకుండా రష్యాతో రూపాయల్లో లావాదేవీలు జరుపుతోంది. ఎరువులు, మిలిటరీ హార్డ్‌వేర్‌ను సైతం ఇండియా అధికంగా రష్యా నుంచే దిగుమతి చేసుకొంటోంది. ఈ క్రమంలో ఇరు దేశాల్లో దేనికైనా రూపాయల్లో వాణిజ్య మిగులు నమోదైతే దాన్ని ఆయా దేశాల్లో భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ ట్రెజరీ బిల్లుల్లో పెట్టుబడులు వంటివాటికి మరల్చవచ్చు. ఇరు దేశాల కరెన్సీల మధ్య మారకపు రేటును మార్కెట్ నిర్ణయిస్తుంది.
వాణిజ్య లోటు
రూపాయల్లో విదేశీ వాణిజ్యం ఆలోచనను 2013లోనే అప్పటి రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ తెరపైకి తెచ్చారు. 2021లో ఆర్‌బీఐ నివేదిక సైతం రూపాయల్లో విదేశీ వాణిజ్యం అవసరమని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల ఇరువైపులా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా విదేశీ మారక కరెన్సీ విలువ పెరగడం మూలంగా ఎదురయ్యే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. డాలరు ప్రమేయం లేకుండా రూపాయల్లోనే వాణిజ్యం జరపవచ్చు. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాల మూలంగా డాలరు బలపడింది. దాంతో కొన్ని దేశాల కరెన్సీలతో పాటు భారత్ రూపాయి సైతం బలహీనపడింది. రూపాయల్లో అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా డాలరు నిల్వలను పోగేసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించుకోవచ్చు. ఇది రూపాయినీ బలోపేతం చేస్తుంది. ఎగుమతి, దిగుమతిదారుల లావాదేవీల వ్యయాన్ని సైతం తగ్గిస్తుంది. అయితే, ఈ విధానంలో కొన్ని లోపాలూ ఉన్నాయి. నిజానికి, రష్యాతో రూపాయల్లో వాణిజ్య ప్రక్రియ ప్రారంభమై ఏడాది కావస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో అది ఒక కొలిక్కి రాలేదు. రష్యాతో భారత వాణిజ్యం ఆది నుంచీ లోటులోనే కొనసాగుతోంది. ఒక దేశానికి ఎగుమతుల కన్నా, దిగుమతులు అధికంగా ఉన్న స్థితిని వాణిజ్య లోటు అంటారు. రష్యా నుంచి భారత్ దిగుమతులే అధికం. ఈ క్రమంలో భారీ స్థాయిలో పోగైన రూపాయి నిల్వలు రష్యాకు ఒక సమస్యగా మారాయి. పైగా రూపాయల్లో విదేశీ వాణిజ్యం- స్వదేశీ నగదు సరఫరాను నియంత్రించే విషయంలో ఆర్‌బీఐ స్వతంత్రతను పరిమితం చేస్తుంది. ఆ ప్రభావం వడ్డీ రేట్లపై పడుతుంది. ప్రస్తుతం చైనా ఒక్కటే ఎలాంటి అడ్డంకులు లేకుండా కరెంటు ఖాతాను నియంత్రిస్తూ, తన కరెన్సీ అయిన యువాన్ అంతర్జాతీయీకరణతో విశ్వ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించ గలుగుతోంది. చాలా దేశాలతో వర్తకంలో డ్రాగన్ దేశానికి వాణిజ్య మిగులు ఉండటమే దీనికి కారణం. చైనాకు భారీ స్థాయిలో సొంత విదేశ మారక నిల్వలు ఉండటమూ కలిసి వచ్చే అంశం. భారత్‌లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇండియా విదేశీ వాణిజ్యం ఎప్పుడూ లోటులోనే కొనసాగుతోంది. భారత్ సైతం చైనా తరహాలో ఎదగాలి. అప్పుడే రూపాయి అంతర్జాతీయీకరణ విజయవంతమవుతుంది.
పలు దేశాల ఆసక్తి
ప్రస్తుతం రూపాయల్లో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న 18 దేశాలతో నమోదైన మొత్తం విదేశీ వాణిజ్య లోటు 5,200 కోట్ల డాలర్లు. 18 దేశాల్లో రష్యా, సింగపుర్, జర్మనీ, మలేసియా, ఒమన్, బోట్స్‌వానా, మయన్మార్‌లతో భారత్‌కు వాణిజ్య లోటు నమోదైంది. ఇక మీదటా ఈ ఏడు దేశాలతో ఆ లోటు కొనసాగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వేదికపై ఇండియా ప్రభావం నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక దేశాలతో భారత్ రూపాయల్లోనే వాణిజ్యాన్ని నెరపుతోంది. ప్రస్తుతం భారత కరెన్సీ అంతర్జాతీయ స్థాయిని అందుకొనేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. 64 దేశాలు రూపాయల్లో వాణిజ్యం గురించి భారత్‌తో చర్చలు జరుపుతున్నాయి. కనీసం 30 దేశాలతో ఇండియా వ్యాపారం రూపాయల్లో ప్రారంభమైతే మన కరెన్సీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతుంది. డాలరు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈజిప్టు, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు, ఆంక్షలు ఎదుర్కొంటున్న మరికొన్ని దేశాలు రూపాయల్లో వాణిజ్యంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. భారత్‌కు వాణిజ్య మిగులు ఉన్న దేశాలతో రూపాయల్లో వర్తకం విజయవంతం అవుతుంది. వాటిపట్ల ఇండియా అధిక దృష్టి సారించాలి. దేశీయంగా తయారీని మరింత జోరెత్తించి, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా వాణిజ్య లోటును భారత్ తగ్గించుకోవచ్చు. అంతర్జాతీయంగా రూపాయి బలోపేతం కావడానికి ఇది తోడ్పడుతుంది.
ఆచార్య బి.ఆర్.కె.రావు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి