రాజదండ రహస్యం!
‘ఏమిటీ సెంగోలు గోల! కొద్ది రోజులుగా అన్నివైపులా అదే నామజపం మార్మోగుతోంది?’‘మన దేశంలో వాతావరణానికి, చదువులకు, వ్యవసాయానికి, వ్యాపారాలకు, శుభకార్యాలకు సీజన్లు ఉన్నట్లే... రచ్చలకు, రాజకీయాలకూ ప్రత్యేక సీజన్లు ఉంటాయి’
‘ఏమిటీ సెంగోలు గోల! కొద్ది రోజులుగా అన్నివైపులా అదే నామజపం మార్మోగుతోంది?’
‘మన దేశంలో వాతావరణానికి, చదువులకు, వ్యవసాయానికి, వ్యాపారాలకు, శుభకార్యాలకు సీజన్లు ఉన్నట్లే... రచ్చలకు, రాజకీయాలకూ ప్రత్యేక సీజన్లు ఉంటాయి’
‘పంటల సీజన్లు, పెళ్లిళ్ల సీజన్లు, పండుగల సీజన్లు తెలుసుగాని, ఈ రాజకీయ సీజన్ల రచ్చేమిటి?’
‘రాజకీయాలకు ఆందోళనలే ఆయువుపట్టు. విమర్శలు, ఆరోపణలు, వాదోపవాదాలు, రచ్చలు, ఉద్యమాలు, గొడవలు పచ్చగా పరిఢవిల్లుతుండాలి. నిత్యం ఏదో ఒక అరాచకీయం వర్ధిల్లితేనే రాజకీయం శోభిల్లుతుంది’
‘సెంగోలు గొడవకు, సీజన్లకు సంబంధం ఏమిటి?’
‘రాజకీయ చక్రంలో ఎన్నికల సీజన్లు, బడ్జెట్ సీజన్లు, ఉద్యమాల సీజన్లు, ప్రారంభోత్సవాల సీజన్లు వరసగా వచ్చిపోతుంటాయి. పల్లెల్లో మొదలయ్యే పంచాయితీలు గ్రామపంచాయతీ మొదలు నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, అసెంబ్లీల్ని దాటుకొని పార్లమెంటుదాకా పాకుతాయి. మంత్రిగారి కార్యక్రమానికి సర్పంచుగారిని పిలవలేదనే అలకాస్త్రాలు, అధికార పార్టీ నేతల్ని మాత్రమే పిలిచారనే కినుకాస్త్రాలు, విపక్ష నేతకు ప్రొటోకాల్ మరిచారనే ఆక్షేపణాస్త్రాలు... ఇవన్నీ యాగీరాజకీయాల్లో నిత్యాస్త్రాలు. గల్లీల్లో నల్లానీళ్ళ దగ్గర మొదలుపెడితే, పార్లమెంటు నడిమధ్యలో రచ్చలదాకా అన్నీ ప్రజాస్వామిక స్వాభావిక సహజ సజీవ విశేషణాలుగా గుర్తించాలి’
‘రాజకీయాల్లో రచ్చోత్సవం నిత్యకృత్యం అన్నమాట!’
‘అంతేమరి, డ్రైనేజీ అన్నాక కంపు కామన్ ఎలాగో రాజకీయాలంటేనే ఇచ్చరచ్చగా మురుగెత్తిపోసుకునే రచ్చక్రీడలన్న సంగతి గ్రహించాలి’
‘ప్రజాస్వామ్యమంటేనే జనం పెత్తనం కదా, కొత్తగా రాజదండం చేసే కర్రపెత్తనం ఎందుకు?’
‘నేతలు పొద్దున లేస్తే ప్రజాస్వామ్యాన్నే పలవరిస్తూ, జనానికి వంగిదండాలు పెట్టినా, ఆ వెనకే అడుగడుగునా అంతులేని అధికార దర్పాన్ని ఒలకబోస్తుంటారు. అందులోనే కనిపించని కర్రపెత్తనం దాగుంటుంది. జనాన్ని సేవిస్తున్నామంటూనే వారిపైనే పెత్తనం చలాయించడం నేతలకే ప్రత్యేకించిన తాతలనాటి విద్య! అందుకని, కంటికి కనిపించేదంతా పచ్చని ప్రజలస్వామ్యమే అనుకోవడం భ్రమ. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే స్వాములని కాదు. ప్రజలకు సాముగరిడీలు చూపి నేతగా నెత్తికెక్కేవారని గ్రహించాలి!’
‘చేతిలో దండం అనేది అధికారానికి, అహంకారానికి, అనుశాసనానికి, క్రమశిక్షణకు, భయానికి సంకేతం కదా!’
‘ఒక్కొక్కరికి ఒక్కోరకం దండం అలంకారం. పరిణామ క్రమంలో దండం భౌతికరూపంలో అంతరించినా- పనులు, వృత్తులు, మారుతున్న సమాజంలో పరిస్థితుల్ని బట్టి రూపాల్ని మార్చుకుంది. అలంకారం, అలంకరణ మారి ఉండవచ్చు. అధికారం, అనుశాసనంలో ఏ తేడా లేదు. అదొక కరడుగట్టిన కనిపించని శక్తి అంతే!’
