చిక్కుల్లో జీవ వైవిధ్యం

ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న జీవ, వృక్ష జాతుల వల్ల కొన్ని చోట్ల తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. వాటివల్ల స్థానిక జీవ జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.

Published : 22 Sep 2023 00:11 IST

ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న జీవ, వృక్ష జాతుల వల్ల కొన్ని చోట్ల తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. వాటివల్ల స్థానిక జీవ జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రజల జీవనోపాధులపైనా ప్రభావం పడుతోంది.

క ప్రాంతం నుంచి కొత్త స్థలంలోకి వచ్చి చేరిన జీవ, వృక్ష జాతులు తామరతంపరగా తమ జనాభాను పెంచుకొని స్థానిక జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయి. అక్కడి జీవ జాతులకు హాని కలిగిస్తాయి. ఇలాంటి వాటిని దండెత్తే పరదేశీయ జీవజాతులు (ఇన్వేసివ్‌ ఏలియన్‌ స్పీషీస్‌) అంటారు. ఇవి అనుకోకుండా ఒక ప్రాంతానికి వచ్చి చేరవచ్చు. లేదా వేరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానూ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆవరణ వ్యవస్థల్లో కలిగే ఈ విధమైన మార్పును జీవ సంబంధ దండయాత్రగా అభివర్ణిస్తారు. భారత్‌లో జల వనరుల విషయంలో ఇలాంటి జీవజాతుల సమస్య పేలడానికి సిద్ధంగా ఉన్న టైంబాంబులా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని తూర్పు కనుమల్లో 65శాతం జలాశయాల్లో పరదేశీయ జీవ జాతులైన తెరచాప వంటి రెక్కలు కలిగిన క్యాట్‌ఫిష్‌లు (సెయిల్‌ఫిన్‌ క్యాట్‌ఫిష్‌) విస్తరించాయి. ఈ మేరకు మనుగడ ప్రమాదంలో ఉన్న జీవ జాతుల సంరక్షణకు సంబంధించిన పరిశోధనాలయం (ఎన్‌ఏసీఓఎన్‌ఈఎస్‌) వెల్లడించింది. దక్షిణ అమెరికాకు చెందిన ఈ చేపలు కృష్ణానదిలో 2016లో విజయవాడ వద్ద మొదటిసారి కనిపించాయి. వీటికి ఎలాంటి వాణిజ్య విలువా లేదు. ఇవి వలలను చించివేస్తూ జాలరులకు నష్టం కలిగిస్తున్నాయి. ఎలాంటి ఆహారాన్నైనా తిని, తక్కువ ఆమ్లజని ఉన్న పరిస్థితుల్లో సైతం ఇవి జీవించగలవు. అమెరికా, ఆఫ్రికా క్యాట్‌ఫిష్‌ వంటి పరదేశీయ చేప జాతులు ప్రమాదకర సంఖ్యలో భారత్‌లో వ్యాపించాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 37 వేలకు పైగా పరదేశీయ జీవ జాతులు తమవి కాని జీవావరణ ప్రాంతాల్లోకి మానవ కార్యకలాపాల వల్ల చేరాయి. వాటిలో 3,500 జాతులు ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాలకు చెందిన జంతు, వృక్షజాతుల్లో 60శాతం మేర నశించడానికి కారణమయ్యాయి. ఈ మేరకు జీవ వైవిధ్యం, ఆవరణ వ్యవస్థల సేవలకు సంబంధించి అంతర ప్రభుత్వ వేదిక (ఐపీబీఈఎస్‌) నివేదిక ఇటీవల వెల్లడించింది. వీటివల్ల స్థానిక జీవజాతులు అంతరించడంతో పాటు జీవవైవిధ్యం, ప్రజల ఉపాధులు సైతం దెబ్బతింటాయి. ఆహారం, ఆరోగ్యం, పర్యావరణంపైనా ప్రభావం పడుతుంది. ఈ పరదేశీయ జీవ జాతుల వల్ల విశ్వవ్యాప్తంగా ఏటా దాదాపు రూ.35 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. భారత్‌లోనూ వీటివల్ల 1960-2020 మధ్య కాలంలో సుమారు రూ.15 లక్షల కోట్ల దాకా నష్టం తలెత్తినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

దేశీయంగా 76శాతం అటవీ విస్తీర్ణంలో పలు పరదేశీయ మొక్క జాతులు చేరినట్లు అంచనా. తమిళనాడులోని నీలగిరి ఉన్నత పర్వత ప్రాంతాల్లో శోలా గడ్డి భూముల్లోకి అత్యధికంగా నీటిని తీసుకునే మొక్క జాతులు ప్రవేశించాయి. వాటివల్ల ఆయా పర్వతాల నుంచి ఉద్భవించే జల ప్రవాహాల్లో మార్పు తలెత్తింది. వాటిపై ఆధారపడి జీవించే సమాజాలపై ఆ ప్రభావం పడుతోంది. తమిళనాడులో నమోదైన 6,723 మొక్క జాతుల్లో 36.6శాతం పరదేశీయ జాతులే! వాటిని తొలగించడానికి ఆ రాష్ట్రం ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. రణ్‌ ఆఫ్‌ కచ్‌లో పరాయి తుమ్మజాతుల విస్తరణ వల్ల పశువుల మేత ప్రాంతాలు తగ్గిపోయాయి. ఇలాంటి వాటివల్ల స్థానిక మొక్క జాతుల సంఖ్య తరిగిపోతుంది. కొన్ని కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వన్యప్రాణుల ఆవాస నాణ్యత దెబ్బతిని అవీ క్రమంగా మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటాయి. అడవుల్లో పెరిగే పరదేశీయ మొక్క జాతులను కలుపు మొక్కలుగా పరిగణించి ఆయా రాష్ట్రాల్లో అటవీ శాఖలు ఏటా తొలగిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అడవుల్లో లాంటన కమెరా(పులికంప), యుపటోరియం, హిప్టిస్‌(మహావీర), పార్థీనియం తదితరాలు వ్యాపించాయి. పరదేశీయ జీవ జాతుల కారణంగా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, చైనా, ఇండియాలు అధికంగా నష్టపోతున్నాయి. వీటికి సంబంధించి జాతీయ స్థాయిలో ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా జీవ వైవిధ్యాన్ని, స్థానిక వృక్ష, జంతు జాతులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడాలని పిలుపిస్తున్నారు.ఈ విషయంలో స్థానిక ప్రజల భాగస్వామ్యమూ తప్పనిసరి.

ఎం.రామ్‌మోహన్‌
(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.