ఒన్‌డేలకు పరీక్ష... ప్రపంచ కప్‌

ప్రపంచ క్రికెట్లో ఒన్‌డే ప్రపంచకప్‌ విలువే వేరు. టీ20ల్లో ప్రపంచకప్‌, టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఉన్నాయి. అయినప్పటికీ, ఒన్‌డే ప్రపంచకప్‌నే అందరూ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఈసారి ఆటగాళ్లతో పాటు ఒన్‌డే క్రికెట్‌కూ పరీక్షగా నిలవబోతోంది ప్రపంచకప్‌! ఒన్‌డే ఫార్మాట్‌కు నానాటికీ ఆదరణ తగ్గుతుండటమే ఇందుకు కారణం.

Updated : 04 Oct 2023 07:47 IST

ప్రపంచ క్రికెట్లో ఒన్‌డే ప్రపంచకప్‌ విలువే వేరు. టీ20ల్లో ప్రపంచకప్‌, టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఉన్నాయి. అయినప్పటికీ, ఒన్‌డే ప్రపంచకప్‌నే అందరూ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఈసారి ఆటగాళ్లతో పాటు ఒన్‌డే క్రికెట్‌కూ పరీక్షగా నిలవబోతోంది ప్రపంచకప్‌! ఒన్‌డే ఫార్మాట్‌కు నానాటికీ ఆదరణ తగ్గుతుండటమే ఇందుకు కారణం.

ఫుట్‌బాల్‌, టెన్నిస్‌, హాకీ వంటి ఆటలు కొన్ని గంటల్లోనే ముగిసిపోయి బోలెడంత వినోదం పంచుతాయి. క్రికెట్‌ మ్యాచ్‌లు మొదట్లో అయిదు రోజులపాటు సాగుతూ అభిమానులను విసుగెత్తించేవి. అటువంటి రోజుల్లో సంచలనం సృష్టించింది- ఒన్‌డే ఫార్మాట్‌. 60 ఓవర్ల చొప్పున రెండు జట్లు ఒక్క రోజులో మ్యాచ్‌ను ముగించేయడం 70వ దశకంలో క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. 1975లో ఈ ఫార్మాట్లో ప్రపంచకప్‌ను ఆరంభిస్తే అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. 1983లో మూడో ప్రపంచకప్‌ను ఏ అంచనాలూ లేని భారత జట్టు గెలుచుకోవడంతో మన దేశంలో క్రికెట్‌ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది. తరవాతి రోజుల్లో ఒన్‌డేల్లో ఓవర్లను 50కి కుదించారు. 1992 ప్రపంచకప్‌లో రంగు రంగుల దుస్తులు, డే/నైట్‌ మ్యాచ్‌లు, ఫ్లడ్‌లైట్ల వెలుగులు ప్రపంచకప్‌ ఆకర్షణను మరింతగా పెంచాయి. విధ్వంసక ఆటగాళ్ల రంగప్రవేశం, సచిన్‌ లాంటి మేటి బ్యాటర్ల సమ్మోహకశక్తి, ఆటలో పవర్‌ ప్లే లాంటి ఆకర్షణీయ నిబంధనలు ఒన్‌డే ఫార్మాట్‌కు మంచి ఊపు తెచ్చాయి.

తగ్గిన ప్రాభవం...

