శిఖరాగ్రాన భారత క్రికెట్‌

రంగం ఏదైనా ప్రపంచంలో నంబర్‌ ఒన్‌ అనిపించుకోవడం గొప్ప ఘనత. ఆటల్లో... ముఖ్యంగా తీవ్రమైన పోటీ ఉండే క్రికెట్లో అగ్రస్థానం సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. భారత జట్టు ఇప్పుడు క్రికెట్లో మూడు ఫార్మాట్లలో అగ్రస్థానం సాధించి తన సత్తా చాటుకుంది. ఇది ప్రపంచ క్రికెట్లో మన ఆధిపత్యానికి సూచిక.

Updated : 25 Sep 2023 06:56 IST

రంగం ఏదైనా ప్రపంచంలో నంబర్‌ ఒన్‌ అనిపించుకోవడం గొప్ప ఘనత. ఆటల్లో... ముఖ్యంగా తీవ్రమైన పోటీ ఉండే క్రికెట్లో అగ్రస్థానం సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. భారత జట్టు ఇప్పుడు క్రికెట్లో మూడు ఫార్మాట్లలో అగ్రస్థానం సాధించి తన సత్తా చాటుకుంది. ఇది ప్రపంచ క్రికెట్లో మన ఆధిపత్యానికి సూచిక.

ప్రతిష్ఠాత్మక క్రికెట్‌ ప్రపంచ కప్‌ మరో రెండు వారాల్లో మొదలవబోతోంది. ఈ తరుణంలో క్రికెట్లో మూడు ఫార్మాట్లలో భారత్‌ నంబర్‌ ఒన్‌గా నిలవడం- ఆ మెగా టోర్నీలో మన జట్టు జయకేతనం ఎగురవేయడానికి గొప్ప ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. టెస్టులు, ఒన్డేలు, టీ20లు... క్రికెట్లో ఉన్న ఈ మూడు ఫార్మాట్లలో ఇప్పటిదాకా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఒకే సారి అగ్రస్థానం సాధించిన ఏకైక జట్టు దక్షిణాఫ్రికా మాత్రమే. 2012లో ఆ జట్టు ఈ ఘనత సాధించింది. అయితే, ఆ ముచ్చట కొంత కాలమే నిలిచింది. ఒక్కో ఫార్మాట్లో సఫారీ జట్టు అగ్రస్థానం కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు భారత జట్టు ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే టెస్టులు, టీ20ల్లో భారత్‌ నంబర్‌ ఒన్‌గా కొనసాగుతోంది. తాజాగా మొహాలీలో ఆస్ట్రేలియాతో తొలి ఒన్డేలో విజయం సాధించడంతో ఒన్డే ఫార్మాట్లోనూ ఇండియా అగ్రస్థానాన్ని దక్కించుకుని- మూడు ఫార్మాట్లలో ప్రపంచ ఉత్తమ జట్టుగా నిలిచింది. ఒకప్పుడు అప్రతిహత విజయాలు సాధించిన ఆస్ట్రేలియాకూ సొంతం కాని గౌరవమిది.

