ఆన్‌లైన్‌ వాణిజ్యంలో సర్కారీ సేవలు

ఆన్‌లైన్‌లో ఆహారం తెప్పించుకునేందుకు, షాపింగ్‌ చేసేందుకు... బైక్‌, ఆటో, కార్‌ రైడ్‌ను బుక్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇష్టానుసారంగా నిబంధనలు రూపొందిస్తూ ఈ-కామర్స్‌ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇవి అందించే సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ కేంద్ర ప్రభుత్వ...

Published : 06 Jun 2023 01:00 IST

ఆన్‌లైన్‌లో ఆహారం తెప్పించుకునేందుకు, షాపింగ్‌ చేసేందుకు... బైక్‌, ఆటో, కార్‌ రైడ్‌ను బుక్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇష్టానుసారంగా నిబంధనలు రూపొందిస్తూ ఈ-కామర్స్‌ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇవి అందించే సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఓఎన్‌డీసీ’ అనే సరికొత్త వేదిక అందుబాటులోకి వచ్చింది. తగ్గింపు ధరలతో ఇది కొద్దిరోజులుగా ప్రాచుర్యం పొందుతోంది.

దేశంలో మొబైల్‌ ఫోన్‌, అంతర్జాల వినియోగంతో పాటే ఈ-కామర్స్‌ రంగమూ అంతకంతకు పుంజుకొంటోంది. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్‌, ర్యాపిడో, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి యాప్‌ల ద్వారా నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. వీటన్నింటినీ తలదన్నేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఓఎన్‌డీసీ (ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌)’- భారతీయ ఈ-కామర్స్‌ రంగంలో సంచలనంగా మారుతోంది. భారీ తగ్గింపు ధరలతో దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇస్తున్న ఈ వేదిక దేశంలో మరో డిజిటల్‌ విప్లవం సృష్టించనుందన్న ఆశలు రేకెత్తిస్తోంది. ఈ-కామర్స్‌ రంగం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నది కేంద్ర ప్రభుత్వ యోచన. తదనుగుణంగా పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఆధ్వర్యాన లాభాపేక్ష లేని ప్రైవేటు సంస్థగా ఓఎన్‌డీసీ అంకురించింది. దీని సేవలు ప్రస్తుతం 236 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు 36 వేల మంది విక్రయదారులు దీనిలో భాగస్వాములయ్యారు.

విస్తృత విపణి

ప్రముఖ మార్కెట్‌ పరిశోధన సంస్థ ‘బెర్న్‌స్టీన్‌ రీసెర్చ్‌’ నివేదిక ప్రకారం, దేశంలో ఈ-కామర్స్‌ మార్కెట్‌ విలువ 2025 నాటికి సుమారు రూ.12,40,000 కోట్లకు (150 బిలియన్‌ డాలర్లకు) చేరనుంది. ఇంతటి భారీ వ్యాపారంలో గుత్తాధిపత్యాన్ని నిలువరించడం ఎంతో అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొనుగోలుదారులు, విక్రయదారులు అత్యంత సులభంగా, పారదర్శకంగా లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఓఎన్‌డీసీని రూపొందించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఓపెన్‌ నెట్‌వర్క్‌ ప్రొటోకాల్స్‌ను పాటించే పేటీఎం, పిన్‌కోడ్‌, మైస్టోర్‌ వంటి డిజిటల్‌ చెల్లింపు యాప్‌ల ద్వారా ఓఎన్‌డీసీ సేవలను ఉపయోగించుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఆహారం సరఫరా చేసే యాప్‌లలో స్విగ్గీ, జొమాటోలదే ఆధిపత్యం. హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం 2022 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 54శాతం మార్కెట్‌ వాటా జొమాటోది. మిగతా 46శాతం స్విగ్గీది. ఇంతలా వీటి జోరు కొనసాగుతున్నా, ఆ సంస్థలు ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. నష్టాల ఊబి నుంచి గట్టెక్కేందుకు రెస్టారెంట్ల కమిషన్‌ పెంపు, వినియోగదారులపై రుసుముల వడ్డన వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇతర యాప్‌ల ద్వారా చేసే ఆర్డర్‌ విలువతో పోలిస్తే ఓఎన్‌డీసీలో ధరలు 30-80శాతం తక్కువగా ఉంటున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో 90కోట్ల మంది కొనుగోలుదారులు, కోటీ 20లక్షల మంది వినియోగదారులను చేర్చుకోవాలని ఓఎన్‌డీసీ యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌డీసీని వ్యాపార ధోరణితో చూడటం లేదు. డిజిటల్‌ ఇండియా నిర్మాణానికి ఊతమివ్వడం, దేశ నలుమూలల ఉన్న చిరు వ్యాపారుల్ని ఆన్‌లైన్‌ ప్రపంచంతో అనుసంధానించడంతో పాటు ఆయా ప్రాంతాల ఉత్పత్తుల్ని కొనుగోలుదారులకు పరిచయం చేయడం దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం. ఈ క్రమంలోనే ఓఎన్‌డీసీ ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంత చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ఆరంభించాయి. ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ కార్యక్రమాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు ఓఎన్‌డీసీతో అనుసంధానించాయి. తద్వారా ఆయా జిల్లాల్లో ప్రత్యేకత ఉండే ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించుకోవడం వీలవుతోంది.

ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు...

విస్తృత మార్కెట్‌ సౌకర్యం కల్పించే ఓఎన్‌డీసీతో భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకుంటాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకెన్సీ తన తాజా నివేదికలో విశ్లేషించింది. 2030 నాటికి దేశంలో డిజిటల్‌ వినిమయం అయిదు రెట్లు పెరిగి, సుమారు రూ.28లక్షల కోట్లకు (340 బిలియన్‌ డాలర్లకు) చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో సుమారు 19కోట్ల మంది డిజిటల్‌ లావాదేవీలు జరుపుతున్నారు. అప్పటికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరుతుందని మెకెన్సీ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కేవలం ఆరు శాతమే ఈ-కామర్స్‌ ద్వారా విక్రయాలు సాగిస్తున్నాయి. ఓఎన్‌డీసీ తోడ్పాటుతో ఏడేళ్లలోనే ఈ సంఖ్య ఏడు రెట్లు పెరగనుందన్నది నిపుణుల అంచనా. ఈ వేదిక వ్యాపారులు, వినియోగదారుల విశ్వాసం చూరగొంటే, సమీప భవిష్యత్తులోనే   ఈ-కామర్స్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి.

జీఎస్‌ఎన్‌ చౌదరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.