శాస్త్రీయంగా వన మహోత్సవం

రాష్ట్రంలో హరితహారం పేరుతో దశాబ్దకాలంపాటు మొక్కలు నాటుతూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం ‘వన మహోత్సవం’గా పేర్కొంటూ నిధులు కేటాయించింది. దీని కింద ఈ వానాకాలంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్షించారు.

Published : 04 Jul 2024 01:37 IST

రాష్ట్రంలో హరితహారం పేరుతో దశాబ్దకాలంపాటు మొక్కలు నాటుతూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం ‘వన మహోత్సవం’గా పేర్కొంటూ నిధులు కేటాయించింది. దీని కింద ఈ వానాకాలంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్షించారు. ఇందుకు సంబంధించిన లోగోను సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల ఆవిష్కరించారు. శాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ, ప్రజల భాగస్వామ్యంతో చేపడితే వన మహోత్సవం విజయవంతమవుతుంది.

ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌-2021 నివేదిక ప్రకారం, 2015లో తెలంగాణలోని మొత్తం అటవీ ప్రాంతం 19,854 చదరపు కిలోమీటర్లు. వివిధ సంరక్షణ చర్యలవల్ల అది 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో పోడు వ్యవసాయం, అడవుల నరికివేత నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ‘హరితహారం’ కింద దశాబ్ద కాలంగా చేపడుతున్న మొక్కల పెంపకం మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. నాటే మొక్కల సంఖ్య మీద పెట్టినంత శ్రద్ధ వాటి సంరక్షణ మీద చూపడంలేదన్న విమర్శలున్నాయి. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవాన్ని శాస్త్రీయంగా చేపడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. ఒకే రకమైన మొక్కలను నాటడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అన్ని రకాల మొక్కలు ఉన్నప్పుడే జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యపడుతుంది. ఉదాహరణకు యూకలిప్టస్, సుబాబుల్, కోనోకార్పస్‌ మొక్కలను పెద్దయెత్తున నాటడంవల్ల ప్రయోజనంకంటే నష్టమే ఎక్కువ. కాబట్టి వృక్షశాస్త్ర పరిశోధకులు, విశ్వవిద్యాలయాల్లోని వృక్షశాస్త్ర విభాగాలు, ఉద్యాన విభాగాలు, అటవీశాఖల సంయుక్త ఆధ్వర్యాన జిల్లా, మండల, గ్రామ స్థాయుల్లో కమిటీలను ఏర్పరచి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మొక్కలను నాటడం మేలు. తొందరగా పెరిగే విదేశీ మొక్కల కంటే స్వదేశీ మొక్కలను నాటడమే ఉత్తమం. విదేశీ మొక్కలను నాటే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి. లేకుంటే వాటివల్ల దుష్పరిణామాలు సంభవించే ప్రమాదముంది. కోనోకార్పస్‌ మొక్కలను నాటడంవల్ల ఇప్పటికే పర్యావరణ సంబంధిత దుష్ప్రభావాలు చూస్తున్నాం. వాటికి బదులు స్థానికంగా లభించే పొగడ, పారిజాతం, గన్నేరు వంటి మొక్కలను నాటవచ్చు. అటవీ వృక్షాలైన అందుగు, తునికి, బాడిత, మర్రి, జువ్వి, తడ, కొరివి, వెలగ, ఇప్ప, పాల, కానుగ, ఆరె, పారిజాతం, ఉసిరి, జమ్మి, కుంకుడు, తెల్లమద్ది, గొట్టి, పాల కొడిశ వంటివి నాటడం ద్వారా స్వదేశీ మొక్కల జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, చెరువులు శిఖం భూములు, ట్యాంక్‌బండ్‌లు, సింగరేణి ఉపరితల గనులు, నీటి పారుదల కాలువలు, విద్యాసంస్థలు వంటి చోట్ల పెద్ద సంఖ్యలో మొక్కలను నాటే అవకాశముంది. మనం చేరుకోలేని, మొక్కలను నాటడానికి అనువుకాని గుట్టలు వంటి చోట్ల విత్తన బంతుల ప్రయోగం విజయవంతం కాగలదు. చెరువు గట్ల వెంబడి ఈత, తాటి మొక్కలను నాటడం ఎంతో ప్రయోజనకరం. అయితే మొక్కలను నాటే విషయంలో నేల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. నాటిన మొక్కలన్నింటికీ జియో ట్యాగింగ్‌ చేయడం ద్వారా వాటి సంరక్షణను ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుంది. మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించడంలో జాతీయ సేవా పథకం, ఉపాధి హామీ పథకంతో పాటు స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలి. అర్బన్‌ ఫారెస్ట్‌లు నగరాలు, పట్టణాలకు ఊపిరితిత్తుల వంటివి. వాటిని విస్తరించడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ స్థాయులు మెరుగుపడతాయి.

పురాతన కాలం నుంచీ ఉన్న చింత వనాలను నేడు మనం విస్మరిస్తున్నాం. చింత మొక్కలను నాటడంవల్ల వాణిజ్యపరంగానూ లబ్ధి చేకూరుతుంది. ఈ చెట్లు అనేక రకాల పక్షి జాతులకు ఆవాసాన్ని కల్పిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణకు తోడ్పడతాయి. ప్రస్తుతం కిలో చింతపండు ధర సుమారు రూ.200 పలుకుతోంది. తెలంగాణ రాష్ట్ర పుష్పంగా విలసిల్లుతున్న తంగేడు మొక్కలను విరివిగా నాటాలి. భారీ వృక్షాల మధ్య వీటిని నాటడం ప్రయోజనకరంగా ఉంటుంది. రహదారుల పక్కన, చిన్నపాటి గుట్టల మధ్య ఇటువంటి మొక్కలను పెంచడంవల్ల నేలకోతను అరికట్టే వీలుంది. తంగేడు అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉండటమే కాకుండా తోలు శుద్ధిలో ఉపయోగపడుతుంది. కాబట్టి, వన మహోత్సవంలో ఇటువంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం మేలు. అప్పుడే జాతీయ అటవీ విధానం లక్షించినట్లు- మొత్తం భూభాగంలో కనీసం 33శాతం మేర పచ్చదనం పరచుకుంటుంది.

డాక్టర్‌ ఎలగొండ నరసింహమూర్తి
(సహాయ ఆచార్యులు, వృక్షశాస్త్ర విభాగం, శాతవాహన విశ్వవిద్యాలయం) 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.