పల్లె వెలగాలి... దేశం గెలవాలి!

దశాబ్దాలు గడుస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినప్పటికీ, దేశంలో పల్లెల ముఖచిత్రం మాత్రం పెద్దగా మారడంలేదు! భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి గ్రామాల పురోగతి అత్యంత కీలకం. అందుకు ప్రభుత్వాలతోపాటు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలి.

Published : 05 Jul 2024 01:22 IST

దశాబ్దాలు గడుస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినప్పటికీ, దేశంలో పల్లెల ముఖచిత్రం మాత్రం పెద్దగా మారడంలేదు! భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి గ్రామాల పురోగతి అత్యంత కీలకం. అందుకు ప్రభుత్వాలతోపాటు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలి.

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రపం చంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా- సమీప భవిష్యత్తులో మూడో స్థానాన్ని ఆక్రమిస్తుందంటున్నారు. దేశం మంచి వృద్ధిరేటు సాధిస్తోందని, తమ పనితీరుకు ఇదే నిదర్శనమని పాలకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, అభివృద్ధి ఫలాలు అధిక శాతం ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణులకు అందడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా దేశవ్యాప్తంగా 201 గ్రామీణ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో ఆ సంఖ్య 126 స్థానాలకే పరిమితమైంది. దీన్నిబట్టి గ్రామీణ ఓటర్లలో అసంతృప్తిని అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరగడం, ఆదాయాలు తగ్గడం, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ఎక్కువకావడం వంటివి గ్రామీణ ఓటర్లలో అసంతృప్తికి ప్రధాన కారణాలని ఎన్నికల అనంతరం లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతోందనే విషయంతో పాటు ఆ ఫలాలు ఎవరెవరికి ఎంతమేర అందుతున్నాయనేదీ కీలకమని ప్రభుత్వాలు గుర్తెరగాలి.

ఉపాధి కల్పన కీలకం

పట్టణాభివృద్ధితో పోలిస్తే గ్రామీణాభివృద్ధి విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మునుపటి ప్రభుత్వాలన్నీ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు వేస్తూ, నిధులు కేటాయిస్తూ వచ్చాయి. అయినప్పటికీ, ఆ ప్రణాళికలేవీ సరిగ్గా అమలు కాకపోవడం, నిధుల్ని సక్రమంగా వినియోగించకపోవడంతో గ్రామాల అభివృద్ధి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అలాగని గతాన్ని గుర్తుచేసుకుంటూ నిట్టూర్పుతో కూర్చోవాల్సిన సమయం కాదిది. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు- ‘భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచినా, పేద దేశంగానే ఉంటుంది’ అని ఇటీవల వ్యాఖ్యానించారు. అలా కాకూడదంటే వృద్ధిరేటు పెరగడంతోపాటు అభివృద్ధి ఫలాలు అందరికీ అందడం ముఖ్యమని ఆయన సూచించారు. ఇక్కడ గమనిస్తే, అభివృద్ధి ఫలాలు అందాల్సినవారు గ్రామాల్లోనే అధికంగా ఉన్నారు.
‘పిల్లాడిని పెంచి పెద్దచేయడానికి ఒక గ్రామమంతా సాయపడుతుంది(ఇట్‌ టేక్స్‌ ఏ విలేజ్‌ టు రైజ్‌ ఏ చైల్డ్‌)’ అనేది సామెత. ఆ విధంగానే ఒక గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే ఎన్నో చేతులు కలవాలి. ప్రభుత్వాలు, వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణులు, ఊరిని విడిచి ఇతర ప్రాంతాల్లో ఉన్నతస్థాయిలో స్థిరపడినవారు కలిసిరావాలి. బడులు, ఆస్పత్రులు, రహదారులు, ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకొంటున్నా గ్రామీణ ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు రావడం లేదు. పల్లెలు ప్రగతి సాధించడంలో ఉపాధి అవకాశాలే కీలకం. గ్రామీణ ఉపాధి హామీ పథకం దాదాపు రెండు దశాబ్దాలుగా అమలులో ఉన్నప్పటికీ, దానివల్ల పల్లెలకు అనుకున్నంత మేలు జరగడంలేదనే చెప్పాలి. ఎన్డీయే ప్రభుత్వానికి ఈ పథకంపై అసంతృప్తి ఉన్నా, సరైన ప్రత్యామ్నాయం చూపలేక అలాగే కొనసాగిస్తోందన్న విమర్శలున్నాయి. ఏటికేడు పెరుగుతున్న ఎండలు గ్రామీణుల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏడాది పొడవునా ఆర్థిక ప్రయోజనాలు కల్పించే పథకంగా ఉపాధి హామీని తీర్చిదిద్దాలి. ఉదాహరణకు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే కార్యక్రమంలో గ్రామీణులకు భాగస్వామ్యం కల్పించవచ్చు. పండ్ల మొక్కల ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.

తాయిలాల ప్రభావం తాత్కాలికమే

విభిన్న భౌగోళిక పరిస్థితులున్న దేశంలో అన్నిచోట్లా ఒకే రకమైన పరిష్కారాలు అక్కరకు రావు. కాబట్టి, ఎక్కడికక్కడ స్థానిక అభివృద్ధి ప్రణాళికలు అవసరం. అనంతపురంలో ఒకప్పుడు కరవు తాండవించేది. ఇప్పుడు అక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ స్థాపించిన రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు వంటి స్వచ్ఛంద సంస్థల కృషివల్ల అక్కడ కొద్దిమేర మార్పు సాధ్యమైంది. కర్ణాటకలో దేశ్‌పాండే ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్‌లో యూత్‌ క్లబ్‌ ఆఫ్‌ బెజ్జిపురం, తెలంగాణలో కాకతీయ శాండ్‌బాక్స్‌ వంటి సంస్థలు గ్రామీణులను స్వయం ఉపాధివైపు నడిపిస్తున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. ఉచిత తాయిలాల ప్రభావం తాత్కాలికమే తప్ప దీర్ఘకాలంలో వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న విషయాన్ని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తించాలి. పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాలు గట్టి పునాదులు వేయాలి.

సుంకరి చంద్రశేఖర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.