భారత పుత్రికలపై ఇదేనా ప్రేమ?
‘జనం ఏమనుకున్నా ఫర్వాలేదు... నేనొక హత్యచేశాను’ అని అదురూబెదురూ లేకుండా మీడియా కెమెరా ముందే ఒప్పుకొన్న ఘనుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్. చట్టం చెవులు కళ్లు నోరు అన్నీ మూసుకుందేమో- అతని మీద ఇంతవరకు ఈగ కూడా వాల్లేదు. సరికదా, నేరచరిత నేతలకు పొర్లుదండాలు పెట్టే మన అతిగొప్ప ప్రజాస్వామ్యంలో బ్రిజ్‌భూషణ్ చక్కగా పార్లమెంటు సభ్యుడు కాగలిగాడు.
‘జనం ఏమనుకున్నా ఫర్వాలేదు... నేనొక హత్యచేశాను’ అని అదురూబెదురూ లేకుండా మీడియా కెమెరా ముందే ఒప్పుకొన్న ఘనుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్. చట్టం చెవులు కళ్లు నోరు అన్నీ మూసుకుందేమో- అతని మీద ఇంతవరకు ఈగ కూడా వాల్లేదు. సరికదా, నేరచరిత నేతలకు పొర్లుదండాలు పెట్టే మన అతిగొప్ప ప్రజాస్వామ్యంలో బ్రిజ్‌భూషణ్ చక్కగా పార్లమెంటు సభ్యుడు కాగలిగాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు... ఆరోసారి ఎంపీగా, అధికారపక్షం భాజపా సభ్యుడిగా అతడిప్పుడు భారత ప్రజాస్వామ్య దేవాలయాన్ని పావనం చేస్తున్నాడు. అధికార మంత్రదండం చేతిలో పుచ్చుకొన్న పెద్దమనుషులేమో ఒకపక్క చిరునవ్వులు చిందిస్తుంటే- అంతర్జాతీయ పోటీల్లో దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన క్రీడాకారిణులు మరోవైపు రోడ్ల మీద గుండెలవిసేలా ఏడుస్తున్నారు. వికృత లైంగిక వేధింపులతో తమకు నిత్యం నరకం చవిచూపించిన బ్రిజ్‌భూషణ్ మీద చర్యలు తీసుకోవాలని వాళ్లు చేతులెత్తి మొక్కుతున్నారు. అయితేనేమి... ఎనుబోతు మీద వాన పడినట్లు వ్యవస్థ యావత్తూ అలా వేడుక చూస్తోంది. న్యాయం అడగడమే మహాపాపం అన్నట్లు, ఆ ఆడపిల్లలపై ఖాకీ జులుం ప్రదర్శిస్తోంది. మొద్దుబారి ముణగదీసుకొన్న మన రాజకీయ వ్యవస్థలో ఆలకించే నాథుడు లేక- ఆ అమ్మాయిల గోడు అంతా అరణ్యరోదనే అవుతోంది!
‘మా అమ్మాయి మానసిక ప్రశాంతతకు పూర్తిగా దూరమైంది... తాను మళ్ళీ మామూలు మనిషి కాలేదు... అతడి వేధింపులు ఆమెను వెంటాడుతున్నాయి’ అని బ్రిజ్‌భూషణ్‌పై దిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఓ మైనర్ క్రీడాకారిణి తండ్రి వాపోయారు. పొట్ట, నాభి, ఛాతీ భాగాల్లో చేతులు వేస్తూ, బట్టలు లాగుతూ, బలవంతంగా కౌగిలించుకుంటూ బ్రిజ్‌భూషణ్ పరమ ఘోరంగా ప్రవర్తించేవాడని మరో ఆరుగురు మహిళా రెజ్లర్లు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అసమాన క్రీడానైపుణ్యాలతో త్రివర్ణ పతాక గౌరవాన్ని పెంచిన ఛాంపియన్లకు దక్కే ప్రతిఫలం ఇదా? దేశం సిగ్గుపడాలి... భరతమాత ముద్దుబిడ్డలను కాల్చుకుతిన్న కీచకులకు ఇంకా రాచమర్యాదలు దక్కుతున్న తీరును చూసి జాతి యావత్తూ తలదించుకోవాలి. సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుంటే తప్ప ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కానంతగా నాయకస్వాములకు పాదపూజలు చేస్తున్న వ్యవస్థకు వారసులు కావడం- దేశవాసుల ప్రారబ్ధం కాక మరేమిటి? ఈ పుణ్యభూమిలో సామాన్య మానవుడై జీవించడం కన్నా హేయమైనది మరొకటి లేదని బాధితులు భావించడంలో తప్పేముంది?
