ప్రాణాలు తోడేస్తున్న క్షణికావేశం

క్షణికావేశంతో విద్యార్థులు బలవన్మరణాలను ఆశ్రయిస్తుండటం ఆందోళనకరం. పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివే వయసులోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశ భవితకు ఆధారమైన విద్యార్థులు, యువతను ఆత్మహత్యల నుంచి కాపాడే దిశగా నిర్దిష్టమైన కార్యాచరణ అవసరం.

Updated : 24 Jun 2024 04:37 IST

క్షణికావేశంతో విద్యార్థులు బలవన్మరణాలను ఆశ్రయిస్తుండటం ఆందోళనకరం. పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివే వయసులోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశ భవితకు ఆధారమైన విద్యార్థులు, యువతను ఆత్మహత్యల నుంచి కాపాడే దిశగా నిర్దిష్టమైన కార్యాచరణ అవసరం.

జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం 2022లో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో విద్యార్థులవే 7.6శాతంగా ఉన్నట్లు తేలింది. కుటుంబ వివాదాలు, ప్రమాదకరంగా మారిన బంధాలు, ప్రేమ వ్యవహారాలు, అనారోగ్యం, మానసిక సమస్యలు, పరీక్షల్లో వైఫల్యం వంటివి ఆత్మహత్యలకు కారణమవుతున్నట్లు వెల్లడైంది. పోటీ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. మనదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలపై చాలా పరిశోధనలు జరిగాయి. క్రియా యూనివర్సిటీ, బన్యన్‌ అకాడమీ ఆఫ్‌ లీడర్‌షిప్‌ ఇన్‌ మెంటల్‌హెల్త్‌ నిపుణులు జరిపిన పరిశీలనలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 2008 నుంచి 2022 మధ్య చోటుచేసుకున్న యుక్తవయసు ఆత్మహత్యలపై వీరు విశ్లేషణ జరిపారు. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా మే నుంచి నవంబరు నెలల మధ్యే ఎక్కువమంది విద్యార్థులు ప్రాణాలు బలి తీసుకుంటున్నారని తేలింది. వివిధ బోర్డులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు ఈ నెలల్లోనే విడుదలవుతుండటంతో మార్కుల కోణంలో ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు విశ్లేషించారు. చదువుపరంగా యువతలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. కొవిడ్‌ తరవాత విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు వారిలో మరింత ఒత్తిడిని పెంచాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆడపిల్లలకైతే పెళ్ళి త్వరగా చేసుకోవాలని ఒత్తిళ్లు, మగపిల్లలకైతే నిరుద్యోగానికి సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. ఈ కారణంగానూ ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వివిధ నివేదికల ఆధారంగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలపై లైంగిక వేధింపులు కూడా ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు గుర్తించారు. భావోద్వేగాల్ని నియంత్రించుకోవడంలో యుక్తవయస్కులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చాలా సర్వేల్లో బయటపడింది. కుటుంబపరమైన సమస్యలు, పరీక్షల్లో వైఫల్యం, లైంగిక సమస్యలు, ఇతర వేధింపులు జరిగినప్పుడు వాటి పర్యవసానాల్ని, బాధను తట్టుకునే సామర్థ్యం వారిలో ఉండటం లేదనేది స్పష్టమవుతోంది. ఫలితంగా ఆత్మహత్య వంటి కఠిన నిర్ణయాల్ని తీసుకుంటున్నట్లు గుర్తించారు.

యువతలో భావోద్వేగాల్ని అదుపు చేయడం, క్షణికావేశంలో తీసుకునే ఆత్మహత్య నిర్ణయాల్ని నిలువరించడం పెద్ద సవాలుగా మారుతోంది. కోచింగ్‌ కేంద్రాలకు కేంద్రమైన రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు అక్కడి పోలీసులు వసతి గృహాల్లో ఫ్యాన్లకు, గదుల్లో ఆత్మహత్య నిరోధక ఉపకరణాలను అమర్చారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఆత్మహత్యల ఆలోచనల్ని వ్యక్తీకరిస్తే, వెంటనే పోలీసులను అప్రమత్తం చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. ఏపీలోని వైద్య కళాశాలల్లో ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వారిని పసిగట్టేలా వైద్య విద్యార్థులకు తర్ఫీదులిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఒక అంకుర సంస్థ- విద్యార్థుల్లో మానసిక రుగ్మతల్ని పసిగట్టి వారిని కెరీర్‌లో ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీలకు తీసుకెళ్లి, అక్కడి ప్రముఖులతో మాట్లాడించి భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నారు. పాఠశాలల్లో వెల్‌నెస్‌ బృందాల్ని ఏర్పాటుచేసి, ఆత్మహత్య ఆలోచనలతో సతమతమవుతున్న విద్యార్థుల్ని గుర్తించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. విదార్థుల్లో ఆత్మహత్యల్ని నివారించడానికి ప్రభుత్వాలు, ఆయా రంగాల్లోని సంస్థలూ సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని నిపుణులు కోరుతున్నారు. విద్యార్థుల మానసిక సామర్థ్యాన్ని పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు జీవితంలో నిలదొక్కుకొనేందుకు తోడ్పడేలా విద్యా వ్యవస్థ రూపుదిద్దుకోవాలని చెబుతున్నారు. విద్యార్థులు ఒత్తిళ్లను వీడి, భవిష్యత్తు సవాళ్లను సులువుగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలి. పాఠశాలల్లో స్థాయిలో మానసికోల్లాస కార్యక్రమాల్ని నిర్వహించాలి. విద్యార్థుల మధ్య స్నేహభావాన్ని పెంచాలి. ఉపాధ్యాయులు, పిల్లల మధ్య సానుకూల వాతావరణాన్ని ఇనుమడింపజేయాలి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. విద్యార్థి జీవితాన్ని అంధకారంలోకి నెట్టే అలవాట్లను దూరం చేసి భవితకు బాటలు వేసే నైపుణ్యాల్ని పెంపొందించాలి. పిల్లలకోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి విద్యాబుద్ధులు నేర్పించడాన్ని కుటుంబ సభ్యులు అలవాటుగా చేసుకోవాలి. ఇలాంటి సమగ్ర చర్యలతోనే విద్యార్థుల్లో ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

బి.హిదాయతుల్లాహ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.