జనాభా లెక్కలు తేల్చేదెప్పుడు?

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన శాసన ప్రక్రియ జోరందుకొంది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తరవాతే ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది.

Updated : 22 Sep 2023 10:32 IST

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన శాసన ప్రక్రియ జోరందుకొంది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తరవాతే ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. మరోవైపు, దేశీయంగా 2021లో జరగాల్సిన జనాభా లెక్కలను ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై సరైన స్పష్టత కొరవడింది.

భారతదేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు. జనగణన చట్టం ప్రకారం చేపట్టే ఈ ప్రక్రియ వల్ల పదేళ్లలో దేశ జనాభా ఎంతమేర పెరిగిందో తెలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణనే ఆధారంగా నిలుస్తుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలపై ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జాతీయ శాంపిల్‌ సర్వే, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తదితర కీలక అధ్యయనాలకూ ఆధారంగా నిలుస్తుంది. ఇంతటి కీలకమైన జనగణన ఇప్పటికే మూడేళ్లు ఆలస్యమైంది. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఆ తరవాత మహమ్మారి శాంతించినా, జనగణన ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై కేంద్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదు.

కొనసాగుతున్న వాయిదా

ఇండియాలో తొలి జనగణన 1881లోనే నిర్వహించారు. ఆ తరవాతి నుంచి ప్రతి దశాబ్దం ప్రారంభంలో అది కొనసాగుతూ వచ్చింది. 2021లోనే వాయిదా పడ్డాయి. నిజానికి 1918లో దేశీయంగా స్పానిష్‌ ఫ్లూ విజృంభించిన తరవాత 1921లో భారత రిజిస్ట్రార్‌ జనరల్‌, జనాభా లెక్కల కమిషనర్‌ కార్యాలయం (ఆర్‌జీసీసీఐ) జనగణన కసరత్తును సకాలంలో పూర్తిచేసింది. 1947లో భారత్‌ స్వాతంత్య్రం సాధించినప్పుడు అధికార బదిలీ గందరగోళం ఉన్నప్పటికీ ఆర్‌జీసీసీఐ 1951 జనగణనను యథావిధిగా నిర్వహించింది. నిజానికి 2021లో జనగణనకు కేంద్రం 2019లోనే ప్రణాళికలు రూపొందించింది. వాటి ప్రకారం 2020 ఏప్రిల్‌, సెప్టెంబర్‌ మధ్యలో దేశీయంగా అన్ని గృహాల్లోని వ్యక్తుల వివరాలు సేకరించి, తరవాతి ఏడాది ఫిబ్రవరిలో మొత్తం జనాభాను లెక్కించాలని లక్షించింది. అయితే, కరోనా వల్ల అవి ఆచరణ రూపం దాల్చలేదు. ఆ తరవాతా వాయిదా కొనసాగుతూనే ఉంది. భారత్‌లో గత జనాభా లెక్కల వివరాలు ఏమంత కచ్చితంగా లేవని, కొత్త గణనను ఎలెక్ట్రానిక్‌ పద్ధతిలో చేపడతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల వెల్లడించారు. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా మరింత కచ్చితంగా 35 కంటే ఎక్కువ సామాజిక, ఆర్థిక కొలమానాల ఆధారంగా జనాభా లెక్కలు జరపనున్నట్లు ఆయన చెబుతున్నారు. జనగణన ఆధారంగా జనాభా రిజిస్టర్‌, ఎలక్టోరల్‌ రిజిస్టర్‌, ఆధార్‌, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సుకు సంబంధించిన వివరాలన్నింటినీ నవీకరిస్తామని చెప్పారు. అయితే, జనాభా లెక్కలు ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాదీ జనగణన చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. దేశీయంగా 2027లో లేదా ఆ తరవాతే జనాభా లెక్కలు సేకరించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సారి జనగణనను కులాల ఆధారంగా జరపాలన్న డిమాండ్లూ వ్యక్తమవుతున్నాయి.

తీవ్ర నష్టం

ప్రభుత్వం సకాలంలో జనగణనను నిర్వహించి ఉంటే దాని ద్వారా వచ్చే సమాచారంతో ఓటర్ల జాబితాలను సరిచూసే అవకాశం ఉండేది. దానివల్ల దొంగ ఓట్లను కట్టడి చేయడానికి అవకాశం దక్కేది. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుతం నకిలీ ఓటరు లిస్టులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇంటి నంబరు ‘నో’ అని పెట్టిన చోట్లా వందల సంఖ్యలో ఓటర్లు నమోదవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇటీవలి కాలంలో నకిలీ ఆధార్‌ కార్డులు పెరిగిపోతున్నాయి. ఎన్నికల గుర్తింపు కార్డులు, జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు మొదలైన వాటికి ఆధార్‌ను అనుసంధానించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. దాంతో, అనేక ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు నకిలీ లబ్ధిదారులకు అందుతున్నాయి. వీటిని నివారించడానికి జనగణన తోడ్పడే అవకాశం ఉంది. మరోవైపు దేశీయంగా మారుమూల ప్రాంతాల్లో ఆధార్‌ కార్డు లేని ఎంతోమంది ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతున్నారు. ఇలాంటి వారందరినీ వెలుగులోకి తేవడానికి జనాభా లెక్కలు తోడ్పడాలి. భారత్‌లో 2011 జనగణనను అనుసరించే రేషన్‌ కార్డులు జారీ చేస్తున్నందువల్ల 10 కోట్ల మంది అసలైన లబ్ధిదారులు నష్టపోతున్నట్లు ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనగణన మరింత ఆలస్యం అయ్యే కొద్దీ ఇలాంటి వారందరికీ మరింత నష్టం వాటిల్లుతుంది. ఈ క్రమంలో త్వరితగతిన జనాభా లెక్కలు పూర్తి చేసేందుకు కేంద్రం కసరత్తు చేపట్టాలి. 

 గురువెల్లి రమణమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.