చిరు వ్యాపారులకు అండ
ప్రస్తుతం దేన్ని కొనుగోలు చేయాలన్నా అధిక శాతం ప్రజలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి తమ గుత్తాధిపత్యంతో చిన్న వ్యాపారులను దెబ్బతీస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం దేన్ని కొనుగోలు చేయాలన్నా అధిక శాతం ప్రజలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి తమ గుత్తాధిపత్యంతో చిన్న వ్యాపారులను దెబ్బతీస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని నివారించేందుకు కేంద్రం ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వస్తుసేవల విక్రేతలు, కొనుగోలుదారులు ఈ-కామర్స్ లావాదేవీలు నిర్వహించడానికి అనువుగా భారత ప్రభుత్వం గతేడాది చివర్లో నెలకొల్పిన వేదిక- ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ). ఇది ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం. కిరాణా సరకులు, ఆహార పదార్థాల బట్వాడా, హోటళ్లు, ప్రయాణ బుకింగ్‌లు, బైక్ ట్యాక్సీల వంటి సేవలు అందించేవారు, పొందేవారికి తోడ్పడే డిజిటల్ వేదిక ఓఎన్‌డీసీ. ఈ సేవలు ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతా సహా 172 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 28 నాటికి ఈ నగరాల్లో యాభై వేల రెస్టారెంట్లు ఓఎన్‌డీసీ ద్వారా ఆహార ఆర్డర్లు తీసుకుని వినియోగదారులకు అందించడానికి సిద్ధమయ్యాయి. ఏప్రిల్ నాటికే ఓఎన్‌డీసీ ద్వారా ఆహార ఆర్డర్లు రోజుకు పది వేలకు చేరాయి. బెంగళూరులో నిరుడు అక్టోబరులో ఓఎన్‌డీసీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన మొదటి రోజే రెండు వందలకు పైగా కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు అందులో చేరాయి. పేటీఎం, స్పైస్ మనీ, మైస్టోర్ వంటివి కొనుగోలుదారు తరఫు యాప్‌లుగా పనిచేశాయి.
భారతదేశ ఈ-కామర్స్ రంగ పరిమాణం 2030కల్లా రూ.29 లక్షల కోట్లకు చేరుతుందని డిలాయిట్ ఇండియా సంస్థ ఇటీవల లెక్కగట్టింది. ఈ వేదిక ద్వారా భారతీయ రైతులు తమ పంటను నేరుగా వ్యాపార సంస్థలకు విక్రయించవచ్చు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీఓలు) దళారుల ప్రమేయం లేకుండా నేరుగా బేరసారాలు జరపవచ్చు. ఈ డిజిటల్ వేదిక నిర్వహణ బోర్డులో ఆధార్ సారథి నందన్ నీలేకని, జాతీయ చెల్లింపుల సంస్థ సీఈఓ దిలీప్ ఆస్బే వంటివారూ ఉన్నారు. ఇంకా కోటిమందికి పైగా చిన్న దుకాణదారులు సభ్యులుగా ఉన్న భారత చిల్లర వర్తకుల సంఘం సీఈఓ కుమార్ రాజగోపాలన్, అఖిల భారత వర్తకుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ సైతం ఓఎన్‌డీసీ నిర్వహణ బోర్డులో సభ్యులే. అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థల గుత్తాధిపత్యం నుంచి ఈ-కామర్స్ రంగాన్ని విముక్తం చేయడం ఓఎన్‌డీసీ లక్ష్యం. భారీ ఈ-కామర్స్ సంస్థలు విక్రయదారులకు, కొనుగోలుదారులకు మధ్యవర్తులుగా వ్యవహరించడానికే పరిమితమవుతాయని మొదట్లో భావించారు. అయితే, కొంతమందికి చెందిన బడా వస్తువిక్రయ సంస్థల్లో అమెజాన్ పెట్టుబడి పెట్టి, వారి ఉత్పత్తులు అమ్మడానికే అత్యధిక ప్రాధాన్యమిచ్చిందని గతంలో రాయిటర్స్ వార్తాసంస్థ పరిశోధనాత్మక కథనం తెలిపింది. వాల్‌మార్ట్ ఇక్కడి తన అనుబంధ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధిక వాటాలు కొనుగోలుచేసి అమెజాన్ బాటలోనే నడుస్తోంది. రెండు సంస్థలు తామే నేరుగా దుకాణాలు తెరిచాయి. తగ్గింపు ధరలకు సరకులను అమ్ముతూ చిల్లర వర్తకుల వ్యాపారాన్ని అవి దెబ్బతీస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.
అమెజాన్ వంటి సంస్థలు భారత్‌లో 550 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టామంటున్నాయి. ఏటా వంద కోట్ల డాలర్ల మేర నష్టాలు చవిచూస్తున్నామని అవి చెబుతున్నాయి. భారీ తగ్గింపు ధరలకు సరకులు అమ్ముతూ చిన్న వ్యాపారుల దుకాణాలు మూతపడేలా చేసి, తరవాత మార్కెట్‌ను పూర్తిగా గుప్పిట్లోకి తీసుకోవడమే ఆ సంస్థల వ్యూహమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెజాన్ భారత్‌లో నాలుగు లక్షలమంది చిల్లర విక్రేతలకు ఈ-కామర్స్ వేదికను కల్పిస్తున్న మాట నిజమే. అయితే, అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా అమ్మిన సరకుల్లో మూడో వంతు వాటా 33 మంది విక్రేతలదేనని రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో చిల్లర వర్తకుల పొట్టకొట్టకుండా చూడటం ఓఎన్‌డీసీ ప్రధాన లక్ష్యం. అదే సమయంలో భారీ ఈ-కామర్స్ సంస్థలకు తాము వ్యతిరేకం కాదని, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం వివరిస్తోంది. అందుకే ఓఎన్‌డీసీలో భాగస్వాములు అవడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ రిటైల్ వంటి సంస్థలు సుముఖంగా ఉన్నాయి. మెటా(ఫేస్‌బుక్), వాట్సాప్, జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు ఓఎన్‌డీసీలో సొంత వేదికలను ఏర్పాటు చేసుకోవచ్చు.
అడపా ప్రసాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్