ఏడేళ్ల నాడు రియో ఒలింపిక్స్‌లో సాక్షి మలిక్ కాంస్య పతకం సాధించినప్పుడు యావద్దేశం పొంగిపోయింది. ‘భారత పుత్రిక సాక్షి... మనమందరం గర్వపడేలా చేసింది’ అని ప్రధాని మోదీ సైతం అప్పట్లో ఆమెను ఆకాశానికి ఎత్తారు. ఆ సాక్షియే సహచర రెజ్లర్లతో కలిసి బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఉద్యమబాట పట్టింది. ‘మేం పతకాలు గెలిచినప్పుడు ఇంటికి పిలిచి ఎంతో గౌరవిస్తారు... ఇప్పుడు మా మనసులో మాటలను వినలేరా’ అని ప్రశ్నించింది. పట్టించుకున్న వారెవరు? వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సరిత మోర్ వంటి అగ్రశ్రేణి రెజ్లర్లు... వారికి మద్దతుగా బజరంగ్ పునియా వంటి మేటి క్రీడాకారులూ ఆందోళనల్లో భాగస్వాములయ్యారు. ‘ఈ దేశ ఆడబిడ్డలకు న్యాయం జరగాలని చేస్తున్న పోరాటమిది... భారత రెజ్లింగ్‌ను రక్షించేందుకు చేస్తున్న పోరాటమిది’ అని విస్పష్టంగా ప్రకటించిన వారు- తమకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ అధికారపక్షం ఎందుకు వారిపట్ల సహేతుకంగా స్పందించడం లేదు? రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని పట్టుకుని అలాగే వేలాడుతున్న స్వపక్ష ఎంపీ బ్రిజ్‌భూషణ్ గురించి ఎవరూ పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడటం లేదు? రెజ్లర్లకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. క్రీడలను దెబ్బతీసే, క్రీడాకారులను బాధపెట్టే పనులేమీ చేయొద్దని... విచారణ పూర్తయ్యేదాకా వేచి ఉండాలని ఆయన మల్లయోధులకు ఉచితసలహాలు దయచేస్తున్నారు. ఆటలో కొనసాగాలంటే తమ కోరిక తీర్చాల్సిందేనని అమ్మాయిలను వెంటాడి వేధించే అరాచక పెత్తందారుల రోతబుద్ధులే కదా క్రీడలను దెబ్బతీసేవి? తమ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ సాటి మహిళా క్రీడాకారిణులకోసం పోరాడుతున్నవారు నిజానికి దేశంలో సురక్షిత క్రీడావాతావరణాన్ని ఆకాంక్షిస్తున్నారు. వాళ్లకు దన్నుగా నిలబడటమంటే- ఉత్తిమాటలతో పొద్దుపుచ్చడమా? బ్రిజ్‌భూషణ్‌పై కేసు ఇంకా పరిశీలనలోనే ఉందని దిల్లీ పోలీసులు సెలవిస్తున్నారు. ఆ దశ దాటి విచారణ ఎప్పటికి పూర్తవుతుంది? న్యాయదేవత కళ్లకు గంతలు కడుతున్న వ్యవస్థ సర్వభ్రష్టత్వంపై విసిగిపోయిన రెజ్లర్లు- తమ పతకాలను గంగలో పారేయడానికి సిద్ధమయ్యారు. ఆ నిర్ణయం తీసుకోవడం వెనక వారెంతటి క్షోభను అనుభవించారో అర్థంచేసుకోని ప్రబుద్ధులెందరో సామాజిక మాధ్యమాల్లో పోగయ్యారు. క్రీడాకారిణుల వ్యక్తిత్వాలపై విషవ్యాఖ్యలు చేస్తూ... కృత్రిమమేధా ఉపకరణాలతో వాళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ వికృతానందం పొందుతున్నారు. తనపై ఆరోపణలు రుజువైతే ఉరేసుకుంటానని మేకపోతు గంభీర్యం ఒలకబోస్తున్న బ్రిజ్‌భూషణ్ అయితే- రెజ్లర్ల ఉద్యమాన్ని రాజకీయ ప్రేరేపితంగా కొట్టిపడేస్తున్నాడు. పతకాలు వెనక్కి ఇచ్చేస్తామన్న క్రీడాకారుల ఆవేదనాభరిత ప్రకటనను సైతం ఆ నాయకోత్తముడు చులకన చేశాడు. అమ్మితే పదిహేను రూపాయలొచ్చే పతకాలంటూ అలవిమాలిన అహంకారంతో మాట్లాడాడు. అంతగా అధికారమదం తలకెక్కిన నేతను భాజపా అధిష్ఠానం ఎందుకు సహిస్తోంది?