ఇండియా జయకేతనం

తొంభయ్యో దశకం నుంచి చాలా ఏళ్ల పాటు ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. టెస్టులు, ఒన్డేల్లో ఒకేసారి నంబర్‌ఒన్‌ అయింది. టీ20ల రంగప్రవేశం తరవాత ఆ జట్టు ఒకేసారి మూడు ఫార్మాట్లలో నంబర్‌ ఒన్‌ కాలేదు. గత రెండేళ్లలో వివిధ ఫార్మాట్లలో భారత జట్టు ఆధిపత్యం చూసిన వాళ్లకు ఇప్పుడీ ఘనత సాధించడం ఆశ్చర్యంగా అనిపించదు. ఈ కాలంలో టెస్టుల్లో వివిధ జట్లతో ఏడు సిరీస్‌లను టీమ్‌ ఇండియా ఆడింది. అందులో ఒక్క దక్షిణాఫ్రికా చేతిలో మాత్రమే సిరీస్‌ ఓడింది. మిగతా ఆరు సిరీస్‌లు మనవే. మేటి జట్టు ఆస్ట్రేలియాను స్వదేశంలోనే కాక వారి దేశంలోనూ టెస్టుల్లో ఓడించింది. మరో అగ్ర జట్టు ఇంగ్లాండ్‌తో వారి దేశంలో సిరీస్‌ను డ్రాగా ముగించింది. ఒన్డేలు, టీ20ల్లో భారత్‌ మరింత ఆధిపత్యాన్ని చలాయించింది. గత రెండేళ్లలో ఒన్డే ఫార్మాట్లో ఆడిన 13 సిరీసులలో తొమ్మిది భారత్‌వే! అందులో అయిదు క్లీన్‌స్వీప్‌లు (సిరీస్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌లూ గెలవడం) సాధించింది. ఈ కాలంలో మొత్తంగా 43 ఒన్డేలు ఆడితే అందులో 28 నెగ్గి... 13మ్యాచ్‌లు మాత్రమే ఓడింది. రెండేళ్ల వ్యవధిలో 61 టీ20లు ఆడితే అందులో టీమ్‌ ఇండియా గెలిచిన మ్యాచ్‌లు 42. ఈ ఫార్మాట్లో 14 సిరీస్‌లు ఆడితే 11 మన జట్టు సొంతమయ్యాయి. ఒక్క సిరీస్‌ మాత్రమే ఓడి, రెండు డ్రాగా ముగించింది. భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన సిరీస్‌లు అయిదు కావడం విశేషం.

అప్పుడే సార్థకత

ప్రస్తుతం టెస్టుల్లో భారత్‌ నంబర్‌ ఒన్‌. అయితే, మన జట్టు ఆ ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్‌ కాదు. నాలుగేళ్ల కిందట ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్స్‌లో రెండుసార్లు ఫైనల్‌ చేరినా ట్రోఫీని మాత్రం ఇండియా సాధించలేకపోయింది. టీ20ల్లోనూ మన జట్టు నంబర్‌ ఒన్‌గా ఉన్నా... అందులోనూ సుదీర్ఘ కాలంగా ప్రపంచ ఛాంపియన్‌ కాలేకపోతోంది. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలిచాక... ఇప్పటిదాకా మళ్ళీ ఆ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఒన్డేల్లోనూ 2011లో ఛాంపియన్‌ అయ్యాక తరవాతి రెండు పర్యాయాలూ సెమీస్‌లోనే మన జట్టు ప్రయాణం ముగిసింది. 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాక గత పదేళ్లలో టీమ్‌ ఇండియా ఒక్క ఐసీసీ ట్రోఫీనీ సాధించలేదు. లెక్కకు మిక్కిలి ద్వైపాక్షిక సిరీస్‌లు సాధించడం, వివిధ ఫార్మాట్లలో నంబర్‌ ఒన్‌ కావడం... ఇదంతా బాగానే ఉన్నా- ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీల్లో గెలిస్తేనే అసలు మజా. మన దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా, ఎన్ని విజయాలు సాధించినా ప్రపంచ ఛాంపియన్‌ అయితేనే మిగతా ఘనతలన్నింటికీ సార్థకత. త్వరలోనే భారత్‌ వేదికగా ఒన్డే ప్రపంచకప్‌ మొదలవుతోంది. క్రికెట్లో ఇదే అత్యున్నత టోర్నీ. ఈ సారి భారత్‌కు బలమైన జట్టే ఉంది. ఆడుతోంది సొంతగడ్డపై కావడం పెద్ద సానుకూలత. 1983 కపిల్‌ డెవిల్స్‌, 2011లో ధోనీసేన సాధించిన అపురూప విజయాలను పునరావృతం చేస్తూ ఈసారి రోహిత్‌ బృందం సైతం ప్రపంచకప్‌ సాధిస్తే క్రికెట్‌ను అమితంగా ప్రేమించే మన దేశానికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు.

చంద్రశేఖర్‌రెడ్డి తిమ్మాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు