స్థూలకాయులు పెరుగుతున్నారు

పల్లెలు, పట్నాలనే తేడా లేకుండా మన దేశంలో ఊబకాయం పెరుగుతోంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) జరిపిన అధ్యయనం కూడా గ్రామాలు, పట్టణాల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతోందని నిర్ధారించింది. భారతీయుల్లో స్థూలకాయం పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలూ వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో ప్రతి నలుగురు వయోజనుల్లో ఒకరు అధిక బరువు లేదా...

Published : 21 Nov 2023 00:49 IST
పల్లెలు, పట్నాలనే తేడా లేకుండా మన దేశంలో ఊబకాయం పెరుగుతోంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) జరిపిన అధ్యయనం కూడా గ్రామాలు, పట్టణాల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతోందని నిర్ధారించింది. భారతీయుల్లో స్థూలకాయం పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలూ వెల్లడిస్తున్నాయి.
భారతదేశంలో ప్రతి నలుగురు వయోజనుల్లో ఒకరు అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారని బ్లూమ్‌బర్గ్‌ సంస్థ వెల్లడించింది. అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2019-21) మొట్టమొదటిసారిగా నడుము చుట్టుకొలత ఆధారంగా ఊబకాయుల సంఖ్యను వెల్లడించింది. దాన్నిబట్టి భారతీయ పురుషులకన్నా మహిళల్లోనే ఈ తరహా ఊబకాయం అధికం. 30-49 ఏళ్ల వయసులోని ప్రతి 10 మంది మహిళల్లో అయిదారుగురు పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుతో స్థూలకాయులుగా మారినట్లు తేల్చింది. 23శాతం పురుషులు, 21.1 శాతం స్త్రీలు అధిక బరువుతో బాధ పడుతున్నారని వెల్లడించింది. 2023 ప్రపంచ స్థూలకాయ సమాఖ్య గణాంకాలను బట్టి భారతీయ వయోజనుల్లో 5.2 శాతం చొప్పున, బాలల్లో తొమ్మిది శాతం చొప్పున స్థూలకాయం పెరుగుతోంది. ఈ సమాఖ్య కూడా భారతీయ స్త్రీలలో స్థూలకాయుల సంఖ్య పెరుగుతోందని హెచ్చరించింది. నేడు ప్రపంచ జనాభాలో 38 శాతంగా ఉన్న స్థూలకాయుల సంఖ్య మరో పన్నెండేళ్లలో 51 శాతానికి పెరగనున్నదని ప్రమాద ఘంటికలు మోగించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రపంచ మధుమేహ రాజధానిగా రికార్డులకెక్కిన భారత్‌ సత్వరమే మేల్కోవాలి. స్థూలకాయం... మధుమేహం, గుండె, రక్తనాళ వ్యాధులతోపాటు పలు రుగ్మతలకు దారితీస్తుంది.

తగ్గిన శారీరక శ్రమ

భారతీయుల జీవనశైలిలో గతంలో శారీరక శ్రమకున్న ప్రాధాన్యం ఇప్పుడు లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ప్రకారం వారానికి కనీసం 150 నిమిషాలపాటు వ్యాయామం చేసే అలవాటూ తక్కువే. ప్రస్తుతం కూర్చుని చేసే వృత్తులు, ఉద్యోగాలు ఎక్కువ కావడంతో ఆహారం కొవ్వుగా మారిపోతోంది. ఫలితంగానే భారతీయుల్లో చేతులూ కాళ్లూ సన్నగా ఉంటూ, పొట్టమాత్రం ఉబ్బెత్తుగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. నేటికీ భారతీయుల ఆహారంలో 60 నుంచి 70 శాతందాకా పిండి పదార్థాలేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) స్పష్టంచేసింది. అమెరికాలో ఇది 50 శాతమే. భారతీయులు ఎక్కువ అన్నం లేదా చపాతీలు, తక్కువ కూరతో భోజనం ముగిస్తారు. పీచు, మాంసకృత్తులతో సమతులమైన ఆహారం తీసుకొనే అలవాటు తక్కువ. పెరిగిపోతున్న ఊబకాయాల్ని తగ్గించుకోవడానికి ఆస్పత్రులను ఆశ్రయించడమూ పెరుగుతోంది. 13 నుంచి 74 ఏళ్ల వయోవర్గంలో ఆర్థిక స్తోమత కలిగినవారు పొట్ట తగ్గించే శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. ఇలాంటివారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. స్థూలకాయం కారణంగా తలెత్తే వ్యాధుల చికిత్స వ్యయం భారీగా పెరగనుందని అంచనా. ప్యాకేజీ ఆహారాన్ని గుర్తించేందుకు రేటింగ్‌  పద్ధతిని ప్రవేశపెట్టడానికి భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నడుం బిగించింది. ప్యాకేజీ ఆహారంలోని పోషక విలువలను పొట్లాల మీదనే ముద్రించాలని, వాటినిబట్టి ఒకటి నుంచి అయిదు వరకు స్టార్‌ రేటింగ్‌ ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. దీనిమీద నిపుణులు, ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. ఇది మంచి ప్రతిపాదనగా ఐసీఎంఆర్‌ అభివర్ణించింది. త్వరలోనే ఈ పద్ధతి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

పదేళ్లలో మూడు రెట్లు...

పోషక విలువలు లేని చక్కెర, కొవ్వు, ఉప్పు దట్టించిన పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్‌, కేకులు, చాక్లెట్లు తినే అలవాటు భారత్‌లో పెరిగిపోతోంది. పిల్లల జన్మదిన వేడుకల్లో, ఉద్యోగుల కార్యాలయాల్లో నిర్వహించే విందుల్లో ఇలాంటి పోషక విలువలు లేని వ్యర్థాహారం (జంక్‌ఫుడ్‌) భుజించడం ఎక్కువైపోయింది. మంచినీటికి బదులు శీతల పానీయాలు తాగడమూ పెరిగింది. అమెరికా, ఐరోపాలలో జంక్‌ఫుడ్‌ వల్ల తలెత్తుతున్న అనర్థాలను గుర్తెరిగిన ప్రజలు క్రమంగా దానికి దూరం జరుగుతున్నారు. అక్కడి ప్రభుత్వాలు కూడా పోషకాల్లేని ఆహారం, శీతలపానీయాల్ని ప్రోత్సహించే వాణిజ్య ప్రకటనలపై ఆంక్షలు విధిస్తున్నాయి. చిన్నారులు ఎక్కువగా టీవీ చూసే సాయంత్రం వేళల్లో ఆ తరహా ప్రకటనలను నిషేధించారు. ఫలితంగా పాశ్చాత్య జంక్‌ఫుడ్‌ తయారీ కంపెనీలు కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నాయి. 140 కోట్ల జనాభా కలిగిన భారత మార్కెట్‌ ఆకర్షణీయంగా మారింది. భారత్‌లో పాశ్చాత్య జంక్‌ఫుడ్‌ అమ్మకాలు గడచిన పదేళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించడమే ఇందుకు తార్కాణంగా భావించాలి. ఈ క్రమంలో ఎలాంటి పోషకాలు అందించని వ్యర్థాహారానికి దూరం జరుగుతూ, శారీరక శ్రమను పెంచుకొనే జీవన శైలిని పెంచుకోవడం మేలు.
వరప్రసాద్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.