రామజన్మభూమి ఉద్యమంలోంచి నాయకుడిగా ఎదిగిన బ్రిజ్‌భూషణ్- ‘టాడా’ కేసులో కొద్దినెలలు తిహాడ్ జైలులో ఉన్నాడు. దావూద్ ఇబ్రహీం అనుచరులకు సాయంచేశాడన్న అభియోగాలపై అతడు కారాగారవాసం చేశాడు. 1974 నుంచి 2007 మధ్యలో బ్రిజ్‌భూషణ్‌పై 38 కేసులు నమోదయ్యాయి. దొంగతనం, అల్లర్లు, బెదిరింపులు, హత్యాయత్నం, అపహరణ తదితరాలకు పాల్పడినట్లుగా ఆ సమయంలో అతడిపై అభియోగాలు దాఖలయ్యాయి. ఆ కేసులన్నింటిలో తమ నాయకుడు నిర్దోషిగా తేలినట్లు బ్రిజ్‌భూషణ్ అనుచరగణం గొప్పగా చెప్పుకొంటూ ఉంటుంది. అంగ, ఆర్థిక బలసంపన్నుడైన బ్రిజ్‌భూషణ్- ఉత్తర్ ప్రదేశ్‌లో ‘బాహుబలి’ నేతగా, గూండాలకే గూండాగా పేరుమోశాడు. అతడిపై చర్యలు తీసుకుంటే, రాబోయే ఎన్నికల్లో కీలక రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని భాజపా అధిష్ఠానం భావిస్తున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అవే వాస్తవమైతే- అంతకు మించిన దురదృష్టకర రాజకీయాలు ఇంకేవీ ఉండవు. స్త్రీని దేవతా స్వరూపంగా భావించి పూజించే సంస్కృతి భారతదేశానిదని నాయకవర్యులు మహాద్భుతంగా ప్రవచిస్తుంటారు. స్వదేశీ సాంస్కృతిక ఔన్నత్య పరిరక్షణ కోసం పాటుపడుతున్నట్లుగా భాజపా వర్గాలూ తమకు తాము కితాబిచ్చుకుంటూ ఉంటాయి. అటువంటిది- దశాబ్ద కాలానికి పైబడి రెజ్లింగ్ సమాఖ్యను గుప్పిటపట్టి మహిళా క్రీడాకారిణులను నయానాభయానా లొంగదీసుకోవడానికి తెగబడ్డాడనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుణ్ని భాజపా ఉపేక్షిస్తుండటమే విస్మయకరం. దేశవ్యాప్తంగా ఆ పార్టీ దీంతో అంతులేని అప్రతిష్ఠను మూటగట్టుకొంటోందన్నది వాస్తవం!
శైలేష్ నిమ్మగడ్డ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
2 నిమిషాల్లోనే 50 మ్యాథ్స్ క్యూబ్‌లు చెప్పేస్తున్న బాలిక..
-
పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
-
స్ట్రాంగ్ రూమ్‌కు రంధ్రం.. నగల దుకాణంలో భారీ చోరీ..
-
YSRCP: బాలినేని X ఆమంచి
-
Iraq: పెళ్లి వేడుకలో విషాదం.. అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మృతి