ఒన్‌డే ఫార్మాట్‌ 2003 ప్రపంచకప్‌ సమయానికి తన పతాక స్థాయిని చూసింది. కానీ, తరవాతి ప్రపంచకప్‌ సమయానికి కథ మారిపోయింది. ఒన్‌డేల పతనానికి 2007లోనే పునాది పడింది. ఆ ఏడాది వెస్టిండీస్‌ వేదికగా జరిగిన ఒన్డే ప్రపంచకప్‌ అంచనాలకు తగ్గట్లు సాగలేదు. భారత్‌, పాకిస్థాన్‌ వంటి మేటి జట్లు తొలి దశలోనే నిష్క్రమించాయి. దీనికితోడు అనవసర వివాదాలు చుట్టుముట్టడంతో ఆ మెగా టోర్నీ ఆకర్షణ కోల్పోయింది. తరవాత కొన్ని నెలలకు మొదలైన టీ20 ప్రపంచకప్‌ యావత్‌ క్రికెట్‌ అభిమానులను తనవైపు తిప్పుకొంది. 20-20 ఓవర్లలో మూడు గంటల వ్యవధిలో ముగిసిపోయే పొట్టి ప్రపంచకప్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. ధోనీ నాయకత్వంలోని భారత జట్టు అద్భుత ఆటతీరుతో తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన తీరు- ఈ ఫార్మాట్‌కు మరింత ఆకర్షణ జోడించింది. తరవాతి ఏడాది ఐపీఎల్‌ ఆగమనంతో టీ20 మత్తు ప్రపంచ క్రికెట్‌ను కమ్మేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదలైన మరెన్నో టీ20 లీగ్స్‌... ఒన్‌డే క్రికెట్‌ ప్రభావాన్ని మరింత తగ్గించేశాయి. ప్రపంచకప్‌ పోటీలు జరిగేటప్పుడు తప్ప ఒన్‌డేలకు అసలు ప్రాధాన్యమే కనిపించడం లేదు. ప్రపంచ క్రికెట్‌ దేశాలన్నీ ఒన్‌డేలు ఆడటం క్రమంగా తగ్గించేస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద జట్లు ఏటా సగటున 40-50 ఒన్‌డేలు ఆడేవి. ఇప్పుడు అవి అందులో సగం మ్యాచ్‌లైనా ఆడటంలేదు. ఒన్‌డే ప్రపంచకప్‌ జరగడానికి ఏడాది ముందు నుంచి మాత్రమే తరచూ ఆ ఫార్మాట్‌లో సిరీస్‌లు ఆడుతున్నాయి. మెగా టోర్నీ ముగియగానే ఆ ఫార్మాట్‌ ప్రాధాన్యం కోల్పోతోంది. రెండేళ్లకోసారి జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం సన్నద్ధమయ్యే దిశగా జట్లు ఆ ఫార్మాట్లోనే సిరీస్‌లు ఆడుతున్నాయి. ఒన్‌డే మ్యాచ్‌లకు స్టేడియాలు నిండటం కష్టమవుతోంది. టీ20 అంటే మాత్రం టికెట్లు దొరకడం లేదు. క్రికెట్‌ మొదలైందే టెస్టులతో కావడం, ఆటగాళ్ల సామర్థ్యానికి వాటినే గీటురాయిగా పరిగణిస్తుండటంతో- అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)తో పాటు అన్ని టెస్టు దేశాలూ ఆ ఫార్మాట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఆదరణ బట్టే మనుగడ...

కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌ అభిమానుల ఆదరణతో దూసుకెళ్తోంది. కొత్తగా టీ10 లీగ్స్‌ వచ్చేయడంతో ‘ఇన్‌స్టంట్‌’ వినోదాన్ని క్రికెట్‌ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 2023 ఒన్‌డే ప్రపంచకప్‌ జరగబోతోంది. ఈసారి టోర్నీ జరిగేది భారత్‌లోనే కాబట్టి మన అభిమానుల్లో ఉత్సాహానికి కొదవ లేదు. భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నింటికీ స్టేడియాలు నిండిపోవడం ఖాయం. కానీ, మిగతా మ్యాచ్‌లు ఏమాత్రం ఆదరణ దక్కించుకుంటాయన్నదే ప్రశ్న. ఒన్‌డే మ్యాచ్‌ సాగే ఏడెనిమిది గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఒకప్పటిలా టీవీలకు అతుక్కుపోయి ఉంటారన్నది సందేహమే! ఈసారి ప్రపంచకప్‌ పోటీలకు ఆదరణ బాగుంటే- ఒన్‌డేలు ఇంకొన్నేళ్లు మనుగడ సాగిస్తాయి. ఇప్పటికే ఖరారైన 2027 ప్రపంచకప్‌ తరవాత కూడా మరికొన్ని టోర్నీలు చూడవచ్చు. కానిపక్షంలో, ఒన్‌డేల భవితవ్యం మీదే కాదు- తరవాతి ప్రపంచకప్‌లపైనా నీలినీడలు కమ్ముకోవడం ఖాయం!

చంద్రశేఖర్‌రెడ్డి తిమ్మాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.