తుర్కియేకు అగ్నిపరీక్ష

తుర్కియే రాజకీయాల్లో రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి తన ఆధిపత్యం నిరూపించుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో విజయం సాధించి, మరో అయిదేళ్లు అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే ఈ దఫా ఆయనకు పాలనలో గట్టి సవాళ్లు ఎదురుకానున్నాయి.

Published : 07 Jun 2023 01:08 IST

తుర్కియే రాజకీయాల్లో రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి తన ఆధిపత్యం నిరూపించుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో విజయం సాధించి, మరో అయిదేళ్లు అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే ఈ దఫా ఆయనకు పాలనలో గట్టి సవాళ్లు ఎదురుకానున్నాయి.

తుర్కియే చరిత్రలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఎర్డోగాన్‌ ఒకరు. గతంలో ఇస్తాంబుల్‌ మేయర్‌గా పనిచేసిన ఆయన- రాజకీయాల్లో అయిదేళ్ల నిషేధం వంటి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ప్రధానిగా, అధ్యక్షుడిగా ఎదిగారు. 2003లో ఆయన ప్రధానిగా తొలిసారి పగ్గాలు చేపట్టేనాటికి తుర్కియే తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో ఉంది. అలాంటి స్థితిలో దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించారు. గత రెండు దశాబ్దాలలో దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చేశారు. అయితే ఆయనపై వచ్చిన విమర్శలు తక్కువేమీ కాదు. ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చి, నిరంకుశ ధోరణితో వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఆదిలో లౌకికవాదిగా ఉన్న ఆయన- క్రమంగా మతతత్వ విధానాలవైపు మొగ్గారు. మీడియాను తన గుప్పిట్లోకి తీసుకున్నారు. పలువురు రాజకీయ ప్రత్యర్థులు, పాత్రికేయులను జైలుపాలు చేశారు. అసమ్మతి గళాన్ని అణచివేశారు. కుర్దిష్‌ తిరుగుబాటుదారులపై పోరును ముమ్మరం చేశారు. 2018లో పార్లమెంటరీ వ్యవస్థ స్థానంలో కార్యనిర్వాహక అధ్యక్ష వ్యవస్థను ప్రవేశపెట్టి, అధికారాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇవన్నీ ఎర్డోగాన్‌పై వ్యతిరేకతను పెంచాయని, ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతారని విశ్లేషణలు వినిపించినా- మీడియా, మతపెద్దల అండతో గట్టెక్కారు.

రాబోయే అయిదేళ్ల పాలన ఎర్డోగాన్‌కు అగ్నిపరీక్షగా మారనుంది. తుర్కియేలో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. డాలరుతో టర్కిష్‌ లిరా మారకం విలువ భారీగా పడిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం నిరుడు అక్టోబరులో ఏకంగా 85శాతానికి ఎగబాకింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి అది 44శాతానికి తగ్గినప్పటికీ, జీవనవ్యయం భారీగా పెరిగింది. వీటికి తోడు- ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీ భూకంపం తుర్కియేను కుదిపేసింది. 50వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకొంది. నాటి బీభత్సంతో వాటిల్లిన నష్టం విలువ దేశ జీడీపీలో నాలుగు శాతం దాకా ఉంటుందన్నది ప్రపంచ బ్యాంకు అంచనా. ఎర్డోగాన్‌ హయాంలో దేశంలో నిర్మాణరంగం పురోగతి సాధించింది. అవినీతిపై ఆయన దృష్టి సారించకపోవడంతో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు వెలశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్రమబద్ధీకరణ లేని కట్టడాలవల్లే భూకంప నష్టం తీవ్రత పెరిగిందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు, తుర్కియేను సిరియా శరణార్థుల సమస్య వేధిస్తూనే ఉంది. అంతర్యుద్ధం నుంచి బయటపడేందుకు ఇప్పటిదాకా 34లక్షల మందికిపైగా సిరియన్లు తుర్కియేలోకి ప్రవేశించారని అంచనా. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తుర్కియేకు వీరు మరింత భారంగా మారారు. వడ్డీరేట్ల పెంపు ద్వారా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దవచ్చని నిపుణులు చెబుతున్నా, అందుకు తాను వ్యతిరేకమని ఎన్నికల సందర్భంగా ఎర్డోగాన్‌ స్పష్టం చేశారు. దాంతో ఆయన ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అంతర్జాతీయ సంబంధాల విషయంలోనూ ఎర్డోగాన్‌కు కఠిన పరిస్థితులు ఎదురుకానున్నాయి. నాటో కూటమిలో తుర్కియే భాగస్వామి. కానీ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో అది అమెరికా పక్షాన నిలవలేదు! రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఎర్డోగాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో మాస్కోపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల్లో తుర్కియే పాలుపంచుకోలేదు. పైగా నాటోలో స్వీడన్‌ చేరికను అంకారా వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాదంపై అలసత్వం ప్రదర్శిస్తోందంటూ ఆ దేశానికి సభ్యత్వ మంజూరును వ్యతిరేకిస్తోంది. ఇండియాతో సంబంధాల విషయంలో ఎర్డోగాన్‌ ఎలా వ్యవహరిస్తారన్నదీ ఆసక్తికరమే. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు తుర్కియే వత్తాసు పలుకుతోంది. ఆ మద్దతు వెనక- ఇస్లామిక్‌ దేశాలకు తాను పెద్దన్నలా ఉండాలన్న కాంక్ష కనిపిస్తోంది! జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరించడంపైనా ఆ దేశం విమర్శలు గుప్పించింది. అయితే ఇండియా-తుర్కియే వాణిజ్య బంధం కొన్నేళ్లుగా బలపడటం సానుకూలాంశం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం తుర్కియేకే మేలు. నియంతృత్వ పోకడను పక్కనపెట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ అధ్యక్షుడు కట్టుబడి ఉండాలన్నది తుర్కియే ప్రజల ఆకాంక్ష. దానికితోడు దేశాన్ని అంతర్జాతీయ సైనిక, పారిశ్రామిక శక్తిగా మారుస్తానన్న ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఎర్డోగాన్‌ ఏమేరకు కృషి చేస్తారో చూడాలి!

ఎం.నవీన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.