‘అంటే, నిత్యజీవితంలోనూ అడుగడుగునా అదృశ్య శక్తిలా పనిచేస్తుంటుందా?’
‘గృహలక్ష్మి చేతిలో అప్పడాల కర్రే ఇంటికి గృహదండం. ఇప్పుడంటే ఆ స్థానంలో టీవీ రిమోట్ వచ్చి చేరింది. నిమిషంలో వంద ఛానెళ్లను అలవోకగా తిప్పి నచ్చిన సీరియల్ దగ్గర అలవాటుగా ఆగే నైపుణ్యం గృహరాణుల సొంతం. ఇంటినీ ఇంటిసభ్యుల్నీ అంతేనైపుణ్యంతో వేలికొసలతో తిప్పికూర్చోబెట్టడంలోనూ అదేవిద్య! చిన్నప్పుడు బడిలో మేస్టారు చేతిలో బెత్తం ఓ గురుదండం. బడి మొత్తాన్ని నియమబద్ధంగా, శాసనయుతంగా నడచుకొనేలా చేసే శక్తి గురుదండానికి ఉండేది. హెడ్మాస్టర్ చేతిలో బడితె చూసి విద్యార్థుల లాగులు తడిస్తే, ఇతర ఉపాధ్యాయుల వెన్ను వణికించేది. మేస్టారు చేతిలో తెల్లని సుద్దముక్క సైతం తరగతి గదిలో విష్ణుచక్రమై దూసుకెళ్లే చక్రదండం. కారణం లేకుండానే కనిపించిన వారికల్లా కర్రపూజ చేసి శాంతిభద్రతల్ని ప్రశాంతంగా నిద్రపుచ్చే పోలీసు చేతికర్రే లాఠీదండం! డాక్టర్ల హుండీని జీవనపర్యంతం కాసులతో గలగలలాడించే స్టెతస్కోపు ఓ ప్రాణదండం. గవర్నమెంటాఫీసులో అల్పుడైన అవినీతి అధికారికీ ఎక్కడలేని శక్తినీ సమకూర్చే కుర్చీ ఓ ఆసనదండం. సమాజంలో ప్రతి ఒక్కరినీ పద్ధతి ప్రకారం నడిపించేందుకు ఓ అధికార దండం ఏదో ఒక రూపంలో అదృశ్య శక్తిలా పని చేస్తుంటుంది’
‘అంటే, మనిషి మాట వినని మనిషి, ఓ వస్తువుకు తలొగ్గుతాడా?
‘మనిషిని మనిషి గౌరవించాలంటే, కులం గోత్రం మతం వర్ణం వర్గం భాష ప్రాంతం పార్టీ, సిద్ధాంతం, ఎడమ పక్షం, కుడివాటం, స్వపక్షం, విపక్షం, స్వప్రయోజనం, సమయం, సందర్భం... ఇలాంటి లెక్కలన్నీ అడ్డొస్తాయి. తకరారంతా ఈ లెక్కలతోనే! ఈ తూకాల బేరీజులో తేడాలే సభల్ని సంతల్లా మార్చేస్తున్నాయి. రాజదండమో, ధర్మదండమో, మంత్రదండమో, అధికార దండమో... అంతెత్తున ఎదురుగా నిలబడితే పరిస్థితిలో మార్పేమైనా వస్తుందేమోననేది ఆశ!’
‘నిబంధనలే చేయలేని పని ఓ దండం చేస్తుందా?’
‘మనుషులకు తోటి మనుషులకన్నా ప్రాణంలేని వస్తువులంటేనే విలువా వ్యామోహం కదా! చేతల్లో చేవకన్నా చేతికి తొడిగే రంగురాళ్లపైనే ఎక్కువ నమ్మకం కదా! ఈ రూపకంగానైనా తావీజు మహిమేదో పనిచేసి సభాసంస్కారం తలకెక్కి సన్మార్గంలో నడిస్తే అందరికీ శ్రేయస్కరమే కదా!’
శ్రీనివాస్ దరెగోని
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Ukraine Crisis: భద్రతామండలి పని తీరును ప్రపంచం ప్రశ్నించాలి!: భారత్
-
Chandrababu Arrest: చంద్రబాబుకు బాసటగా.. కొత్తగూడెంలో కదం తొక్కిన అభిమానులు
-
Swiggy: యూజర్ల నుంచి స్విగ్గీ చిల్లర కొట్టేస్తోందా? కంపెనీ వివరణ ఇదే..!
-
Salman khan: రూ.100కోట్ల వసూళ్లంటే చాలా తక్కువ: సల్మాన్ ఖాన్
-
Apply Now: ఇంటర్‌తో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
-
Hyundai i20 N Line: హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్.. ధర, ఫీచర్ల వివరాలివే!