పాలనలో తెలుగుకు పెద్దపీట

మాతృభాష... ఒక జాతి ప్రజల అస్తిత్వానికి చిహ్నం. మేధా సామర్థ్యాల వికాసం, సృజనాత్మక ఆలోచనలకు మాతృభాషే ఆలంబన. ముఖ్యంగా, పాలన ప్రజల భాషలో సాగినప్పుడే పౌరసేవలు సామాన్యులకు చేరువవుతాయి. ఏపీలో నూతన ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. 

Published : 04 Jul 2024 01:38 IST

మాతృభాష... ఒక జాతి ప్రజల అస్తిత్వానికి చిహ్నం. మేధా సామర్థ్యాల వికాసం, సృజనాత్మక ఆలోచనలకు మాతృభాషే ఆలంబన. ముఖ్యంగా, పాలన ప్రజల భాషలో సాగినప్పుడే పౌరసేవలు సామాన్యులకు చేరువవుతాయి. ఏపీలో నూతన ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. 

ప్రజల ఆకాంక్ష మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. అన్ని ప్రాంతాలు, వర్గాలు భారీయెత్తున ప్రభుత్వ మార్పును కోరుకున్నారంటే- వారి ఆశలు, అంచనాలు సైతం అంతే స్థాయిలో ఉంటాయని గమనించాలి. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు సమర్థంగా సామాన్యులకు చేరువ కావాలంటే- పాలన తెలుగులో సాగాలి. ఈ క్రమంలో అన్ని రంగాల్లో కొత్త సర్కారు తెలుగు భాషకు పట్టం కట్టాలి. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల పేర్లు, అధికారులు, ప్రజాప్రతినిధుల నామఫలకాలు, శంకుస్థాపన ఫలకాలు అన్నీ తెలుగులోనే ఉండేలా చూడాలి. ఆంగ్లంలో ఉండటం తప్పనిసరి అయినప్పుడు- మొదట తెలుగులో రాసి, దాని కింది వరసలో ఆంగ్లంలో రాయాలి. ప్రభుత్వ ఉత్తర్వులన్నింటినీ తెలుగులోకి తర్జుమా చేయించి కార్యాలయాలు, వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలి. ఆంగ్లం నుంచి తెలుగులోకి చక్కగా అనువాదం చేయడంతో పాటు టైపింగు తెలిసిన సిబ్బందిని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నియమించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రారంభించి, తెలుగు భాష వినియోగాన్ని క్రమంగా న్యాయవ్యవస్థకు విస్తరింపజేయాలి. అనువాదాలు వీలైనంత సరళంగా, అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పారిభాషిక పదకోశాలను రూపొందించుకోవాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తే ఇది అసాధ్యమేమీ కాదు.

ఆధునిక సమాజంలో ఆంగ్లం నేర్చుకోవడం ఒక అవసరంగా మారింది. అంత మాత్రాన మాతృభాషను మరచిపోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, తల్లి భాషపై సరైన పట్టు సాధిస్తే ఇతర భాషలను తేలిగ్గా నేర్చుకోవడానికి అది ఎంతగానో అక్కరకొస్తుంది. అందుకే చిన్ననాటి నుంచే పిల్లలకు మాతృభాషను నేర్పించాలి. అమ్మభాషలో చదువుకోవడం వల్ల విద్యార్థి మేధ వికసిస్తుందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ క్రమంలో కనీసం ప్రాథమిక స్థాయి దాకా, వీలైతే ఆ పై తరగతుల్లోనూ అమ్మభాషలో విద్యాబోధన సాగాలని నూతన జాతీయ విద్యావిధానం సూచించింది. పాలకులు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కేవలం బడులను ఆంగ్ల మాధ్యమానికి మారిస్తే సరిపోదు. ఇంగ్లిష్‌లో పాఠాలు బోధించగల ఉపాధ్యాయులను నియమించాలి. వారికి కాలానుగుణంగా బోధనలో శిక్షణ అందించాలి. లేకుంటే విద్యార్థులు అటు ఇంగ్లిష్, ఇటు తెలుగు రెండింటిలో ప్రావీణ్యం లేకుండా తయారయ్యే ప్రమాదం ఉంది.

తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం, సంగీతం ఇతర లలిత కళలను ప్రోత్సహించడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన అకాడమీలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది. వాటికి అవసరమైన నిధులను సమకూర్చి సమర్థులైనవారికి బాధ్యతలు అప్పగించాలి. చిన్నారుల్లో తెలుగు భాష, మన సంస్కృతి, కళల పట్ల అనురక్తిని పెంచాలి. తెలుగులోని ప్రఖ్యాత గ్రంథాలు, సాహిత్యాన్ని వారికి పరిచయం చేయాలి. దానివల్ల తెలుగు జాతి గొప్పదనం వారికి తెలిసివస్తుంది. తెలుగు నేలపై గౌరవం పెరుగుతుంది. ప్రజలు కేవలం ప్రభుత్వంపై ఆధారపడేలా మాత్రమే చేయకుండా, పరిపాలనలో వారికి భాగస్వామ్యం కల్పించాలి. ఆంధ్రప్రదేశ్‌ త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు అనేక రకాలుగా సహాయపడటానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. పచ్చదనం-పరిశుభ్రత, పార్కుల సుందరీకరణ, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు అవసరమైన ఉపకారవేతనాలు అందించడం లాంటి అనేక అంశాల్లో అలాంటివారి సేవలు ఎంతగానో అక్కరకొస్తాయి. ప్రభుత్వం వాటిని వినియోగించుకోవాలి. వివిధ రంగాల్లో సుదీర్ఘకాలం పనిచేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నవారి మేధాసంపత్తిని ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో స్థిరపడి విద్య, వైద్యం, శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో విశేష ప్రగతి సాధించిన అనేకమంది ప్రవాసాంధ్ర మేధావులు తరచుగా తమ మాతృభూమిని సందర్శిస్తుంటారు. వారిలో అనేకమంది తమ విజ్ఞానాన్ని తెలుగు నేలమీద ఆయా రంగాల ప్రముఖులతో ముఖ్యంగా యువతతో పంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వారి అనుభవాలు, విజయగాథలను మన యువత తెలుకొని, స్ఫూర్తి పొందేలా చూడాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.

డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర
(డాలస్, టెక్సస్‌ రాష్ట్రం, అమెరికా) 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.