ముప్పు నివారణకు ముందుజాగ్రత్తలు

ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్‌ ‘రేబిస్‌’ నివారణకు మొదటి టీకాను విజయవంతంగా అందించిన జులై 6వ తేదీని ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అనాదిగా జంతువుల నుంచి మనుషులకు అనేక రకాల వ్యాధులు సోకుతున్నాయి.

Published : 06 Jul 2024 01:06 IST

ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్‌ ‘రేబిస్‌’ నివారణకు మొదటి టీకాను విజయవంతంగా అందించిన జులై 6వ తేదీని ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అనాదిగా జంతువుల నుంచి మనుషులకు అనేక రకాల వ్యాధులు సోకుతున్నాయి. ఇటువంటి రుగ్మతల పట్ల అందరికీ అవగాహన పెంపొందించి, వాటిని నివారించడం ఈ దినోత్సవ లక్ష్యం.

జంతువుల నుంచి మనుషులకు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్న జీవులు సంక్రమించడంవల్ల జూనోటిక్‌ వ్యాధులు తలెత్తుతాయి. ఇటీవలి కాలంలో మనుషుల్లో వ్యాప్తి చెందుతున్న అంటువ్యాధుల్లో దాదాపు 60శాతం ఇటువంటి స్వభావాన్నే కలిగి ఉంటున్నాయి. వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్న సూక్ష్మజీవుల్లో 70శాతం వరకు వన్యప్రాణుల ద్వారా సోకుతున్నాయి. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) అధ్యయనం ప్రకారం, 2009-23 మధ్యకాలంలో దేశంలో 388 పర్యాయాలు జపనీస్‌ ఎన్‌కెఫలైటిస్, లెప్టోస్పిరోసిస్, స్రబ్‌టైఫూస్, ఆంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్, వెస్ట్‌నైల్‌ వైరస్, ఇన్‌ఫ్లూయెంజా వంటి జంతు కారక వ్యాధులు విజృంభించినట్లు అది విశ్లేషించింది. ఇటీవల దోమల నుంచి సంక్రమించే జికా వైరస్‌ కేసులు పుణెలో వెలుగుచూశాయి. కొన్ని నెలల క్రితం కోల్‌కతాలో ఉండి ఆస్ట్రేలియాకు వెళ్ళిన రెండేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

అంతర్జాతీయ పశువుల పరిశోధన సంస్థ నివేదిక- ప్రపంచవ్యాప్తంగా ఏటా జూనోటిక్‌ వ్యాధుల కారణంగా 240కోట్ల అనారోగ్య కేసులు నమోదవుతున్నాయని, బాధితుల్లో 27లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని విశ్లేషించింది. ఇటువంటి వ్యాధులు జంతువుల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దాంతో పాడి రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. జూనోటిక్‌ వ్యాధులు సంక్రమించడమనేది జంతువులు, మనుషులతో పాటు పర్యావరణంతోనూ ముడివడి ఉంటుంది. అంతకంతకు పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహారం, పశు సంపద, ఆవాసం, తవ్వకాల కోసం పెద్దయెత్తున అడవులను నరికేస్తున్నారు. వన్యప్రాణులు ఆహారం, నీటి కోసం సమీప గ్రామాలు, జనావాసాల్లోకి వస్తున్నాయి. వేటగాళ్లు, వ్యాపారులు వివిధ వన్యప్రాణులను వేటాడి, బంధించి, అపరిశుభ్రంగా ఉండే మార్కెట్‌ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఆ క్రమంలో రోగనిరోధక శక్తి బలహీనపడిన ప్రాణుల్లోని వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రబలుతున్నాయి. పరిసరాలు, మాంసం ద్వారా వ్యాపారులు, వినియోగదారులకు సోకి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జంతు కారక వ్యాధులు మహమ్మారిలాగా విరుచుకుపడుతున్నాయని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవలి అధ్యయనం ప్రకారం, సుమారు 60శాతం పెంపుడు జంతువుల యజమానులు ఇంట్లో తాము పడుకొనే ప్రదేశాల్లో వాటిని ఉంచుతున్నారు. మరికొందరు విదేశాల నుంచి జీవులను తెప్పించుకుని ఇళ్లలో సాకుతున్నారు. అయితే సకాలంలో సరైన టీకాలు ఇవ్వకపోవడంవల్ల వాటి నుంచి వ్యాధులు సంక్రమిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు జంతువులను ప్రత్యేకమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచడంతో పాటు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం చాలా అవసరం. కుక్కలకు టీకాలు ఇవ్వడం ద్వారా మనుషులకు రేబిస్‌ సోకకుండా జాగ్రత్తపడే అవకాశముంది.ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న రేబిస్‌ మరణాల్లో అత్యధికంగా 36శాతం ఒక్క భారత్‌లోనే చోటుచేసుకుంటుండటం అత్యంత విచారకరం.

కేంద్ర ప్రభుత్వం 2030కల్లా భారత్‌ నుంచి రేబిస్‌ను పూర్తిగా తరిమివేయాలని లక్షించింది. దాన్ని చేరుకోవాలంటే జాతీయ రేబిస్‌ నియంత్రణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చిత్తశుద్ధితో అమలు చేయాలి. డెంగీ వంటి వ్యాధులు కాలానుగుణంగా వస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వీటి ముప్పు ఎక్కువగా ఉంటోంది. కాబట్టి వైద్య అధికారులు, సిబ్బంది జంతువుల ద్వారా సోకే వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు వాటి నిర్ధారణ, నియంత్రణకు మరింతగా కృషి చేయాలి. పాడి పశువులు, పౌల్ట్రీలలో ఉండే జీవుల నుంచి వ్యాధులు సోకే ముప్పు ఎక్కువ. కాబట్టి జంతువులతో పాటు అక్కడ పనిచేసేవారికీ టీకాలు వేయించాలి. వన్యప్రాణులను వేటాడటం, నిర్బంధించడం వంటి చర్యలపై అటవీశాఖ ఉక్కుపాదం మోపాలి. భారత్‌లో జంతుకారక వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవడానికి జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ఇటీవల బహుముఖ కార్యాచరణ చేపట్టింది. ‘జాతీయ ఒన్‌ హెల్త్‌ కార్యక్రమం’ కింద ప్రభుత్వ విభాగాలను సమన్వయపరచి జూనోటిక్‌ వ్యాధుల నివారణతో పాటు ప్రజారోగ్యాన్ని, జీవన నాణ్యతను పెంపొందించాలని సంకల్పించింది. ప్రజాభాగస్వామ్యంతో దీన్ని విస్తృతస్థాయిలో చేపడితే జంతుకారక వ్యాధులను సమర్థంగా నివారించగల వీలుంది.

 శ్రీనివాస్‌ సిరిపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.