నైపుణ్య శిక్షణతో నిరుద్యోగ నిర్మూలన

ఇండియా నేడు ఇతర ప్రధాన దేశాలకు మించిన అభివృద్ధి రేటు సాధిస్తోంది. 2023-24లో భారత  జీడీపీ 6.5శాతానికి పైగా వృద్ధి రేటు సాధిస్తుందన్నది నిపుణుల అంచనా. నిరుద్యోగ సమస్య ఈ ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది. పెట్టుబడులను, పారిశ్రామిక అభివృద్ధిని జోరెత్తించడంతో పాటు నైపుణ్య శిక్షణ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

Published : 10 Jun 2023 01:03 IST

ఇండియా నేడు ఇతర ప్రధాన దేశాలకు మించిన అభివృద్ధి రేటు సాధిస్తోంది. 2023-24లో భారత  జీడీపీ 6.5శాతానికి పైగా వృద్ధి రేటు సాధిస్తుందన్నది నిపుణుల అంచనా. నిరుద్యోగ సమస్య ఈ ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది. పెట్టుబడులను, పారిశ్రామిక అభివృద్ధిని జోరెత్తించడంతో పాటు నైపుణ్య శిక్షణ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

ప్రపంచ ప్రజానీకాన్ని అన్ని సమస్యలకన్నా నిరుద్యోగమే ఎక్కువగా పీడిస్తోంది. నోబెల్‌ బహుమతులు అందుకున్న ఆర్థికవేత్తలు సైతం నిరుద్యోగానికి శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. ఒక ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందన్నది దాని ఉద్యోగ కల్పన రేటు మీద ఆధారపడి ఉంటుంది. వయసు, లింగ భేదాలు, ప్రాంతం, జాతి, విద్యాస్థాయి- ఇవన్నీ ఉద్యోగావకాశాలను ప్రభావితం చేస్తాయి. అనుభవం, ఆంగ్ల భాషా ప్రావీణ్యం లేకపోయినా ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయి. ఇది గ్రామీణ యువతకు ఎక్కువగా ఎదురయ్యే సమస్య. భారత్‌లో యువజన నిరుద్యోగ రేటు 2021లో 28.26 శాతమని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేశాయి. ఇంతటి భారీ నిరుద్యోగం ఇరాన్‌, లెబనాన్‌, యెమెన్‌లలో మాత్రమే ఉంది. భారత పారిశ్రామిక రంగం తగినంతగా అభివృద్ధి చెందకపోవడం యువతలో నిరుద్యోగానికి ప్రధాన కారణం. దేశీయంగా తగినన్ని పెట్టుబడులు సమీకరించలేకపోవడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాకపోవడం పారిశ్రామికాభివృద్ధికి ప్రధాన అవరోధాలు. ఆర్థిక మాంద్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగాల ఔట్‌ సోర్సింగ్‌ నిరుద్యోగానికి దారితీస్తున్నాయి. వ్యవసాయ రంగంలో సీజన్‌వారీ నిరుద్యోగం సర్వసాధారణం.

తక్కువ మందికే వృత్తివిద్య

దేశంలోని 47శాతం ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో ఉద్యోగ నైపుణ్యాలు కొరవడ్డాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన రెండు లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోవడం మరింత విచారకరం! వీరికి తగిన జీతభత్యాలిచ్చి గ్రామాల్లో వైద్య సేవలకు వినియోగించవచ్చు. కానీ, యువవైద్యులు పట్టణ జీవితాన్ని కోరుకుంటూ గ్రామాలకు వెళ్ళేందుకు నిరాకరిస్తున్నారు. 1951లో భారత్‌లో నిరుద్యోగ రేటు కేవలం 0.21 శాతమే. అది 1961లో 3.63శాతానికి, 1980లో 4.52, 1995లో 5.51శాతానికి ఎగబాకింది. దేశంలో నిరుద్యోగం 2023 ఏప్రిల్‌లో 8.11శాతంగా నమోదైంది. ఈ సంవత్సరాంతానికల్లా నిరుద్యోగ రేటు మరింత పెరుగుతుందన్న ఆందోళన ముప్పిరిగొంటోంది. పొరుగుదేశం చైనాలో 2021లో నిరుద్యోగం 4.82శాతం. 2020తో పోలిస్తే అది 0.18శాతం తక్కువ. జపాన్‌లో నిరుడు 2.70శాతంగా ఉన్న నిరుద్యోగం ఈ ఏడాది 2.60శాతానికి తగ్గింది. ఆ రెండు దేశాల్లో పారిశ్రామికీకరణ విజయవంతం అయినందువల్లే నిరుద్యోగిత తక్కువగా ఉంటోంది.

భారత్‌లో 2014 నుంచి యువజనుల్లో నిరుద్యోగం 22శాతం వద్ద తచ్చాడుతోంది. 15-24 ఏళ్ల వయసువారిలో నిరుద్యోగాన్ని యువజన నిరుద్యోగితగా పరిగణిస్తారు. ఉద్యోగాల్లో రాణించడానికి అవసరమైన మనస్తత్వాన్ని, నైపుణ్యాలను అలవరచుకునే వయసు ఇది. యువజనులు ఉద్యోగం సంపాదించలేకపోతే అది వారిని, వారి కుటుంబాలను కుంగదీస్తుంది. వ్యక్తిగతంగా మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నిరుద్యోగం కారణంగా యువకులు పెడదోవ పట్టే ప్రమాదముంది. అది వ్యక్తిగతంగా, కుటుంబపరంగానే కాకుండా దేశానికీ హానికరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, రాజస్థాన్‌, బిహార్‌ రాష్ట్రాల్లో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. నాణ్యమైన చదువు లభించకపోవడం, కఠినమైన కార్మిక చట్టాలు యువజన నిరుద్యోగానికి దారితీస్తున్నాయి. దేశంలో 19-24 ఏళ్ల వయోవర్గంలో అయిదు శాతంకన్నా తక్కువ మందికే వృత్తివిద్యా శిక్షణ లభిస్తోంది. ఇది అమెరికాలో 57శాతం, జర్మనీలో 75శాతం, దక్షిణ కొరియాలో 96శాతంగా ఉంది. 2022 డిసెంబరులో భారత్‌లో పట్టణ నిరుద్యోగిత 10.09 శాతానికి పెరిగిందని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ (సీఎంఐఈ) వెల్లడించింది. నిరుద్యోగిత తగ్గి ఎక్కువమంది యువజనులు వస్తుసేవల ఉత్పత్తిలో ప్రవేశిస్తే, అది సహజంగానే జీడీపీ వృద్ధికి తోడ్పడుతుంది.

మార్పులతో సాధ్యమే...

జనాభాలో అత్యధికులు ఉత్పత్తి కార్యకలాపాల్లో భాగస్వాములైతే, వారి ఆదాయాలు పెరుగుతాయి. వస్తుసేవలకు గిరాకీ పెరిగి దేశార్థికం ముందంజ వేస్తుంది. విద్యా వ్యవస్థలో, ప్రభుత్వ విధానాల్లో తగిన మార్పులు తీసుకురావడం ద్వారా సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరచుకోవాలి. స్వయం ఉపాధి అవకాశాలనూ పెంపొందించాలి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. కొవిడ్‌ మహమ్మారి తెచ్చిపెట్టిన కల్లోలం నుంచి తేరుకోవడానికి ఇలాంటి పథకం ఎంతగానో తోడ్పడుతుంది. 2030లో ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వీలుగా ప్రభుత్వం సముచిత జాతీయ ఉపాధి విధానాన్ని రూపొందించి అమలు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.